grosvenor Hotel
-
గ్రాస్‌వీనర్‌కు బిడ్డింగ్ వేయడం లేదు: సహారా
న్యూఢిల్లీ: గ్రాస్‌వీనర్ హోటల్ కొనుగోలుపై వస్తున్న వార్తలకు తెర దించుతూ, లండన్‌లోని తమ గ్రాస్‌వీనర్ హోట ల్ అమ్మకపు వేలంలో (బిడ్డింగ్) తాము పాల్గొనడం లేదని సహారా గ్రూప్ స్పష్టంచేసింది. ఇచ్చిన రుణాలను చెల్లించక పోవడంతో బ్యాంకు ఆఫ్ చైనా సహారాకు చెందిన గ్రాస్‌వీనర్ హోటల్‌తోపాటు మరో రెండు విదేశీ హోటళ్లను అమ్మకానికి ఉంచిన విషయం తెలిసిందే. 2010-12 మధ్యకాలంలో 1.55 బిలియన్ డాలర్లు వెచ్చించి సహారా గ్రూప్ కొనుగోలు చేసిన ఈ ప్రాపర్టీల మొత్తం ప్రస్తుతం 2.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చు. -
గ్రాస్‌వీనర్ హోటల్ కొనుగోలు రేసులో సహారా!
లండన్/న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న సహారా గ్రూప్ తాజాగా సొంత గ్రాస్‌వీనర్ హోటల్ వేలంలో చేజారిపోకుండా మళ్లీ కొనుక్కునేందుకు పోటీపడుతోంది. లండన్‌లోని ఈ హోటల్‌తో పాటు మరో రెండు విదేశీ హోటల్స్ కొనుగోలు కోసం సహారా గ్రూప్‌కి గతంలో బ్యాంక్ ఆఫ్ చైనా రుణం ఇచ్చింది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో సహారా గ్రూప్ సాంకేతికంగా డిఫాల్ట్ కావడంతో దీన్ని వేలానికి ఉంచింది. దీంతో బ్యాంక్ ఆఫ్ చైనా నుంచి తీసుకున్న రుణాలను మరో ఆర్థిక సంస్థకు బదలాయించే ప్రక్రియ ఒకవైపు కొనసాగిస్తూనేమరో ఫైనాన్షియర్ ఊతంతో గ్రాస్‌వీనర్ హోటల్‌కు బిడ్డింగ్ కూడా వేస్తోంది సహారా గ్రూప్. ఇన్వెస్టర్లకు రూ. 24,000 కోట్ల చెల్లింపులు జరపాల్సిన కేసులో ఏడాది కాలంగా తీహార్ జైల్లో ఉన్న గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ విడుదల కోసం నిధులు సమీకరించుకోవడంతోపాటు గ్రాస్‌వీనర్ హోటల్ కూడా చేజారిపోకుండా చూడాలన్నది కూడా కంపెనీ లక్ష్యం కావొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2010-2012 మధ్య కాలంలో 1.55 బిలియన్ డాలర్లు పెట్టి సహారా గ్రూప్ కొనుగోలు చేసిన మూడు ప్రాపర్టీల విలువ ప్రస్తుతం 2.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా.