అరటి.. దిగుబడిలో మేటి
సస్యరక్షణ తప్పనిసరి.. తెగుళ్ల బెడద అధికం
నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలి
అప్పుడే అధిక దిగుబడులు సాధ్యం
ఏడీఏ వినోద్‌కుమార్ సలహా సూచనలు
జహీరాబాద్ టౌన్: అరటికి అన్ని కాలాల్లో డిమాండ్ ఉంటుంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల రైతులు అరటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ ప్రాంతంలోని జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో రైతులు అరటిని పెద్ద ఎత్తున పండిస్తున్నారు. ప్రధానంగా ఈ పంటకు నులి పురుగు, కాయముచ్చిక కుళ్లు, ఆకుమచ్చ తెగులు ఆశిస్తాయని జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్‌కుమార్(7288894426) తెలిపారు. వీటి నివారణకు, ఇతరత్రా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. తెగుళ్ల నివారణ చర్యల గురించి ఆయన రైతులకు ఇస్తున్న సలహా సూచనలు..
నులి పురుగులు
వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు అరటికి నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది.
దీనితో పాటు వివిధ రకాల తెగుళ్ల కారణంగా పంటకు నష్టం ఉంటుంది.
నులి పురుగు తేలికపాటి నేలల్లో ఉంటూ అరటికి నష్టం కలిగిస్తుంటాయి.
వేర్లపై బుడిపెలు వంటి కాయలను కలుగచేస్తాయి.
వీటి తీవ్రత కారణంగా అరటి ఆకులు వాలిపోయి ఆకుల అంచులు నల్లగా మాడినట్లు ఉంటాయి.
మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది.
అరటి సాగుకు ముందు విత్తన శుద్ధి చేసుకోవడమే దీనికి మార్గం.
నులి పురుగు ఆశించినట్లయితే 5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ + 2.5 మి.లీ మోనోక్రాటోఫాస్ లీటరు నీటిలో కలిపి మిశ్రమ ద్రావణం తయారుచేసుకోవాలి.
మిశ్రమ ద్రావణంలో అరటి పిలకల దుంపలను ముంచి నాటుకోవాలి.
ద్రావణంలో ముంచి నాటుకొన్నట్లయితే నులి పురుగుల దాడి తగ్గుతుంది.
అరటి పెరిగే దశలో పురుగుల నియంత్రణ కోసం కార్బోప్యురాన్ 3జీ గుళకలను మొక్కల దగ్గరగా వేయాలి.
పంటల మార్పిడి వల్ల కూడా పురుగు తీశ్రతను తగ్గించవచ్చు.
కాయముచ్చిక కుళ్లు
ఈ తెగుళ్ల ఉదృతి ఎక్కవగా వర్షాకాలంలో ఉంటుంది.
అరటి కాయల చివర ముచ్చిక వద్ద నల్లగా మారి కుళ్లు మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించిన కాయలను గుర్తించి తొలగించి తగులబెట్టాలి.
నివారణ చర్యగా ఒక గ్రామం కార్బండజిమ్ లీటరు నీటిలో కలిపి అరటి గెలలు పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి. 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇలా పిచికారి చేసి తెగులును పూర్తిగా అదుపు చేయవచ్చు.
ఆకుమచ్చ తెగులు
వర్షాకాలంలో వచ్చే ప్రధాన తెగులు ఇది. ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి తరువాత బూడిద రంగులోకి పెద్దవిగా మారుతాయి.
ఆకులు మాడిపోయి మొక్కలు గిడసబారిపోతాయి.
ఈ తెగులు నియంత్రణ కోసం తోటలో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
తెగులు ఎక్కువగా ఉంటే 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల క్లోరోథలోనిల్ లీటరు నీటి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
అలాగే ఒక మిల్లీలీటరు ట్రైడిమార్ఫ్ లేదా ప్రాపికొనజోల్ లీటరు నీటి చొప్పున కలిపి రెండు మూడు సార్లు పిచికారి చేయాలి.