
మిస్టరీగా గుండూరావు హత్య?
• రెండు వారాలైనా విడుదల కాని మావోయిస్టుల ప్రకటన
• తోటి వ్యాపారులే చేయించి ఉంటారని కుటుంబ సభ్యుల ఆరోపణ
గూడెంకొత్తవీధి: ముక్కలి సత్యనారాయణ (గుండూరావు) హత్య మిస్టరీగా మారింది. హత్య జరిగి రెండు వారాలవుతున్నా ఇంతవరకు ఈ విషయమై మావోయిస్టులు ఎటువంటి ప్రకటన చేయలేదు. వ్యాపారులు పన్నిన కుట్రలో భాగంగానే హత్య జరిగిందని కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.
మావోయిస్టులు ఎవరినైనా హత్య చేస్తే రెండు మూడు రోజుల్లో సంఘటనకు సంబంధించి పత్రిక ప్రకటన విడుదల చేస్తారు. గుండూరావు విషయంలో ఇంత వరకు వారు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. గూడెంకొత్తవీధి చెందిన గుండూరావు చిన్నప్పటి నుంచి ఏజెన్సీ వ్యాపారం చేస్తున్నాడు. రైతులకు లక్షలాది రూపాయలు బకాయిలు ఉన్నప్పుడు మావోయిస్టులు పలుమార్లు హెచ్చరించారు. దీంతో దాదాపు 90 శాతం బకాయిలు రైతులకు చెల్లించాడు. అనంతరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది అపరాల వ్యాపారం కొనసాగించాడు. గుండూరావు విషయంలో అపోహలన్నీ తొలగిపోవడంతో గ్రామాలకు వెళ్లినప్పుడు మావోయిస్టులు చూసినా ఏమీ అనే వారు కాదు.
ఇంతలో ఏం జరిగిందో ఏమోగానీ ఈ నెల 6న కుంకంపూడి వద్ద ఇద్దరు వ్యక్తులు గుండూరావును హత్య చేశారు. అతని తమ్ముడు వెంకటరమణను కొట్టి పంపేశారు. సంఘటనకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఇంతకు మందెన్నడూ చూడలేదని వెంకటరమణ చెబుతున్నాడు. వ్యాపార కక్షలే హత్యకు దారితీశాయని అప్పట్లో కుటుంబ సభ్యులు ఆరోపించారు. కొందరు వ్యాపారులు గుర్తు తెలియని మిలీషియా సభ్యను ప్రోత్సహించి హత్యచేయించి ఉంటారిని అనుమానించారు. దీనిపై లోతుగా విచారణ చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.