జీవీకే కౌంటర్లో బ్లాక్ డీల్
సాక్షి, అమవరావతి: సోమవారం మార్కెట్లు నష్టాల్లో ముగిసినా జీవీకే ఇన్ఫ్రా షేరు 10 శాతం పెరిగి రూ. 6.90 వద్ద ముగిసింది. ఒకానొక దశలో రూ.7.45 గరిష్ట స్థాయికి చేరినా చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 60 పైసల లాభంతో రూ. 6.90 వద్ద ముగిసింది. మార్కెట్ ప్రారంభంలోనే బ్లాక్‌డీల్ జరగడంతో ఈ కౌంటర్లో రోజంతా భారీగా లావాదేవీలు జరిగాయి. సాధారణంగా రెండు ఎక్స్ఛేంజీల్లో కలిపి రోజుకు 63 లక్షల షేర్లు (30 రోజుల సగటు) మారుతుంటే సోమవారం ఒక్కరోజే సుమారు 10 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం. ఉదయం 9.25 నిమిషాలకు రూ. 6.30 ధర వద్ద 5.71 కోట్ల షేర్లు బ్లాక్‌డీల్ రూపంలో చేతులు మారాయి.
ఈ డీల్ విలువ రూ. 36 కోట్లు. హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మారిషస్ లిమిటెడ్ తన షేర్లను హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇండియన్ ఈక్విటీకి మార్చినట్లు బీఎస్ఈ డేటా వెల్లడిస్తోంది. ఒకానొక దశలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా జీవీకే షేర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్లు మార్కెట్లో పుకార్లు షికార్లు చేశాయి. జీవీకేలో ప్రమోటర్లకు 54.25 శాతం వాటా ఉండగా, మార్కెట్ క్యాప్ రూ.1,094 కోట్లుగా ఉంది.