Gussadi Dance
-
ఇందిరా గాంధీ కాళ్లకు గజ్జెలు కట్టా..
నెమలి పురివిప్పి నాట్యమాడితే అడవి పరవశిస్తుంది.. కానీ, ఆ కళాకారుడు గుస్సాడీ నృత్యం చేస్తే అడవే పాదం కలుపుతుంది.. ఆయన గాగ్ర కాళ్లగజ్జెలు కట్టి ఆడితే చెట్టూ, పుట్టా, కొండ, కోన ప్రతిధ్వనిస్తుంది.. ఆయన నృత్యప్రకంపనలు క్రమేణా అడవిని దాటి దేశ రాజధానిని తాకాయి. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా గాగ్ర గజ్జెలతో గుస్సాడీలో కాలు కదిపారు. ఆయన కళాప్రదర్శనకు 2002లో అప్పటి రాష్ట్రపతి కలాం కూడా సలాం చేశారు. కళలోనే కళాకారుల జీవితం నిమగ్నమై ఉంటుందని నిరూపించిన కనకరాజుకు దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ వరించింది. ఈ పురస్కారం పొందిన మొదటి తెలంగాణ ఆదివాసీ కళాకారుడిగా గుస్సాడీ కనకరాజు నిలిచారు. ఈ సందర్భంగా ఎనభై ఏళ్లు దాటిన పద్మశ్రీ కనకరాజు ప్రత్యేకంగా ‘సాక్షి’తో తన మనోగతాన్ని పంచుకున్నారు. ఆయన ఆలోచనలు, అనుభవాలు తన మాటల్లోనే... -సాక్షి, హైదరాబాద్ దండారి నృత్యమే స్ఫూర్తి... ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి మా సొంత ఊరు. మేం అడవితల్లి బిడ్డలం. నా చిన్నతనంలో దండారి నృత్యం చూసి స్ఫూర్తిపొందాను. నాకంటూ ఏ గురువూ లేడు. నేను చేసే గుస్సాడీ నృత్యం దండారిలోంచి వచ్చిందే. కళలో లీనమైన నన్ను చాలామంది గుస్సాడీగానే పిలిచేవారు. వారసత్వసంపద నుంచి నేర్చుకున్న కళ నాకు సంతృప్తినే కాకుండా మా ఆదివాసీలందరికీ గుర్తింపునిచ్చింది. కలాం ముందు ప్రదర్శనలు ఇచ్చా.. పద్మశ్రీ లాంటి అవార్డు తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో ఉండే ఆదివాసీ కళాకారులకు వస్తుందని నేను ఊహించలేదు. 1955 నుంచి ఇప్పటివరకు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. 1982లో దేశ రాజధానిలో నిర్వహించిన పరేడ్‌లో అప్పటి ప్రధాని ఇందిర కాళ్లకు మా సంప్రదాయ గాగ్ర గజ్జెలు కట్టాను. ఆమె కూడా మాతోపాటు పాదం కలిపారు. 2002లో రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ముందు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించాను. ఇప్పటివరకు దాదాపు 300 మంది కళాకారులకు గుస్సాడీ నృత్యాన్ని నేర్పాను. ఈ తరం వారికి నేర్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడితే సహకారమందించడానికి నేను సిద్ధం. (చదవండి: మన గుస్సాడీ రాజుకు పద్మశ్రీ) వ్యవసాయమే బతుకుదెరువు.. మాది గోండు సూర్యవంశం. గుస్సాడీ నృత్యం నా ఊపిరి. కానీ, ఇది మా బతుకుదెరువు కాదు. వ్యవసాయమే ఆధారం. ఎనిమిది మంది కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. వ్యవసాయంతోనే కుటుంబాన్ని పోషించాను. ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వాలు మరింత దృష్టి సారిస్తాయని ఆశిస్తున్నాను. ఇందిరా గాంధీతో కనకరాజు (వృత్తంలో) వైభవోత్సవమైన సంప్రదాయాలు మా సంస్కృతే మా పండుగ. దసరా, దీపావళి మధ్యలో నిర్వహించే భోగిలో గుస్సాడీ నృత్యం ప్రారంభమవుతుంది. గుస్సాడీలో ప్రత్యేక వేషధారణ ఉంటుంది. చేతిలో దండారి, తలపై మల్జాలిన టోíపీ, (మలి అంటే నెమలి, జాలి అంటే ఈకలు అని అర్థం) గాగ్ర కాలిగజ్జెలు, మెడలో నైపాల్క్ హారం, జోరి, గంగారం సోట, జంతువుల చర్మంతో చేసిన వస్త్రాలు, డప్పులు ఉంటాయి. మల్జాలిన టోíపీ పెట్టుకున్న వ్యక్తి ఆదివాసీల దైవం మస్మసూర్‌తో సమానం అని మా ప్రగాఢ నమ్మకం. -
గుస్సాడీ నృత్యం అంటే తెలుసా!
సాక్షి, మంచిర్యాల: ఆదివాసీ గూడేల్లో మాత్రమే కనిపించే గుస్సాడీ నృత్యం ఒక విశిష్టమైన కళ. ఇది రాజ్ గోండు గిరిజనుల ప్రత్యేకం. ఈ నాట్య ప్రదర్శనలో అపార నైపుణ్యం గడించిన కనకరాజు సొంతూరు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామం. తమ సంస్కృతిని కొత్త తరానికి అందిస్తున్న గుస్సాడీ రాజు కనకరాజుకు పద్మశ్రీ దక్కడంతో ఆదివాసీ సమాజం హర్షిస్తోంది. ఈ ప్రాచీన నృత్యంపై మైదాన ప్రాంతాల్లోని వారికి అవగాహన తక్కువ. ఆదివాసీ సంప్రదాయాల్లో గుస్సాడీ ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాచీన దేవతా కళ తరతరాలు దాటుకుంటూ ప్రస్తుత రోబోటిక్ యుగంలోనూ కొనసాగుతోంది. ఈ నాట్యానికి మెరుగులు దిద్దడమేగాక నేటి తరానికి శిక్షణ ఇస్తూ.. మరింత గొప్ప కళగా మలిచారు కనకరాజు. ఈ కళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోనూ ఉంది. పౌరాణిక గాథల్లో ప్రస్తావన.. గుస్సాడీ నృత్యం ఆవిర్భావంపై అనేక పౌరాణిక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గుస్సాడీ నాట్యం శివుడి ప్రతిరూపం, యత్మసూరు దేవత స్వరూపంగా.. ప్రకృతి ఆరాధనలో ఓ భాగమని ఆదివాసీ పెద్దలు చెబుతారు. తమ పూర్వీకులు అందించిన ఈ నృత్యానికి కాలక్రమేణా ఆదివాసీ ప్రముఖులు మరింత వన్నె తెచ్చారు. వీరిలో ఉట్నూరు ఐటీడీఏ ఏపీవోగా పనిచేసిన ఆదివాసీ ఐఏఎస్ మడవి తుకారాం విశేష కృషి చేశారు. 1940 దశకంలో రాజ్ గోండులపై అధ్యయనం చేసిన హైమన్ డార్ఫ్, ఆ తర్వాత 1978లో ఆదిలాబాద్‌కు వచ్చిన ఆయన శిష్యుడు మైకేల్ యోర్క్ తమ రచనల్లో, డాక్యుమెంటరీల్లో గుస్సాడీ ప్రత్యేకత వివరించారు. దండారీ ఉత్సవంలో... ఆదివాసీ గూడేల్లో దీపావళి పండుగకు వారం ముందు మొదలయ్యే దండారీ ఉత్సవాల్లో గుస్సాడీ ప్రదర్శనలు అమితంగా ఆకర్షిస్తాయి. పురుషులు మాత్రమే గుస్సాడీ వేషధారణ వేస్తారు. గుస్సాడీగా ఉన్న వ్యక్తి నిష్ఠతో దండారీ పూర్తయ్యే వరకూ కఠిన నియమాలు పాటించాలి. తలపై నెమలి టోపీ (మాల్బూర), చేతిలో దండం (కర్ర), భుజానికి జింక తోలు, ఒళ్లంతా బూడిద, చేతికి పూసలు, రుద్రాక్షలు, కంకణాలు, గుబురు మీసాలు, గడ్డాలతో దీక్ష కొనసాగిస్తారు. వారం, పది రోజులు (దండారీ పూర్తయ్యే వరకు) స్నానం చేయరు. ఒక్కో నెమలి టోపీలో వెయ్యికి పైగా ఈకలు అమర్చుతారు. దీనిని నిపుణులతో చేయిస్తారు. కొందరు ఆడ వేషంలోనూ ఆకట్టుకుంటారు. నృత్యం చేసేప్పుడు సంప్రదాయ వాయిద్యాలైన తుడుం, పిప్రి, కాలికం, డప్పు, గుమెలా, ధోల్, వెట్టి, కర్ర (దండం)తో వాయిస్తూ.. ఎంతో రమణీయంగా పాడుతుంటారు. కష్ట సుఖాలు, సంతోషాన్ని ఆనందాన్ని నాట్యంలో వ్యక్తపరుస్తారు. సాధారణంగా ఈ నృత్యాన్ని దండారీలోనే ప్రదర్శిస్తుంటారు. కళ సాగేంతవరకు తమను తాము మైమరచి దైవత్వం కలిగి ఉంటారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బృందంగా ఏర్పడి వెళతారు. గుస్సాడీలకు ఆతిథ్యం ఇచ్చిన గ్రామంలో మెప్పుపొందేలా వారి ప్రదర్శనలు ఉంటాయి. దండారీ ఉత్సవాల కోసం కొన్ని నెలల ముందే ఆదివాసీ గూడేలు సన్నద్ధమవుతాయి. చదవండి: గుస్సాడీ కనకరాజును అభినందించిన మంత్రి -
గుస్సాడీ కనకరాజును అభినందించిన మంత్రి
సాక్షి, ఆదిలాబాద్ : కొమరం భీమ్ జిల్లా అదివాసీ కళాకారునికి అరుదైన గౌరవం లభించింది. సంప్రదాయాలు పాటిస్తూ, ఆచారాలు పరిరక్షిస్తున్న ఆదివాసీ కళకారుడు కనకరాజు.. సంప్రదాయ గుస్సాడీ న్రుత్యం చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. అలాంటి గుస్సాడీ కళకారుడు కనకరాజును కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు వరించింది. పద్మశ్రీ అవార్డు దక్కిన వారిలో తెలంగాణ నుంచి ఎంపికైన వారిలోకనకరాజు ఏకైక వ్యక్తి కావడం విశేషం. గిరిజన గుస్సాడీ కళకారునిగా అరుదైన పద్మశ్రీ అవార్డు కనకరాజుకు లభించడంతో అదివాసీల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. అదివాసీ కళకారునికి కేంద్ర పురస్కారం దక్కించుకున్న కనకరాజును అందరూ అభినందిస్తున్నారు. చదవండి: పద్మ పురస్కారాలు: ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్ అద్బుతమైన కళా నైపుణ్యంతో ఈ అవార్డును సాదించిన కనకరాజును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలా ఉండగా ఓకళాకారునిగా కేంద్రం పురస్కారం లబించడంపై కనకరాజు సంతోషం వ్యక్తం చేశారు. కలలో కూడ ఈ అవార్డు దక్కతుందని ఊహించలేందని భావోద్వేగానికి లోనయ్యారు. అవార్డు తనకు దక్కినప్పటికీ గిరిజనుల కళకు సర్కార్ ఇచ్చిన గౌరవంగా బావిస్తున్నానని కనకరాజు పేర్కొన్నారు. అయితే కళకారుని అద్బుతమైన నైపుణ్యం ఉన్నా.. అర్థికంగా అంతంత మాత్రమే బతుకున్నారని, అర్థికంగా సర్కారు అదుకోవాలని కనకరాజు కోరారు. అయితే గుస్సాడీ కళ వందల ఎళ్ల కాలం నుండి వస్తున్నా కళ. ప్రతి ఏటా దీపావళి సందర్భంగా దండారి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అదివాసీల దైవం ఎథ్మసూర్‌ను ప్రార్థిస్తూ గుస్సాడీ నృత్యం చేస్తారు గిరిజనులు. గుస్సాడీ నృత్యం చేసే వాళ్లు నెత్తిన నెమలి పించం, భుజాన జింక చర్మాన్ని దరించి, చేతిలో దండారి పట్టుకొని గిరిజన సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తారు. గిరిజన సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా గుస్సాడీ చేసే నాట్యం చూపరుల గుండెలను హత్తుకునేలా ఉంటుంది. ఇలాంటి అద్బుతమైన కళను కనరాజు పరిరక్షరిస్తున్నారు. అందులో బాగంగా గుస్సాడీలో గిరిజనులకు శిక్షణ ఇస్తున్నారు. ఈవిదంగా కొన్ని వందల మందికి శిక్షణ ఇచ్చారు. అందుకే కనకరాజును గుస్సాడీ గురువుగా పిలుస్తుంటారు. ఒకవైపు గుస్సాడీ కళను పరిరక్షిస్తూనే మరోకవైపు కనకరాజు శిక్షణ ఇస్తున్నారు. అద్బుతమైన నైపుణ్యంతో అనేక ప్రాంతాలలో గుస్సాడీ కళ ప్రదర్శనలు ఇచ్చారు. మాజీ ప్రదాన మంత్రి ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముందు ఢిల్లీలో ప్రదర్శనలు ఇచ్చారు..ఇలా ఏందరో మహనుబావులను గుస్సాడీ కళ నైపుణ్యంతో అకట్టుకున్నారు. వివిర రంగాల వ్యక్తుల నుండి ప్రశంసలు, మన్ననలు కనకరాజుకు లబించాయి. -
దందారి వేడుకల్లో మంత్రిగారి డ్యాన్స్