జుట్టు మెరుపు కోల్పోకుండా ఉండాలంటే...
బ్యూటిప్స్
పొడిబారిన జుట్టు అందవిహీనంగా కనిపించేలా చేస్తుంది. అంతే కాదు, జుట్టు రాలడం, వెంట్రుకలు చిట్లడం, తెల్లబారడం.. వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే... తల స్నానం చేయడానికి ముందు తలకు నూనె పట్టించి, మర్దనా చేయాలి. కనీసం వారానికి ఒకసారైనా ఈ జాగ్రత్త తప్పనిసరి.
తలంటుకోవడానికి హైడ్రేటింగ్ షాంపూనే ఎంచుకోవాలి. షాంపూ పాకెట్ లేదా బాటిల్ మీద ఫర్ డ్రై హెయిర్, నార్మల్ హెయిర్.. అనే సూచన ఉంటుంది. డ్రై హెయిర్‌కి అని ఉన్నదాంట్లో హైడ్రేటింగ్ గుణాలు ఎక్కువ ఉంటాయి. అలొవెరా శాతం ఎక్కువ షాంపూలను కూడా పొడిజుట్టుగలవారు ఎంచుకోవచ్చు.
నాణ్యమైన హెయిర్ సీరమ్‌ను ఎంచుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి కురులైనా దెబ్బతింటాయి. చిట్లిన వెంట్రుకల చివరలను కత్తిరించడం, సీరమ్ వాడటం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. వారానికి ఒక్కసారి హైడ్రేటింగ్ మాస్క్ వేసుకోవాలి. అంటే షాంపూతో తలంటుకున్న తర్వాత కండిషనర్‌ని తప్పక ఉపయోగించాలి. తడి జుట్టుకు హెయిర్ క్రీమ్ మాడుకు తగలకుండా రాయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ కేశసంపద దెబ్బతినకుండా మృదువుగా, నిగనిగాలాడేలా ఉంటుంది.