సుప్రీంను ఆశ్రయించిన హాజీ అలీ దర్గా ట్రస్ట్
న్యూఢిల్లీ : ముంబైలోని ప్రసిద్ధ హాజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దర్గా ట్రస్ట్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హాజీ అలీ దర్గా లోపలకి కూడా మహిళలు వెళ్ళొచ్చంటూ బాంబే హైకోర్టు ఈ ఏడాది ఆగస్ట్ 26న చరిత్రాత్మక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే బాంబో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ట్రస్టీ సభ్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
కాగా దర్గాలోకి మహిళలను ప్రవేశించనివ్వడం లేదంటూ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌కు చెందిన నూర్జహాన్ నియాజ్, జకియా సోమన్ అనే మహిళలు కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. 'హాజీ అలీ దర్గా లోపలికి మహిళల ప్రవేశంపై దర్గా ట్రస్టు విధించిన నిషేధం భారత రాజ్యాంగంలోని 14, 15, 25 అధికరణలకు విరుద్ధమని మేము భావిస్తున్నాం. పురుషులతో సమానంగా మహిళలను కూడా దర్గాలోపలికి అనుమతించాలి' అని న్యాయమూర్తులు విఎం కానడై, రేవతి మోహితే డేరేలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
దీంతో బాంబో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ట్రస్ట్ బోర్డు ఉన్నత ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో ఈ దర్గా లోపలివరకు మహిళలను అనుమతించేవారిని అయితే, షరియత్ నియమ, నిబంధనల ప్రకారం వారిని నిషేధించాలని కొద్ది రోజుల కిందట నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్టు తన పిటిషన్లో పేర్కొంది.