అంతర్ రాష్ట్ర ‘ఎర్ర’ స్మగ్లర్ గుణ అరెస్టు
– తిరుపతి కోర్టుకు హాజరవుతుండగా టాస్క్‌ఫోర్స్ ముట్టడి
– చిత్తూరు జిల్లాలో ఇతనిపై 15కు పైగా స్మగ్లింగ్ కేసులు
– దుబాయ్‌లోని షాహుభాయ్తో భారీ వ్యాపార సంబంధాలు
– వివరాలు వెల్లడించిన టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రాంతంలో ఉంటూ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పేరుమోసిన గుణశేఖర్ అలియాస్ మదరపాక్కం గుణను తిరుపతి రెడ్ శాండల్ యాంటీ స్మగ్లింగ్ æ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఆగస్టు 10న ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న తమిళ కూలీలకు జామీను ఇచ్చేందుకు తిరుపతి కోర్టుకు హాజరవుతుండగా లక్ష్మీపురం సర్కిల్ దగ్గర గుణ ప్రయాణిస్తోన్న ఫార్చ్యూనర్ వాహనాన్ని ముట్టడించి అరెస్టు చేశారు. అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌గా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కిన గుణశేఖర్‌పై చిత్తూరు జిల్లాలోని తిరుపతి, సత్యవేడు, మదనపల్లి స్టేషన్లలో 15కి పైగా స్మగ్లింగ్ కేసులున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు వివరాలను వెల్లడించారు.
ఎర్రచందనం స్మగ్లర్‌గా గుణÔó ఖర్ బాగా ఎదిగాడు. చిత్తూరు, కడప జిల్లాల్లోని ఏర్పేడు, వెంకటగిరి, రైల్వేకోడూరు ప్రాంతాలకు చెందిన శ్రీనివాసరెడ్డి, కొండయ్య, రాజు, శేఖర్, గిరి, గోపాల్‌రెడ్డిలతో గుణకు మంచి వ్యాపార సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 10న తమిళనాడు నుంచి 10 మంది కూలీలను తన వాహనంలో ఎక్కించుకుని రాత్రి 10 గంటలకు తిరుపతి బస్టాండ్ దగ్గర వదిలి వెళ్లాడు. అదే రోజు రాత్రి ఆయా కూలీలందరూ శేషాచలంలోనికి ప్రవేశిస్తూ టాస్క్ఫోర్సు పోలీసులకు చిక్కారు. కూలీలకు నాయకత్వం వహించిన శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు స్మగ్లింగ్ కేసులో గుణశేఖర్పైన కూడా కేసు నమోదు చేశారు.
దుబాయ్ షాహుభాయ్తో సంబంధాలు...
కాగా గుణశేఖర్ ఇప్పటి వరకూ సుమారు 200 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని దుబాయ్, సింగపూర్, చైనా దేశాలకు సరఫరా చేశాడని డీఐజీ కాంతారావు వెల్లడించారు. దుబాయ్‌లో పేరు మోసిన రెడ్‌శాండిల్ వ్యాపారి షాహుభాయ్, అలీభాయ్లతో గుణకు మంచి సంబంధాలున్నాయని తెలిపారు. శేషాచలం నుంచి బయటకు తీసుకెళ్లిన ఎర్రచందనం దుంగలను చెన్నై పోర్టుకి అక్కడి నుంచి సముద్ర మార్గాన దుబాయ్, చైనాలకు చేరవేస్తుంటారన్నారు. షాహుభాయ్, అతని కుమారుడిపైనా నిఘా పెట్టామన్నారు. అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు అంతర్జాతీయ స్మగ్లర్లపైన కూడా నిఘా పెట్టామన్నారు. రెండు నెలల కిందట కొత్తగా వచ్చిన జీవో కారణంగా టాస్క్ఫోర్సుకు విస్తృత విచారణాధికారాలు వచ్చాయనీ, ఈ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. ఇటీవల కాలంలో మైదాన ప్రాంతాల్లోనూ ఎర్రచందనం డంప్‌ల కోసం ప్రత్యేక తనిఖీలు జరుపుతున్నామనీ, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. కాగా అరెస్టయిన గుణశేఖర్ తమిళనాడులోని డీఎంకే పార్టీలో రాష్ట్రస్థాయి నేతగా పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా గుణ అరెస్టులో కీలకపాత్ర పోషించిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని డీఐజీ అభినందించారు. మీడియా సమావేశంలో డీఐజీతో పాటు తిరుపతి డీఎస్పీ శ్రీధర్‌రావు కూడా పాల్గొన్నారు.