gundlapalli
-
సీఎం కేసీఆర్ ప్రచార వాహనంలో తనిఖీలు.. ఎక్కడంటే?
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. అధికార బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీలు నిర్వహించాయి. వివరాల ప్రకారం.. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు సోమవారం తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరులో నిర్వహించనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరవనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి ప్రగతి రథం బస్సు వెళ్తున్న సమయంలో కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి టోల్గేట్ వద్ద కేంద్ర బలగాలు నిర్వహించాయి. బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ఎన్నికల నిబంధనలను అనుసరించి బలగాలకు సిబ్బంది పూర్తిగా సహకరించారు. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మానకొండూరు, స్టేషన్‌ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై ప్రసంగించనున్నారు. -
ఒకప్పుడు చిన్నపాటి టీ బంకు మాత్రమే..ఇప్పుడు కర్మాగారాల ఖిల్లా!
గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్.. మద్దిపాడు మండలంలో జాతీయ రహదారి పక్కనున్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు చిన్నపాటి టీ బంకు మాత్రమే ఉండేది. కాలక్రమంలో కర్మాగారాల ఖిల్లాగా మారింది. ప్రస్తుతం 400కుపైగా పరిశ్రమలతో 40 వేల మందికిపైగా ఉపాధి కల్పిస్తోంది. వృత్తి నైపుణ్యం గల వారికి వరంగా నిలిచింది. మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వేల మందికి ఉపాధి లభిస్తోంది. భారీ ఫ్యాక్టరీల నుంచి చిన్నపాటి పరిశ్రమల వరకూ నిర్వహిస్తుండటంతో అనేక రంగాల వారికి జీవనోపాధి దొరుకుతోంది. ప్రత్యక్షంగా కొంతమందికి, పరోక్షంగా మరికొంత మందికి బతుకుదెరువైంది. ఎంతోమంది ఆకలి తీరుస్తున్న గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... మద్దిపాడు: అది 1986వ సంవత్సరం.. జిల్లా కలెక్టర్‌గా ఎన్.జయప్రకాష్ నారాయణ్ పనిచేస్తున్నారు. అప్పటికి పూర్తిగా వెనకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా అభివృద్ధి వైపు నడిపించాలని భావించారు. మద్దిపాడు మండలంలోని వెయ్యి ఎకరాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ప్రభుత్వ భూములు కాగా, మరికొన్ని భూములను రైతులు ఇచ్చేశారు. మండలంలోని గుండ్లాపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 112 ఎకరాలు, అన్నంగి రెవెన్యూ పరిధిలోని 952 ఎకరాలు కలిపి మొత్తం 1,062 ఎకరాల భూములను ఏపీఐఐసీ ద్వారా ఆధీనంలోకి తీసుకున్నారు. వాటిలో పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తులు ప్రారంభించారు. ఆ తర్వాత చాలా కాలం వరకూ కూడా ఆ ప్రాంతంలో ఒకేఒక టీ బంకు మినహా మరేమీ ఉండేవి కావు. ఆ టీ బంకు కూడా హైవే పక్కనున్న ప్రాంతం కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ మాత్రమే నడిచేది. అలాంటి ప్రాంతం నేడు 24/7 టీ స్టాళ్లతో కళకళలాడుతోంది. పరిశ్రమలకు పెట్టింది పేరుగా మారింది. ఉపాధికి నిలయంగా నిలిచింది. గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ పేరుతో పారిశ్రామిక పట్టణంగా రూపుదిద్దుకుంది. వైఎస్సార్ హయాంలో అభివృద్ధికి అడుగులు... గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ ఏర్పాటైన తర్వాత చాలా కాలం వరకూ విద్యుత్ సౌకర్యం కూడా లేదు. లోపలికి వెళ్లేందుకు రహదారులు కూడా లేవు. పదేళ్ల వరకూ పారిశ్రామికవేత్తలు ఆ ప్రాంతం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అతికష్టం మీద 1995లో ఒకటీరెండు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంది. మెల్లగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం మొదలైంది. మద్దిపాడు మండలంలోని మల్లవరం కొండ వద్ద గుండ్లకమ్మ నదిపై రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్సార్.. అనతికాలంలోనే 2008 నాటికి పూర్తి చేసి జాతికి అంకితమిచ్చారు. ఈ పరిణామం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది. గుండ్లకమ్మ డ్యామ్‌తో ఆ చుట్టుపక్కల ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు స్థాపించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ సబ్సిడీపై రుణాలిచ్చారు. విద్యుత్ చార్జీల్లో రాయితీలు ప్రకటించారు. ప్రభుత్వం అందించిన పలు రకాల ప్రోత్సాహాలతో గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో ప్లాట్ల కొనుగోలుకు పారిశ్రామికవేత్తలు పరుగులు తీశారు. పారిశ్రామికాభివృద్ధికి వడివడిగా అడుగులు పడటంతో ఏపీఐఐసీ అధికారులు అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు, నీరు, విద్యుత్, తదితర మౌలిక వసతులు కల్పించారు. పలు రకాల ఫ్యాక్టరీలు ఏర్పాటు... పరిశ్రమల స్థాపనకు ముఖ్యంగా కావాల్సింది రవాణా సౌకర్యం. ఆ తర్వాత కనీస వసతులు. అలాంటిది గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉండటం గొప్ప అవకాశంగా మారింది. ప్రభుత్వం కూడా ప్రోత్సహించడంతో పలు ఫ్యాక్టరీల యజమానులు గ్రోత్ సెంటర్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఇప్పటి వరకూ మొత్తం 400 పైచిలుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. వాటిలో ఎక్కువ శాతం గ్రానైట్ రంగానికి చెందిన ఫ్యాక్టరీలే ఉన్నాయి. వాటితో పాటు కెమికల్ ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు, నీల్కమల్ కుర్చీల తయారీ ఫ్యాక్టరీ, విండ్‌మిల్స్ తయారీ ఫ్యాక్టరీ, రంగులు, గ్లౌజ్‌ల తయారీ వంటి పలు రకాల ఫ్యాక్టరీలు ప్రస్తుతం నడుస్తున్నాయి. పెద్దపెద్ద ఫ్యాక్టరీల నుంచి చిన్నపాటి పరిశ్రమల వరకూ నిర్వహిస్తుండటంతో వాటిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వెల్లువలా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు 20 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికిపైగా పరోక్షంగా గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. మన రాష్ట్రంలోని చుట్టుపక్కల ప్రాంతాలు, జిల్లాలతో పాటు చిత్తూరు, శ్రీకాకుళం వంటి దూర ప్రాంతాల నుంచి కూడా స్కిల్డ్ వర్కర్లు వచ్చి పనిచేస్తున్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బీహార్, రాంచి, యూపీ, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. శరవేగంగా గ్రోత్ సెంటర్ అభివృద్ధి గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాల పాటు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ఆగిపోయినా.. ప్రస్తుతం అన్ని పరిశ్రమలు పుంజుకుంటున్నా యి. విద్యుత్ సమస్యను అధిగమిస్తే పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగే ఆవకాశాలున్నాయి. గ్రోత్ సెంటర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు జంగిల్ క్లియరెన్స్, వీధి దీపాల ఏర్పాటు, సైడు డ్రెయిన్ల నిర్మాణాలకు అంచనాలు వేస్తున్నాం. అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించేలా గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌ను తీర్చిదిద్దుతాం. – జే వెంకటేశ్వర్లు,జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ గ్రానైట్ మార్కర్‌గా స్థిరపడ్డా గతంలో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని. గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో పలు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఏర్పాటవడంతో ప్రస్తుతం సొంతంగా గ్రానైట్ మార్కింగ్ చేసుకుంటున్నాను. కంపెనీల వారికి సరఫరా చేసే స్థాయికి ఎదిగాను. నాతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల యువతకు గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ ఉపాధి కల్పించింది. దూరప్రాంతాల నుంచి కూడా స్కిల్డ్ వర్కర్లు వచ్చినా.. ఇక్కడి వారికి ఉపాధి ఏమాత్రం తగ్గలేదు. – నలమలపు శ్యామసుందరరెడ్డి, గ్రానైట్ మార్కర్ గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌తో అన్ని రకాలుగా అభివృద్ధి వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందేందుకు గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతోంది. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో ప్రస్తుతం అధిక సంఖ్యలో ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. చుట్టుపక్కల నిరుద్యోగులకు చక్కటి ఉపాధి అవకాశాలు దొరికాయి. 2004లో ఫ్యాక్టరీల యజమానులకు రాయితీలు ప్రకటించడంతో గ్రోత్ సెంటర్ అభివృద్ధి ఊపందుకుంది. – చుండూరి రవిబాబు, రైస్‌మిల్ ఓనర్ త్వరలో ఐటీ కంపెనీ ప్రారంభం... గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లోకి త్వరలో ఒక ఐటీ కంపెనీ కూడా చేరనుంది. టెక్ బుల్స్ పేరుతో ఏర్పాటు చేయనున్న ఐటీ కంపెనీ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రారంభమే తరువాయి. నాలుగు రోజుల క్రితమే మాజీ మంత్రి శిద్దా రాఘవరావు జ్యోతి కార్జ్ సర్ఫేస్ పేరుతో గ్రానైట్ రంగానికి చెందిన భారీ ఫ్యాక్టరీని ఘనంగా ప్రారంభించారు. సెజ్‌లో మరికొన్ని భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. జాతీయ రహదారికి రెండోవైపు బూరేపల్లి గ్రామస్తులకు పునరావాస కాలనీ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా ప్రస్తుతం రద్దీగా మారింది. జనజీవనం పెరిగిపోవడంతో టీ స్టాళ్లు, హోటళ్లు, సెల్‌ఫోన్ దుకాణాలు, నిత్యావసర సరుకులు, వస్తువులు, దుస్తులు షాపులతో నిండిపోయి నిరుద్యోగులకు పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. గ్రోత్సెంటర్లలోని ఫ్యాక్టరీల్లో తయారయ్యే ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ట్రాన్స్‌పోర్టు కంపెనీలు,ఆఫీసులు వచ్చాయి. వాటి ద్వారా మరికొంత మందికి ఉపాధి లభిస్తోంది. ఈ విధంగా రోజురోజుకూ పలు రకాలుగా అభివృద్ధి చెందుతున్న గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ ఉపాధికి అడ్డాగా మారడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
పొద్దున ఇంటి ఎదుట ఊడ్చేందుకు వచ్చి చూస్తే.. షాక్
నల్లగొండ క్రైం: నల్లగొండ మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో క్షుద్రపూజల కలకలం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన బొల్లోజు వెంకటాచారి ఇంటి గేట్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి చేతి ఎముక, తాయత్తులు, నిమ్మకాయలు, పసుపుకుంకుమ కలిపిన బియ్యం, జాకెట్‌ముక్క, జీడి, వక్క, గాజులు, గవ్వలు, వెంట్రుకలు, పాయింట్ ముక్క, తదితరాలు కలిపి ఉంచారు. బుధవారం తెల్లవారుజామున వెంకటాచారి భార్య రత్నమ్మ ఇంటి ఎదుట ఊడ్చేందుకు వచ్చి చూడగా ఈ వస్తువులన్నీ కనిపించడంతో భయాందోళనకు గురై కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంకటాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ రూరల్ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి కీలక ఆధారాలను, ఇంటిఎదుట వదిలివెళ్లిన వస్తువులపై ఉన్న వేలిముద్రలను పోలీసులు సేకరించారు. కీలక ఆధారాలు లభించడంతో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందం గాలిస్తోంది. వివాహబంధం తెంచే కుట్ర.. జూన్ 16న వెంకటాచారి చిన్న కుమారుడు ప్రవీణ్‌చారితో నల్లగొండకు చెందిన యాదగిరి – సావిత్రిల కుమార్తె అఖిలతో వివాహం జరిగింది. కుటుంబ బంధాన్ని తెంచేందుకు గిట్టనివారు ఎముకలు, జీడిగింజలు, పసుపు బియ్యం తదితర వస్తువులను కలిపి ఇంటి గేట్ ఎదుట వదిలి వెళ్లి ఉంటారని, అఖిల తల్లిదండ్రులకు గిట్టనివారే ఈపని చేసి ఉంటారని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. సీసీకెమెరాల్లో కీలక ఆధారాలు.. బైక్‌పై వచ్చిన దుండగులు వెంకటాచారి ఇంటి ఎదుట భయంగొలిపే వస్తువులను వదిలివెళ్లినట్లు గ్రామంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైంది. వీటి ఆధారంగా ఆ ఇంటి నుంచి వచ్చిపోయిన ఫోన్ కాల్స్‌ను, అఖిల తల్లిదండ్రులైన యాదగిరి– సావిత్రిలకు గిట్టనివారిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
నిప్పంటుకుంటే అంతే..
సాక్షి, గన్నేరువరం (కరీంనగర్): వేసవికాలంలో ప్రారంభమైంది. ఈ ఏడాది నిప్పు కొలిమిలా ఎండలు ఉంటాయని ప్రభుత్వం, అధికారులు ముందస్తు ప్రకటనల్లో పేర్కొంటున్నారు. ఏమాత్రం ఏమారుపాటు ఉన్న అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. రానున్న రోజుల్లో ఏప్రిల్, మేనెలల్లో ఎండల తీవ్రత అధిక ఉంటుంది. ఈ సమయాల్లోనూ వరికోతలు ప్రారంభమై ధాన్యం, గడ్డివాములు తరలింపులు ఉంటాయి. అలాగే కొన్నిచోట్ల రహదారుల పక్కనే గడ్డవాములను రైతులు ఏర్పాటు చేసుకుంటారు. రైతులు, వ్యాపారులు ధాన్యాన్ని విక్రయించడానికి వివిధ ప్రాంతాలకు వాహనాల్లో వాటిని తరలిస్తుంటారు. అంతేకాకుండా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కూడా ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అనుకొని ప్రమాదాలు చోటుచేసుకుని అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సందార్భాల్లో రైతులకు, ప్రజలకు, వ్యాపారులకు అపార నష్టం జరుగుతుంది. అందుబాటులో ఫైర్ ఇంజిన్లు లేకపోవడంతో పాటు అందుబాటులో నీటివసతి లేక అగ్నిప్రమాదాలను అరికట్టానికి బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలు మండలంలోని గుండ్లపల్లి స్టేజీ రాజీవ్ రహదారి పక్కన గల ఎస్బీఐలో 2014లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ప్రమాదాన్ని నివారించేందుకు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. కాని అక్కడి నుంచి ఇక్కడికి ఫైర్ఇంజిన్ వచ్చేవరకూ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొంత సమయానికి ముందుగా వచ్చిఉంటే నష్టం తగ్గి ఉండేందని స్థానికులు పేర్కొంటున్నారు. ఖాసీంపేటలో ఒక రైతు ట్రాక్టర్లో గడ్డివాముతో వ్యవసాయ బావి వద్దకు తీసుకువస్తుండగా విద్యుత్ లూజ్‌లైన్ల కారణంగా వైర్లు ట్రాక్టర్‌పై ఉన్న గడ్డివాముకు తగిలి మంటలు అంటుకున్నాయి. దగ్గరలో ఫైర్‌స్టేషన్ లేకపోవడంతో కాపాడే పరిస్థితి లేకపోయింది. 2017 ఏప్రిల్‌లో జంగపల్లి గ్రామం గుట్టపై అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ప్రారంభమైన సమయంలో ఫైర్ ఇంజిన్‌కు సమాచారం అందించారు. కరీంనగర్లో అందుబాటు లేక రాజన్నా సిరిసిల్లా జిల్లా నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చింది. కాని అప్పటికే నష్టం జరిగిపోయింది. ఈ గుట్టపై జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో వేలమొక్కలు నాటారు. ఈ ప్రమాదంలో మొక్కలు మొత్తం మంటలకు బుడిదైపోయాయి. ఇలా మండలంలో ఏడాది పొడవునా అనేక అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడల్లా కరీంనగర్, సిద్దిపేట. రాజన్న సిరిసిల్ల జిల్లాల కేంద్రాల్లోని అగ్ని మాపకకేంద్రాలకు ఫోన్‌చేస్తే ఫైర్ ఇంజిన్ రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడి వచ్చే సరికి ప్రమాదం స్థాయి పెరిగి భారీనష్టం చోటు చేసుకుంటుంది. అయితే రాజీవ్ రహదారి పక్కనే ఉన్న గన్నేరువరం మండలంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్రజలు, పాలకులు డిమాండ్ చేస్తున్నా నేటికి అది నేరవేరడం లేదు. అగ్ని మాపక కేంద్రాన్ని మంజూరు చేయాలి మండలంలో అగ్ని ప్రమాదం జరిగితే ఇటు కరీంనగర్ అటు సిద్దిపేట. రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి రావాల్సి ఉంటుంది. ఏటుచూసిన మండలకేంద్రానికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గన్నేరువరం మండలం మెట్టప్రాంతం కావడంతో ఎక్కువ స్థాయిలో పశుగ్రాసాలకు అగ్ని ప్రమాదాలు జరుగుతుంటా యి. ఈ ప్రమాదాలు జరిగాయంటే క్షణాల్లో బుడిదవుతున్నాయి. ఇళ్లల్లో పత్తి సైతం మం టల్లో కాలిపోలినా ఘటనలు అనేకం ఉన్నాయి. మండలకేంద్రంలో ఇటీవల ఒక పూరిగుడిసెకు మంటలంటుకుని దగ్ధమైంది. ఇందు లో రూ.30వేల నగదుతో పాటు దుస్తువులు, నిత్యవసర సరుకులు కాలిబూడిదయ్యాయి. గతేడాది మండలకేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు సంభవించి 5 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. 40 కిలోమీటర్ల దూరం నుంచి ఫైర్ ఇంజిన్లు రావడం అలస్యమవుతుండడంతో వచ్చేలోపు పెద్ద ఎత్తున నష్టం చవిచూడాల్సి వ స్తుందని ప్రజలు వాపోతున్నారు. మండలంలోని పత్తి రైతులు తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట గ్రామ శివారులోని పత్తి జిన్నింగ్ మిల్లుకు పత్తిని రైతులు తీసుకెళ్తుంటారు. అనుకొని పరిస్థితుల్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ చేరుకోవడంలో అలస్యమైతే భారీనష్టాలు జరిగే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. మండలంలోని రాజీవ్ రహదారి సమీప గ్రామం గుండ్లపల్లి స్టేజీ కేంద్రంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఇటు బెజ్జంకి, ఇల్లంతకుంట అటు కోహెడ మండలాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మండలకేంద్రానికి అగ్ని మాపక కేం ద్రాన్ని మంజూరు చేయాలని కోరుతున్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
గుండ్లపల్లి (బెళుగుప్ప): మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన లోకేశ్ (23) విషపు గుళికలను మింగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనకు సంబంధించి ఏఎస్ఐ విజయనాయక్ తెలిపిన వివరాల మేరకు లోకేశ్ గత కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధ పడుతుండేవాడన్నారు. సోమవారం విపరీతమైన కడుపు నొప్పి రావడంతో నొప్పిని భరించ లేక ఇంట్లోనే విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. కుటుంబ సభ్యులు గమనించి కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారని, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. సంఘటనపై మృతుని భార్య సుమిత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.