హైవే ప్రయాణం వయా ‘ఈజీ’కే
గుండుగొలను-కొవ్వూరు రహదారిని నేషనల్ హైవేగా మార్చేందుకు కేంద్రం ఓకే
కార్యరూపం దాలిస్తే ఏలూరు-రాజమండ్రి మధ్య ప్రయాణ కష్టాలకు చెక్
ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఏలూరు నుంచి రాజమండ్రికి కొవ్వూరు మీదుగా రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ప్రయాణికులే కాదు.. వాహన చోదకులూ హడలిపోతారు. ఎక్కడికక్కడ తూట్లుపడి.. మిట్టపల్లాలుగా ఉండే ఈ రహదారిపై ప్రయాణించడమంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టేనని భావిస్తారు. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం మీదుగా రాజమండ్రి వెళదామంటే దూరం ఎక్కువ కావడంతో అటుగా వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడరు. ఆర్టీసీ బస్సులను ఆశ్రయించి గుండుగొలను, దేవరపల్లి, కొవ్వూరు మీదుగా రాజమండ్రి వెళ్తుంటారు. అన్నీ అనుకూలిస్తే రానున్న రోజుల్లో ఏలూరు-గుండుగొలను-కొవ్వూరు (ఈజీకే) రహదారిగా పిలిచే ఈ రూట్లో సునాయాసంగా ప్రయాణించే వీలుంది. గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు 65 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనిని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పరిధిలోకి తీసుకునేందుకు హామీ ఇచ్చింది. ఇది సాకారమైతే ఉభయగోదావరి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నం సాకారం అవుతుంది.
తక్కువ దూరం.. తక్కువ సమయం
గుండుగొలను-కొవ్వూరు రహదారి ఎన్హెచ్ఏఐ పరిధిలోకి వెళితే ఈ రహదారి అభివృద్ధి చెందుతుందని జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్లడానికి తక్కువ దూరంతోపాటు తక్కువ సమయంలో గమ్యానికి చేరుకునే ఈ రహదారికి జాతీయ హోదా వస్తే విస్తరణ, అభివృద్ధి చెంది ప్రయాణం మరింత సౌకర్యంగా ఉం టుంది. ఈ అవకాశం కోసం వివిధ సంస్థలు, ప్రజలు ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ రహదారిని ఎన్హెచ్ఏఐ పరిధిలోకి తీసుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిందనే వార్తలు వెలువడటంతో జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వాహనాలపై ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్లేవారు ఈ రహదారిపై ప్రయాణించలేక తణుకు రావులపాలెం మీదుగా వెళ్తున్నారు. గుండుగొలను, భీమడోలు, నల్లజర్ల, దేవరపల్లి మీదుగా వెళితే దూరం తక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం తణుకు, రావులపాలెం రహదారినే ఆశ్రయిస్తున్నారు. ఏలూరు నుండి గుండుగొలను, చేబ్రోలు, తాడేపల్లిగూడెం, దువ్వ, తణుకు, పెరవలి, ఖండవల్లి, సిద్ధాం తం, గోపాలపురం, రావులపాలెం మీదుగా రాజమండ్రికి జాతీయ రహదారి ఉంది. ఈ రహదారిపై వెళితే రావులపాలెం వరకూ సుమారు 104 కిలోమీటర్లు, అక్కడి నుంచి రాజమండ్రికి సుమారు మరో 30 కిలోమీటర్లు వెరసి సుమారు 134 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. కాగా గుండుగొలను నుండి భీమడోలు జంక్షన్, దేవరపల్లి, పంగిడి, కొవ్వూరు మీదుగా అయితే 95 కిలోమీటర్ల ప్రయా ణంతో రాజమండ్రికి చేరుకోవచ్చు.
అయితే, ఈ రహదారిపై ప్రయాణం కష్టంగా మారడంతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు తణుకు, రావులపాలెం రహదారిని ఆశ్రస్తున్నారు. దేవరపల్లి దాటిన తరువాత క్వారీలు అధికంగా ఉండటం, రహదారులు ఛిద్రం కావడంతో ఇటువైపు ప్రయాణం ఆలస్యమవుతోంది. అంతేకాకుండా వాహనాలు గతుకుల్లో పడి దెబ్బతింటున్నాయి. దీని వల్ల ప్రజలకు అధిక సమయం, అధిక ఇంధనం వెచ్చించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం గుండుగొలను-కొవ్వూరు రహదారిని జాతీయ రహదారిగా తీర్చిదిద్దితే సుమారు 10 మీటర్ల వెడల్పున నాలుగు వరసుల రోడ్డు నిర్మితమై ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. సుమారు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.