రోజుకు రూ.15 కోట్ల నష్టం
ముంబై: రాజస్థాన్ లో గుజ్జర్ల ఆందోళనతో పశ్చిమ రైల్వే తీవ్రంగా నష్టపోతోంది. రోజుకు రూ. 15 కోట్లు నష్టం వస్తోందని పశ్చిమ రైల్వే వాణిజ్య విభాగం అధికారులు తెలిపారు. గుజ్జర్ల ఆందోళనతో ఢిల్లీ-ముంబై మార్గంలో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. తరచుగా రైళ్లను రద్దు చేస్తున్నారు. దీంతో రోజువారీ ఆదాయంలో రూ12 నుంచి రూ. 15 కోట్ల వరకు కోత పడుతోందని అధికారులు వెల్లడించారు.
ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ సాధన కోసం గుజ్జర్లు ఆందోళన చేస్తున్నారు. భరత్ పూర్ జిల్లాలో రైల్వే ట్రాక్ ను వారు బ్లాక్ చేశారు. గూడ్స్ రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగడంతో పశ్చిమ రైల్వే ఆదాయానికి భారీగా గండిపడుతోంది.