గృహభంగం
పోయిన వేసవి సెలవులకి ఎలాగైనా సార్థకత కలిగించాలని మొదట్లో అనుకున్న మాట. అనేక ప్రణాళికలు, ప్రయాసలు. అన్నీ అటకకి ఎక్కించడం పూర్తయ్యాక, అసంపూర్ణంగా మిగిలిపోయిన ఏ కవితో రాత్రుల్ని రక్కసిలా నమిలి మింగేసేది. ప్రతి అనుభవమూ ఓ కథావస్తువై నన్ను ఊరించేది. ఈ సెలవులూ వృథాగా జారిపోతున్నాయి కదా అని బాధపడుతూ, కాలం నదీగట్టున నేనొక జాలరినై క్షణాల్ని ఒడిసిపట్టుకునేవేళ ఈ సెలవుల్ని సార్థకం చేసుకునే ఒక సువర్ణ అవకాశం తటస్థించింది. ఆదివారం సంతలో రోడ్డు ఒడ్డున సేదదీరుతున్న పుస్తకపుంగవుల్లోంచి ఎస్.ఎల్.భైరప్ప నిటారుగా లేచి నిలబడి నేరుగా నా చేతుల్లో ‘గృహభంగ’మై ఒదిగిపోయాడు.
కన్నడ నుంచి తెలుగు చేయబడ్డ ఈ నవల 1925-40ల నాటి కథాంశంతో నడుస్తుంది. మూర్ఖురాలైన ఓ ఇంటావిడ తన కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేసుకుందన్నదే వస్తువు. అలాంటి ఇంటికి కోడలుగా వస్తుంది నంజమ్మ. సంసారం పట్టని భర్త, అయినదానికీ కానిదానికీ బూతుపురాణం వల్లించే అత్త మధ్య నలగలేక వేరుకాపురం పెట్టి, ముగ్గురు పిల్లల్నీ మూర్ఖపతినీ పోషించడానికి ఆమె పడే తపన కట్టిపడేస్తుంది.
నంజమ్మ తండ్రి సింహంలాంటి కంఠీజోష్యులు దేశంమీద పడి తిరుగుతూ వుంటాడు. మహదేవయ్య బిక్షమెత్తుకునే సన్యాసి. నంజమ్మకు తండ్రిలా సాయపడతాడు. యింకా వేశ్య నరసి పాత్ర, మరిది అప్పణ్ణయ్య పాత్ర తమతమ ధర్మాన్ని నిర్వర్తిస్తాయి.
గమ్మత్తయిన విషయమేంటంటే నవలావరణంలోకి మనల్ని లాగి రచయిత అదృశ్యమౌతాడు. మనం పాత్రల మధ్యకి ప్రవేశించి నంజమ్మతో పాటు కడుపు కాల్చుకుంటాం. గంగమ్మ బూతులకు చెవులు మూసుకుంటాం. కంఠీజోష్యుల గుర్రపుడెక్కల శబ్దానికి జడుసుకుంటాం. కడగొట్టు సంతానం విశ్వన్నను ఎలా కాపాడుకోవాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటాం. చదవడం పూర్తయ్యాక నంజమ్మను లోకానికి పరిచయం చేయాలని తపిస్తాం.
కొత్తపల్లి సురేశ్, 9493832470