ఆర్డీఎస్ కుడి కాలువను అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ఉపనది తుంగభద్రపై రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) కుడి కాలువ పథకాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. లేఖ ప్రతులను కృష్ణా నది యాజమాన్య బోర్డుతో పాటు, ఏపీ ప్రభుత్వానికి పంపింది. ఆర్డీఎస్ కుడి కాలువ పథకం పేరిట నాలుగు టీఎంసీల మళ్లింపునకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆ లేఖలో ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్-1తో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టం నిబంధనలకు కూడా వ్యతిరేకమని స్పష్టీకరించింది. కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్-2 కేటాయింపులపై ఇప్పటికే జల వివాదాలు నెలకొన్నాయని... ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా కేసు విచారణలో ఉందని లేఖలో ప్రస్తావించింది.
1956 నాటి నిబంధనల ప్రకారం ఆర్డీఎస్ ద్వారా 15.90 టీఎంసీలను వినియోగించుకుని తెలంగాణలో 87,500 ఎకరాలకు సాగునీరివ్వాల్సి ఉందని... కానీ ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతం ఎన్నడూ 5 టీఎంసీలకు మించి వాడుకోలేదని తెలిపింది. కృష్ణా ట్రిబ్యునల్-2, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఆర్డీఎస్ కుడి కాలువ పథకం పనులు చేపట్టడాన్ని అడ్డుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
గుర్జాపూర్‌తో దిగువ ప్రాజెక్టులకు గండం
కృష్ణా-భీమా నదుల సంగమానికి మూడు కిలోమీటర్ల ఎగువన రాయచూర్ జిల్లా గుర్జాపూర్ వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న బ్యారేజీ పనులపైనా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపైనా నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి కేంద్ర జల వనరుల శాఖకు లేఖ రాశారు. గుర్జాపూర్ బ్యారేజీ నిర్మాణానికి కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్‌లు ఎలాంటి నీటి కేటాయింపులు జరపలేదని అందులో పేర్కొన్నారు.
ఈ బ్యారేజీ నిర్మాణానికి కర్ణాటక ఎలాంటి మాస్టర్ ప్లాన్‌ను ట్రిబ్యునల్‌కు సమర్పించలేదని చెప్పారు. గుర్జాపూర్‌తో పాటు కృష్ణా, భీమా, ఇతర నదుల పరీవాహక ప్రాంతంలోని ప్రవాహాలపైనా కర్ణాటక ప్రభుత్వం 75 టీఎంసీల సామర్థ్యం కలిగిన 52 బ్యారేజీలను నిర్మించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. 2015-16కు సంబంధించి ఎగువ నుంచి ప్రవాహం లేక జూరాల ప్రాజెక్టులోకి నీరు చేరలేదని... కర్ణాటక నిర్మిస్తున్న బ్యారేజీల మూలంగా దిగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు, ప్రకాశం బ్యారేజీపై తీవ్ర ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు.
గుర్జాపూర్ బ్యారేజీ నిర్మాణంపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసినా కర్ణాటక ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని, శరవేగంగా పనులు చేస్తోందని పేర్కొన్నారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌తో పాటు కేంద్ర జల మండలి, ఇతర అనుమతులకు సంబంధించిన పత్రాలను తమకు అందజేసేలా కర్ణాటకను ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది.