'ఆత్మహత్య చేసుకోవాలని ఉంది'
⇒ టీడీపీ నాయకులు వేధిస్తున్నారు
⇒ ఎల్ఎన్.పేట మండల ఇన్చార్జి తహసీల్దారు ఆవేదన
ఎల్.ఎన్.పేట: తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం ఇన్చార్జి తహసీల్దారు జి.వి.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. మండలాధ్యక్షురాలు ఒమ్మి కృష్ణవేణి అధ్యక్షతన గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఎన్.ఎం.ఎన్.వి.రమణమూర్తి అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా సెలవులో ఉన్నారు. దీంతో డీటీగా పనిచేస్తున్న నారాయణమూర్తి ఇన్చార్జి తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
మండల సమావేశంలో రెవెన్యూశాఖకు సంబంధించిన చర్చ జరుగుతున్న సమయంలో ముంగెన్నపాడు సర్పంచ్ యారబాటి రాంబాబు తన పంచాయతీలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపు విషయమై ప్రశ్నించారు. ఆయన ప్రశ్నలకు సమాధానం చెబుతున్న సమయంలో నారాయణమూర్తి కలుగు చేసుకున్నారు. నాయకుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలో గ్రామంలోని టీడీపీ నాయకులు రెండుగా విడిపోయారు. ఒక వర్గం నేతలు ఆక్రమణలు తొలగించాలని పట్టుబడుతుండగా మరొకరు ఆక్రమణలు తొలగించవద్దని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఇలా అయితే ఉద్యోగాలు చేయడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు.