సుతారిగూడ గ్రామం
సాక్షి, మేడ్చల్: గణేశ్ నవరాత్రులకు గల్లీకో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి హంగు ఆర్భాటం చేయడం... గ్రామం, పట్టణం అని తేడా లేకుండా ప్రతి చోటా జరిగే తంతు. ఇందుకు భిన్నంగా ఒకే గ్రామం... ఒకే వినాయకుడి సంప్రదాయానికి మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుతారిగూడ నిలిచింది. 40 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగడం విశేషం. ఏటా వినాయక ఉత్సవాల సందర్భంగా గ్రామస్తులంతా కలిసి ఒకే విగ్రహాన్ని నెలకొల్పి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో 40 ఏళ్ల క్రితం గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి ఈ నిర్ణయం తీసుకోగా, నేటికీ ఇదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.
అట్టహాసంగా.. భక్తి పూర్వకంగా....
గ్రామంలో ఒకే వినాయకుడ్ని ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు ఉత్సవాల్లో ఐక్యంగా ఉండి అటు అట్టహాసంగా... ఇటు భక్తి పూర్వకంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఏటా భారీ సెట్టింగ్‌లతో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది రోజులూ భజనలు, ప్రత్యేక పూజలతో భగవంతుడ్ని ఆరాధిస్తున్నారు.
నేటికీ అదే ఆనవాయితీ
ఊరంతా ఐక్యంగా ఉండాలన్న ఆకాంక్షతో గ్రామంలో ఒకే వినాయకుడిని ఏర్పాటు చేయాలని 40 ఏళ్ల కిందట నిర్ణయించారు. గల్లీకో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే భక్తి కన్నా ఆధిపత్య పోరు ఎక్కువ అవుతుంది. ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం సందర్భంగా గొడవలు జరిగి ఐక్యత దెబ్బతింటుంది, మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. ఒకే వినాయకుడి ప్రతిమ ఉంటే ఐక్యత పెరుగుతుంది. మేము తీసుకున్న ఈ నిర్ణయానికి స్థానికులు ఇప్పటికీ కట్టుబడటం సంతోషంగా ఉంది.
– వెంకటేష్, గ్రామ హనుమాన్ యూత్ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment