వలస బతుకులు ఛిద్రం..
ఒక్కసారిగా కూలిన పైకప్పు.. ముగ్గురు దుర్మరణం
పాత భవనాన్ని కూల్చివేస్తుండగా దుర్ఘటన
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో ఘటన
మేడ్చల్/మేడ్చల్ రూరల్: నానక్‌రామ్‌గూడ లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి 11 మంది కూలీలు మృత్యువాతపడిన ఘటనను మరువక ముందే గ్రేటర్ పరిధిలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. గురువారం మేడ్చల్ మండల పరిధిలోని గుండ్లపోచంపల్లి గ్రామంలో నూతన భవనం నిర్మించడానికి పాత భవనాన్ని కూల్చి వేస్తుండగా.. భవనం పైకప్పు కుప్పకూలి ముగ్గురు వలస కూలీలు మృతిచెందారు. మరో ఇద్దరు కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గుప్తా గ్రామ పంచాయతీకి సమీపంలో ఉన్న పాత భవనాన్ని కొనుగోలు చేశాడు. దానిని నేలమట్టం చేసి నూతన భవనం నిర్మించాలని భావించి పనులు చేపట్టాడు.
రామయ్య అనే కాంట్రాక్టర్‌కు కూల్చివేత పనులను అప్పగించాడు. బుధవారం నుంచి∙కూల్చివేత పనులు చేపట్టగా గురువారం ట్రాక్టర్ డ్రైవర్ లక్ష్మయ్య(45)తోపాటు వెంకటేశం(40), ముత్యాలునాయుడు(60), రాములు, విఠల్ అనే కూలీలు పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పైకప్పుకు ఉన్న సీకులను కట్ చేసి సమ్మెటలతో కొడుతూ భవనాన్ని కూల్చసాగారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఐదుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు జేసీబీని పిలిపించి శిథిలాలను తొలగించి కూలీలను బయటికి తీశారు. అయితే లక్ష్మయ్య అక్కడికక్కడే మర ణించగా.. వెంకటేశం, ముత్యాలునాయుడు చికిత్స పొందుతూ మరణించారు. రాములు, విఠల్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అంతా వలస పక్షులే..
ఇక్కడ పనిచేస్తున్న కూలీలంతా వలస పక్షులే. పొట్టకూటి కోసం సొంత ఊరిని వదిలి గుండ్లపోచంపల్లికి వలస వచ్చినవారే. మెదక్ జిల్లా బండపోచారం గ్రామానికి చెందిన లక్ష్మయ్య 25 ఏళ్ళ క్రితం గుండ్లపోచంపల్లికి వలస వచ్చి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విశాఖ జిల్లా మాడుగుల మండలం వీరనారాయణ గ్రామానికి చెందిన ముత్యాలునాయుడు భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలతో కలసి కొన్నేళ్ల క్రితం గుండ్లపోచంపల్లికి వలస వచ్చి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన వెంకటేశం భార్య పార్వతి, కుమారుడు రాజు, కూతురు రత్నంతో కలసి ఇటీవలే గుండ్లపోచంపల్లికి వచ్చాడు. కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భవనం కూలిన ఘటనలో లక్ష్మయ్య, ముత్యాలునాయుడు, వెంకటేశం మరణించడంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. తీవ్ర గాయాలకు గురైన విఠల్, రాములు సైతం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామం నుండి వలస వచ్చినవారే.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కలెక్టర్
భవనం కూల్చివేతలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఘటనాస్థలికి వచ్చి ప్రమాదం జరిగిన తీరు, దానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. మృతుల భార్యలకు వితంతు పింఛన్ మం జూరు చేయాలని అధికారులను ఆదేశించా రు. గాయాలతో చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. కాగా, ముందస్తు రక్షణ చర్యలు తీసుకోకుండా కూలీలతో పనులు చేయించి న భవన యజమాని శ్రీనివాస్‌గుప్తా, కాంట్రాక్టర్ రామయ్యపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.