Gurjapur barrage construction
-
కృష్ణమ్మ కట్టడికి మరో ఎత్తు!
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాలను ఎగువనే కట్టడి చేసేందుకు కర్ణాటక మరో ఎత్తు వేస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా వాడుకునేందుకు కొత్త బ్యారేజీలను నిర్మిస్తోంది. ఇప్పటికే గుజాల్ బ్యారేజీ నిర్మించిన ఆ రాష్ట్రం.. తాజాగా గుర్జాపూర్ బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టింది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ వంటి ప్రాజెక్టులు నిండితే కానీ దిగువకు నీళ్లు రాని పరిస్థితుల నేపథ్యంలో కొత్త బ్యారేజీలతో రాష్ట్రానికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే నాలుగు.. అదనంగా రెండు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు కృష్ణా జలాల్లో కర్ణాటకకు 734 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. కర్ణాటక ఇప్పటికే ఆ నీటిని దాదాపు పూర్తిగా వినియోగించుకుంటోంది. అదనంగా నీటిని వినియోగించుకునేందుకు పదేళ్ల కింద బీజాపూర్ జిల్లాలో బుధిహాల్–పీరాపూర్, రాయచూర్ జిల్లాలో నందవాడ్జి, రామత్తల్, భగల్‌కోట్ జిల్లాలోని తిమ్మాపూర్‌ల వద్ద కృష్ణా నదిపై నాలుగు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించింది. 21 టీఎంసీల నీటిని తీసుకుని 1.29 లక్షల హెక్టార్లకు అందించాలన్నది వాటి లక్ష్యం. అయితే ఆ ప్రాజెక్టుల పనులు చేపట్టినా వాటికి ఎలాంటి అనుమతులు, నీటి కేటాయింపులు లేకపోవడంతో నిర్వహణలోకి తేలేకపోయింది. కానీ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అధికారిక అనుమతులు ఇచ్చిన వెంటనే తమ ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియను వేగిరం చేసింది. గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ పోలవరం చేపట్టిన వెంటనే ఎగువ రాష్ట్రాలకు 35 టీఎంసీల మేర వాటాలు దక్కుతాయని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టంగా ఉంది. ప్రస్తుతం ఏపీ పోలవరం చేపట్టడంతో కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు దక్కుతాయి. దీంతో తమకు దక్కే 21 టీఎంసీల వినియోగం కోసమే ఈ పథకాలను చేపట్టినట్లు చూపి ఇటీవలే కర్ణాటక అన్ని అనుమతులు తెచ్చుకుంది. తాజాగా నీటి వినియోగాన్ని కూడా మొదలుపెట్టింది. ఈ ఎత్తిపోతల పథకాలు పాలమూరు జిల్లాకు ఎగువనే ఉండటంతో ఇప్పటికే దిగువకు ప్రవాహాలు తగ్గాయి. ఇక ప్రధాన కృష్ణాలో గుజాల్ బ్యారేజీని నిర్మించి దీని ద్వారా నాలుగైదు టీఎంసీలు వినియోగించుకునేందుకు యత్నిస్తోంది. మరోవైపు రాయచూర్ జిల్లాలో కృష్ణా నీటిని వాడుకునేలా 1.2 టీఎంసీ సామర్థ్యంతో గుర్జాపూర్ బ్యారేజీ నిర్మిస్తోంది. దీని ద్వారా 5 నుంచి 6 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. మొత్తంగా 10 నుంచి 11 టీఎంసీలను ఎగువనే అడ్డుకునేందుకు కర్ణాటక యత్నిస్తోంది. దీంతో జూరాలకు వచ్చే ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోతాయి. అదే జరిగితే జూరాలపై ఆధారపడిన కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పథకాలకు నీరు లేక అల్లాడాల్సిన పరిస్థితి తలెత్తనుంది. సీడబ్ల్యూసీకి ఫిర్యాదు కర్ణాటక బ్యారేజీలపై ఆలస్యంగా మేల్కొన్న రాష్ట్ర నీటి పారుదల శాఖ కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గురువారం ఈఎన్సీ మురళీధర్ సీడబ్ల్యూసీకి లేఖ రాశారు. హైడ్రాలజీ క్లియరెన్స్‌లు వచ్చే వరకు నీటి వినియోగం జరగకుండా చూడాలని, గుర్జాపూర్ బ్యారేజీ నిర్మాణం జరగకుండా ఆదేశాలివ్వాలని కోరారు. -
ఆర్డీఎస్ కుడి కాలువను అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ఉపనది తుంగభద్రపై రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) కుడి కాలువ పథకాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. లేఖ ప్రతులను కృష్ణా నది యాజమాన్య బోర్డుతో పాటు, ఏపీ ప్రభుత్వానికి పంపింది. ఆర్డీఎస్ కుడి కాలువ పథకం పేరిట నాలుగు టీఎంసీల మళ్లింపునకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆ లేఖలో ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్-1తో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టం నిబంధనలకు కూడా వ్యతిరేకమని స్పష్టీకరించింది. కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్-2 కేటాయింపులపై ఇప్పటికే జల వివాదాలు నెలకొన్నాయని... ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా కేసు విచారణలో ఉందని లేఖలో ప్రస్తావించింది. 1956 నాటి నిబంధనల ప్రకారం ఆర్డీఎస్ ద్వారా 15.90 టీఎంసీలను వినియోగించుకుని తెలంగాణలో 87,500 ఎకరాలకు సాగునీరివ్వాల్సి ఉందని... కానీ ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతం ఎన్నడూ 5 టీఎంసీలకు మించి వాడుకోలేదని తెలిపింది. కృష్ణా ట్రిబ్యునల్-2, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఆర్డీఎస్ కుడి కాలువ పథకం పనులు చేపట్టడాన్ని అడ్డుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గుర్జాపూర్తో దిగువ ప్రాజెక్టులకు గండం కృష్ణా-భీమా నదుల సంగమానికి మూడు కిలోమీటర్ల ఎగువన రాయచూర్ జిల్లా గుర్జాపూర్ వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న బ్యారేజీ పనులపైనా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపైనా నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి కేంద్ర జల వనరుల శాఖకు లేఖ రాశారు. గుర్జాపూర్ బ్యారేజీ నిర్మాణానికి కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్లు ఎలాంటి నీటి కేటాయింపులు జరపలేదని అందులో పేర్కొన్నారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి కర్ణాటక ఎలాంటి మాస్టర్ ప్లాన్‌ను ట్రిబ్యునల్‌కు సమర్పించలేదని చెప్పారు. గుర్జాపూర్తో పాటు కృష్ణా, భీమా, ఇతర నదుల పరీవాహక ప్రాంతంలోని ప్రవాహాలపైనా కర్ణాటక ప్రభుత్వం 75 టీఎంసీల సామర్థ్యం కలిగిన 52 బ్యారేజీలను నిర్మించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. 2015-16కు సంబంధించి ఎగువ నుంచి ప్రవాహం లేక జూరాల ప్రాజెక్టులోకి నీరు చేరలేదని... కర్ణాటక నిర్మిస్తున్న బ్యారేజీల మూలంగా దిగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు, ప్రకాశం బ్యారేజీపై తీవ్ర ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. గుర్జాపూర్ బ్యారేజీ నిర్మాణంపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసినా కర్ణాటక ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని, శరవేగంగా పనులు చేస్తోందని పేర్కొన్నారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌తో పాటు కేంద్ర జల మండలి, ఇతర అనుమతులకు సంబంధించిన పత్రాలను తమకు అందజేసేలా కర్ణాటకను ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది.