Gunduravu
-
మిస్టరీగా గుండూరావు హత్య?
• రెండు వారాలైనా విడుదల కాని మావోయిస్టుల ప్రకటన • తోటి వ్యాపారులే చేయించి ఉంటారని కుటుంబ సభ్యుల ఆరోపణ గూడెంకొత్తవీధి: ముక్కలి సత్యనారాయణ (గుండూరావు) హత్య మిస్టరీగా మారింది. హత్య జరిగి రెండు వారాలవుతున్నా ఇంతవరకు ఈ విషయమై మావోయిస్టులు ఎటువంటి ప్రకటన చేయలేదు. వ్యాపారులు పన్నిన కుట్రలో భాగంగానే హత్య జరిగిందని కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. మావోయిస్టులు ఎవరినైనా హత్య చేస్తే రెండు మూడు రోజుల్లో సంఘటనకు సంబంధించి పత్రిక ప్రకటన విడుదల చేస్తారు. గుండూరావు విషయంలో ఇంత వరకు వారు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. గూడెంకొత్తవీధి చెందిన గుండూరావు చిన్నప్పటి నుంచి ఏజెన్సీ వ్యాపారం చేస్తున్నాడు. రైతులకు లక్షలాది రూపాయలు బకాయిలు ఉన్నప్పుడు మావోయిస్టులు పలుమార్లు హెచ్చరించారు. దీంతో దాదాపు 90 శాతం బకాయిలు రైతులకు చెల్లించాడు. అనంతరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది అపరాల వ్యాపారం కొనసాగించాడు. గుండూరావు విషయంలో అపోహలన్నీ తొలగిపోవడంతో గ్రామాలకు వెళ్లినప్పుడు మావోయిస్టులు చూసినా ఏమీ అనే వారు కాదు. ఇంతలో ఏం జరిగిందో ఏమోగానీ ఈ నెల 6న కుంకంపూడి వద్ద ఇద్దరు వ్యక్తులు గుండూరావును హత్య చేశారు. అతని తమ్ముడు వెంకటరమణను కొట్టి పంపేశారు. సంఘటనకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఇంతకు మందెన్నడూ చూడలేదని వెంకటరమణ చెబుతున్నాడు. వ్యాపార కక్షలే హత్యకు దారితీశాయని అప్పట్లో కుటుంబ సభ్యులు ఆరోపించారు. కొందరు వ్యాపారులు గుర్తు తెలియని మిలీషియా సభ్యను ప్రోత్సహించి హత్యచేయించి ఉంటారిని అనుమానించారు. దీనిపై లోతుగా విచారణ చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
జైన దేవాలయంలో లూటీ
బెంగళూరు, న్యూస్‌లైన్ : జైన్ దేవాలయంలో దొంగలు పడ్డారు. సెక్యూరిటీ గార్డులపై మత్తు మందు చల్లి భారీ మొత్తంలో లూటీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే... బెంగళూరులోని మెజిస్టిక్ సమీపంలోని అక్కిపేట మెయిన్ రోడ్డులోని ఓబయ్య లే ఔట్లో ప్రఖ్యాతి గాంచిన జైన మందిరం ఉంది. ఇక్కడ అమూల్యమైన పురాతన విగ్రహాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ఐదు హుండీలు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఆరు సీసీ కెమెరాలతో పాటు ఐదుగురు గార్డులను కూడా ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి పూజల అనంతరం ఆలయానికి తాళం వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు అక్కడకు చేరుకుని సెక్యూరిటీ గార్డులపై మత్తుమందు చల్లి అచేతనులను చేశారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం కిటికి ఊచలను కత్తిరించి లోపలకు చొరబడ్డారు. ఆలయంలోని పురాతన పంచలోహ విగ్రహాలు, వస్తువులు, పూజా సామగ్రి, బంగారు నగలు, ఐదు హుండీల్లోని నగదు లూటీ చేసి ఉడాయించారు. ఆదివారం ఉదయం పూజలు చేసేందుకు ఆలయానికి చేరుకున్న అర్చకుడు విషయాన్ని గుర్తించి సమాచారం అందివ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మొత్తం రూ. 30 లక్షల విలువైన ఆభరణాలు, రూ. మూడు లక్షలకు పైగా లూటీ అయినట్లు ఆలయ నిర్వాహాకులు తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి, స్థానిక ఎమ్మెల్యే దినేష్ గుండూరావు, పోలీస్ ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిశీలించారు. వేలి ముద్రల నిపుణులు, స్నిప్పర్ డాగ్ బృందం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది.