'నచ్చినవారికే ట్రాక్టర్లు ఇస్తున్నారు'
హైదరాబాద్ : రైతులకు ఇచ్చే సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అంతగా ఆదరణలేని ట్రాక్టర్ల కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం వెనక మతలబు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. సబ్సిడీ ట్రాక్టర్లను రైతులకు కాకుండా టీఆర్ఎస్ నేతలకే ఇస్తున్నారని గుత్తా విమర్శించారు. లబ్దిదారుల ఎంపిక అధికారం మంత్రులకు ఇవ్వడం వల్ల వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ రైతులకు అన్యాయం జరిగిందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయకుండా మంత్రులు తమకు నచ్చినవారికే ట్రాక్టర్లు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి, విజిలెన్స్ శాఖకు లేఖ రాసినట్లు చెప్పారు. ఎంట్రీ ట్యాక్స్ వివాదంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూర్చొని చర్చలు జరపాలన్నారు. దీనిపై కేంద్రం జ్యోకం చేసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.