విద్యార్థుల కోసం సమాచార యాప్
శ్రీకాకుళం రూరల్: విశ్వవ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడిసిన్ కళాశాలల సమగ్ర సమాచారంతో ఒక యాప్ రూపొందింది. గురజాడ విద్యాసంస్ధకు చెందిన పూర్వ విద్యార్ధిని కృషితో ఇది ఆవిష్కృతమయింది. కెరీర్ డెస్టినీటెక్ సొల్యూషన్స్ ఇండియా ప్రయివేట్ లిమిటే డ్ సంస్ధ సీఎండీ ప్రవీన్ జి. తంబి శుక్రవారం ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాప్ను రూపొదించిన గురజాడ కళాశాలలో స్ధానిక పూర్వ విద్యార్ధి కలగ లిజి (శ్రీకాకుళం)ని ఆయన అభినందించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య అనంతరం ఏ కళాశాలలో విద్యనభ్యసించాలనుకుంటున్నారో వాటి పూర్తివివరాలతో పాటు విశ్వవ్యాప్త సమాచారం ఈ యాప్లో పొందుపరిచారని వివరించారు.
యాప్ రూపకర్త కలగ లిజి మాట్లాడుతూ ఇంటర్ అనంతరం విద్యార్ధులు ఇతరులపై ఆధార పడకూడదని అభిప్రాయపడ్డారు. అందుకే విద్యతో పాటు ఉద్యోగ సమాచారం నిక్షిప్తం చేయడం జరిగిందన్నారు. ఇంజినీరింగ్ విద్యలో 40కి పైగా, మెడిసిన్లో 150కి పైగా కోర్సులున్నాయన్న విషయం చాలా మందికి తెలియదన్నారు. విశ్వవ్యాప్తంగా 5 లక్షల కళాశాలున్నాయని తెలియజేశారు. యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఫీజు, స్కాలర్షిప్, బ్యాంకు రుణాలు వంటి ఇతర వివరాలు కూడా యాప్లో నిక్షిప్తం చేశామన్నారు.
ప్రపంచంలో ఏ కళాశాలకైనా ఇంటి నుండే దరఖాస్తు చేసుకోనే అవకాశం ఉందన్నారు. గురజాడ విద్యాసంస్థల అధ్యక్షలు జివి స్వామినాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోని విద్యాసంస్ధల పూర్తి సమాచారం ఉండటం వల్ల ఈ యాప్ విద్యార్థులకు దిక్సూచి వంటిందన్నారు. కార్యక్రమంలో గురజాడ కళాశాలల ప్రిన్సిపాల్ పులఖండం శ్రీనివాసరావు, వివిధ కళాశాలల విద్యార్థులు,అధ్యాపకులు పాల్గొన్నారు.