ఇక నాకు దిష్టి తగలదు
కొంతమంది పైకి మోడ్రన్‌గా కనిపించినా లోలోపల మాత్రం చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు. చార్మి అలాంటి అమ్మాయే. సినిమాల్లోనే కాదు.. విడిగా కూడా దాదాపు మోడ్రన్ దుస్తుల్లో కనిపించే చార్మి పండగలు, పూజలకు మాత్రం సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరిస్తారు. ఇక, పూజలు, పునస్కారాల గురించి చెప్పక్కర్లేదు. వీలు చిక్కినప్పుడు గుడికెళ్తారు.. లేనప్పుడు ఇంట్లోనే పూజలు చేసుకుంటారామె. దాదాపు మూడు నెలల క్రితం వికారాబాద్‌లోని శివుడి గుడికెళ్లారు చార్మి.
‘మంగళ’ సినిమాకి నంది అవార్డు వస్తే, గుడికొస్తానని మొక్కుకున్నారట. ఆ మొక్కుని తీర్చేసుకున్నారు. మరి.. ప్రస్తుతం ఏం మొక్కుకున్నారో ఏమో కానీ ఇంట్లో, అఖండ పూజ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా 48 గంటల పాటు నిరాటంకంగా ‘గురుగ్రంథ్‌సాహిబ్’ చదువుతామని చార్మి ట్విట్టర్లో పేర్కొన్నారు. గురుగ్రంథ్‌సాహిబ్ అంటే.. సిక్కుల పవిత్ర గ్రంథం. ఈ అఖండ పూజ మాత్రమే కాదు.. దిష్టి తగలకుండా చేతికి రెండు పూసల గాజులు ధరించారు చార్మి. తననెంతో అభిమానించే వ్యక్తి వీటిని బహుమతిగా ఇచ్చారని, ఇక దిష్టి తగిలే ప్రసక్తే లేదని చార్మి తెలిపారు. అంతగా అభిమానం కనబర్చిన ఆ వ్యక్తి ఆడా, మగా అనేది మాత్రం స్పష్టం చేయలేదు ఈ బ్యూటీ.