జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతం
జాతీయం
భారత్‌కు అమెరికా రాయబారిగా రిచర్డ్ ప్రమాణం
భారత్‌కు అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికా మేధావి వర్గంలో ప్రముఖుడుగా చెప్పదగిన రాహుల్ వర్మ నాన్సీ పోవెల్ స్థానంలో అమెరికా రాయబారిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆయన నియామకాన్ని అమెరికా సెనేట్ గతంలో మూజువాణి ఓటుతో ఆమోదించింది. భారత్‌కు అమెరికా రాయబారిగా నియమితుడైన తొలి భారతీయ అమెరికన్‌గా రిచర్డ గుర్తింపు పొందారు.
రా, సీఆర్పీఎఫ్లకు కొత్త సారథులు
భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధిపతిగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 19న రాజిందర్ ఖన్నాను నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రివర్గ ఎంపికల కమిటీ ఖన్నా నియామకానికి ఆమోదం తెలిపింది. ఖన్నా డిసెంబర్ 31 నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఆర్ఏఎస్ కేడర్‌కు చెందిన ఖన్నా 1978 బ్యాచ్ అధికారి. హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత) ప్రకాశ్మిశ్రాను సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్‌గా ప్రభుత్వం నియమించింది.
లోక్‌సభలో జీఎస్టీ బిల్లు
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ డిసెంబర్ 20న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రవేశపన్ను, ఆక్ట్రాయ్, సేవా పన్ను వంటి అనేక పన్నులు ప్రత్యేకంగా లేకుండా ఒకటే పన్ను విధానాన్ని 2016, ఏప్రిల్ నుంచి అమలు చేసే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించారు. 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా దీన్ని తీసుకొచ్చారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్ 18న చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి ప్రయోగం చేపట్టారు. ఈ రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ అట్మాస్పియరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ (కేర్)ను ప్రయోగించారు. భూమికి 126 కి.మీ. ఎత్తులో రాకెట్ నుంచి క్రూ మాడ్యూల్ (వ్యోమగాముల గది) విడిపోయింది. తర్వాత పారాచూట్ సహాయంతో బంగాళాఖాతంలో దిగింది. ఈ ప్రయోగం మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు, బరువైన ఉపగ్రహాలను సొంతంగా ప్రయోగించేందుకు తోడ్పడుతుంది. జీఎస్ఎల్వీ మార్క్ 3 (ఎల్వీఎం 3) రాకెట్ ఎత్తు 43.43 మీటర్లు, బరువు 630.58 టన్నులు.
సూపర్ ఎర్త్‌ను గుర్తించిన
నాసా కెప్లర్ మిషన్
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ సూపర్ ఎర్త్‌ను గుర్తించినట్లు డిసెంబర్ 19న శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది భూమికి దాదాపు 180 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీనికి హెచ్ఐపీ116454బిగా పేరు పెట్టారు. ఇది వ్యాసంలో భూమి కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
గ్లైడ్ బాంబును పరీక్షించిన భారత్
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన వెయ్యి కిలోల గ్లైడ్ బాంబును డిసెంబర్ 19న పరీక్షించారు. ఇది విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. వాయుసేనకు చెందిన విమానం ద్వారా బాంబును తీసుకెళ్లి ఒడిశా తీరంలోని బంగాళాఖాతంలో జారవిడిచారు.
రాష్ట్రీయం
చంద్రశేఖరరెడ్డికి
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
తెలుగు రచయిత, విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన తెలుగులో రాసిన ‘మన నవలలు, మన కథానికలు’ అనే పుస్తకానికి ఉత్తమ విమర్శకుడిగా ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రశేఖరరెడ్డి ప్రస్తుతం సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రానికి ప్రధాన బాధ్యులుగా సేవలందిస్తున్నారు. 22 భాషలకు చెందిన వారికి సాహిత్య అకాడమీ డిసెంబర్ 19న పురస్కారాలు ప్రకటించింది. పురస్కారం కింద తామ్ర పత్రం, లక్ష రూపాయలు ప్రదానం చేస్తారు.
నూతన వరి వంగడం ఎంటీయూ-1156
పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎంటీయూ-1156 పేరిట కొత్త వరి వంగడాన్ని డిసెంబర్ 16న విడుదల చేసింది. వరిలో ఐదు నుంచి పది శాతం అదనంగా దిగుబడి పెంచాలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలు ఈ వంగడాన్ని రూపొందించారు. ఇది దాళ్వాకు అనువుగా ఉంటుందని, 120 రోజుల కాల పరిమితిలో కోతకు వస్తుందని పరిశోధకులు వెల్లడించారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తొలి చైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి డిసెంబర్ 18న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గతంలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త సర్వీస్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్, సభ్యులు ఆరేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారు.
ఏపీ సీఆర్డీఏ బిల్లుకు శాసన సభ ఆమోదం
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిసెంబర్ 22న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ప్రస్తుతమున్న విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి పట్టణాభివృద్ధి సంస్థ రద్దవుతుంది. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే రాజధాని ప్రణాళిక, నిర్మాణం, పాలనకు సంబంధించి సీఆర్డీఏ ఏర్పాటవుతుంది. రాజదాని ప్రాంత పరిధిలో భూ సమీకరణ పథకం, పట్టణ ప్రణాళిక పథకం, ప్రత్యేక ప్రాంత అభివృద్ధి పథకం పర్యవేక్షణ అధికారం సీఆర్డీఏకి ఉంటుంది. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా ఉంటారు.
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు ‘తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి’ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 18న ఉత్తర్వులు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఎక్స్అఫీషియో వైస్‌చైర్మన్‌గా ఆర్థికమంత్రి వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకొని, సమగ్రాభివృద్ధి సాధించేందుకు వీలుగా ప్రణాళిక మండలి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తుంది.
అంతర్జాతీయం
పాక్‌లో ఉగ్రవాదుల దాడిలో 148 మంది మృతి
పాకిస్తాన్‌లోని పెషావర్‌లో సైనిక పాఠశాలపై డిసెంబర్ 16న ఆత్మాహుతి దళ తాలిబన్లు జరిపిన దాడిలో 148 మంది మరణించారు. వీరిలో 132 మంది విద్యార్థులున్నారు. పాక్ సైన్యం జరిపిన ఎదురుదాడిలో ముగ్గురు తాలిబన్లు మరణించగా, నలుగురు తమను తాము పేల్చుకున్నారు. ఉత్తర వజీరిస్తాన్‌లో పాక్ సైన్యం దాడులకు ప్రతీకారంగా సైనిక పాఠశాలపై దాడి చేసినట్లు తెహ్రీక్ ఇ తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
అత్యంత అధిక స్థాయికి ఇై2 ఉద్గారాలు
శిలాజ ఇంధనాలను మండించడం, పారిశ్రామిక కార్యకలాపాల కారణంగా 2013లో ప్రపంచంలో అత్యధికంగా 35.3 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు విడుదలయ్యాయి. ఇది 2012 కంటే 0.7 బిలియన్ టన్నులు అధికం. డిసెంబర్ 17న ‘పీబీఎల్ నెదర్లాండ్స్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ, ఐరోపా కమిషన్ జాయింట్ రీసెర్చ్ సెంటర్’.. ‘ట్రెండ్స్ ఇన్ గ్లోబల్ ఇై2 ఎమిషన్స్-2014’ నివేదికను విడుదల చేసింది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల ఇంధన అవసరాలు పెరుగుతుండటం ఉద్గారాల పెరుగుదలకు కారణమని నివేదిక తెలిపింది. ఉద్గారాల విడుదలలో చైనా (29 శాతం), అమెరికా (15 శాతం), ఐరోపా యూనియన్ (11 శాతం), భారత్ (6 శాతం) ముందున్నాయి.
వ్యాపారానికి అత్యంత అనుకూలం డెన్మార్క్
వ్యాపారానికి అనుకూల దేశాలకు సంబంధించి ఫోర్బ్స్ విడుదల చేసిన 9వ వార్షిక ర్యాంకింగ్స్‌లో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. హాంకాంగ్, న్యూజిలాండ్‌లు వరుసగా రెండు, మూడో స్థానాలను దక్కించుకున్నాయి. 146 దేశాల జాబితాలో భారత్ 93వ స్థానంలో నిలిచింది. గినియా చివరి స్థానంలో నిలిచింది. ఆస్తి హక్కులు, ఆవిష్కరణలు, పన్నులు, సాంకేతిక పరిజ్ఞానం, అవినీతి తదితర 11 కారకాల ఆధారంగా ఏటా ఫోర్బ్స్ ర్యాంకులు ఇస్తోంది.
అమెరికా సర్జన్ జనరల్‌గా
భారతీయ అమెరికన్
అమెరికా 19వ సర్జన్ జనరల్‌గా 37 ఏళ్ల భారతీయ అమెరికన్ వివేక్‌మూర్తి నియామకాన్ని సెనేట్ డిసెంబర్ 15న ఆమోదించింది. దీంతో పిన్న వయసులోనే సర్జన్ జనరల్ అయిన వ్యక్తిగా మూర్తి రికార్డు సృష్టించారు. ఈ నియామకం పొందిన తొలి భారతీయ సంతతి వ్యక్తి కూడా ఆయనే. బోస్టన్‌లో వైద్య వృత్తిలో స్థిరపడిన మూర్తి కర్ణాటకలో జన్మించారు. ప్రజారోగ్య విషయాలకు సంబంధించిన పాలనలో సర్జన్ జనరల్ అత్యున్నత పదవి.
క్రీడలు
ప్రపంచకప్ ప్రచారకర్తగా సచిన్
2015 వన్డే క్రికెట్ ప్రపంచకప్ ప్రచారకర్తగా సచిన్ టెండూల్కర్ వ్యవహరించనున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డిసెంబర్ 22న ప్రకటించింది. 2011 ప్రపంచకప్‌నకు కూడా సచిన్ ప్రచార కర్తగా పనిచేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రపంచకప్ టోర్నమెంట్ జరగనుంది.
లార్డ్స్‌లో 2019 ప్రపంచకప్ ఫైనల్
2019 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచ కప్ ఫైనల్‌కు లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వనున్నట్లు డిసెంబర్ 17న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్.. 1975, 1979, 1983, 1999 ప్రపంచకప్ ఫైనల్స్‌కు ఆతిథ్యమిచ్చింది. 2017లో జరిగే మహిళల ప్రపంచకప్ ఫైనల్ కూడా లార్డ్స్ మైదానంలో జరగనుంది.
వరల్డ్ చాంపియన్స్‌గా జొకోవిచ్, సెరెనా
2014 సంవత్సరానికి పురుషుల విభాగంలో సెర్బియాకు చెందిన నొవాక్ జొకోవిచ్, మహిళల విభాగంలో అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్‌లను వరల్డ్ చాంపియన్స్‌గా ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) డిసెంబర్ 18న ప్రకటించింది. జొకోవిచ్ ఈ అవార్డును దక్కించుకోవడం ఇది నాలుగోసారి కాగా, సెరెనాకు ఐదోసారి.
బాక్సర్ సరితపై ఏడాది నిషేధం
ఆసియా క్రీడల్లో పతకం స్వీకరించేందుకు నిరాకరించిన భారత మహిళా బాక్సర్ లైష్రామ్ సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) డిసెంబర్ 17న ఏడాదిపాటు నిషేధం విధించింది. దాంతోపాటు వెయ్యి స్విస్ ఫ్రాంక్‌ల జరిమానా వేసింది. నిషేధం 2015, అక్టోబర్ 1 వరకు అమల్లో ఉంటుంది. పతకం తిరస్కరించిన సందర్భంలో సరితకు మద్దతుగా నిలిచిన కోచ్ ఫెర్నాండెజ్‌పై రెండేళ్ల నిషేధం విధించింది.
భారత్‌కు కబడ్డీలో డబుల్ ప్రపంచకప్
రికార్డు స్థాయిలో భారత పురుషుల జట్టు వరుసగా ఐదోసారి, మహిళల జట్టు నాలుగోసారి కబడ్డీ ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నాయి. డిసెంబర్ 20న పంజాబ్‌లోని గురుగోబింద్ సింగ్ స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో పురుషుల జట్టు, పాకిస్థాన్ జట్టును ఓడించింది. మహిళల జట్టు న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది.
‘కోల్‌కతా’కు ఐఎస్ఎల్ టైటిల్
తొలి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టైటిల్‌ను అట్లెటికో డి కోల్‌కతా గెలుచుకుంది. డిసెంబర్ 20న ముంబైలో డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీను ఓడించింది. విజేతగా నిలిచిన కోల్‌కతాకు రూ.8 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్ కేరళ బ్లాస్టర్స్‌కు రూ. 4 కోట్లు అందాయి. ‘గోల్డెన్ బూట్’ అవార్డును ఎలనో(చెన్నైయిన్) అందుకున్నాడు. కోల్‌కత, కేరళ జట్లకు గంగూలీ, సచిన్ టెండూల్కర్లు సహ యజమానులుగా ఉన్నారు.
చాంపియన్ చెన్‌లాంగ్
బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’లో చెన్ లాంగ్ (చైనా), తాయ్ జు యింగ్ (చైనీస్ తైపీ) వరుసగా పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. డిసెంబర్ 21న జరిగిన ఫైనల్స్‌లో చెన్ లాంగ్.. విటిన్‌గస్ (డెన్మార్క్)పై గెలుపొందగా, తాయ్ జు యింగ్.. సుంగ్ జీ హున్ (కొరియా)ను ఓడించింది. విజేతగా నిలిచిన చెన్ లాంగ్, తాయ్ జు యింగ్‌లకు 80 వేల డాలర్ల (రూ. 50 లక్షల 68 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.