ర్యాన్ స్కూల్ యజమానులకు చుక్కెదురు
గుర్గావ్ : దేశంలో సంచలనం సృష్టించిన గుర్గావ్ బాలుడి హత్య కేసులో పాఠశాల యాజమాన్యానికి చుక్కెదురైంది. తమను అరెస్టు చేయకుండా నిలుపుదల ఆదేశాలు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ను పంజాబ్ హర్యానా హైకోర్టు తిరస్కరించింది. అలాగే, దీనిపై వీలయినంత త్వరగా ప్రభుత్వ స్పందన తెలియజేయాలంటూ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది.
గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ప్రద్యుమన్ ఠాకూర్ అనే ఏడేళ్ల విద్యార్థిని బస్సు కండక్టర్ అతి దారుణంగా కత్తితో గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. స్కూల్ బాత్ రూంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పింటో, గ్రేస్ పింటో, ఫ్రాన్సిస్ పింటోలను బాధ్యులుగా చేరుస్తూ వారి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు తమను అరెస్టు చేయకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించగా వారికి చుక్కెదురైంది. తదుపరి విచారణ ఈ నెల(సెప్టెంబర్) 25న జరగనుంది.