బాబు, బోయపాటిలపై కేసు నమోదు
రాజమండ్రి క్రైం : పుష్కరాల ప్రారంభం సందర్భంగా ఈ నెల 14న రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీరాజ్ త్రీ టౌన్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. పుష్కరాల ప్రారంభం రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై షార్ట్ ఫిల్మ్ తీయడమే తొక్కిసలాటకు కారణమని, తన పాపులార్టీని పెంచుకునేందుకు పుష్కరాలను చంద్రబాబు ఉపయోగించుకున్నారని జీవీ శ్రీరాజ్ తన ఫిర్యాదులో ఆరోపించారు.
షార్ట్‌ఫిల్మ్ రూపకల్పనకు ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌కు అప్పగించారని, షార్ట్‌ఫిల్మ్ మిషతో ఆయన అనధికార అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరించారని తెలిపారు. పుష్కర ప్రారంభోత్సవంతో బోయపాటి శ్రీనివాస్‌కు ఏ సంబంధమూ లేనప్పటికీ, తెలుగుదేశం పార్టీ ఏజెంటుగా వ్యవహరించారన్నారు. ఆయనకు ప్రభుత్వ యంత్రాంగ నిర్వహణ, ఉత్సవ నిర్వహణ, ప్రొటోకాల్ వ్యవహారంలో ఎటువంటి అనుభవమూ లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. బోయపాటి శ్రీనివాస్ అనధికార నిర్వహణలో పుష్కరాలు జరిగాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
షార్ట్‌ఫిల్మ్ చిత్రీకరణకు రెండున్నర గంటలపాటు స్నానఘట్టాలను చిత్రీకరించారన్నారు. ఈ క్రమంలో బోయపాటి శ్రీనివాస్ ప్రజలను వదలండని చెప్పడంతో ప్రజలను అధికారులు ఒకేసారి ఘాట్‌లోకి వదిలారన్నారు. దీనివల్లనే 29 మంది మృతి చెందారని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన చంద్రబాబు నాయుడు, బోయపాటి శ్రీనివాస్లపైన, ఆయన ఆదేశాలు పాటించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన కలెక్టర్, రాజమండ్రి అర్బన్ ఎస్పీలపై న్యాయవిచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శ్రీరాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.