నిజాం రుబాత్‌లో 678 మందికి ఉచిత వసతి
- తొలి విడతగా 224 మంది హజ్ యాత్రికుల ఎంపిక
- వారం రోజుల్లో మరో 454 మంది
- లక్కీ డ్రా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : హజ్‌యాత్ర-2016 సందర్భంగా మక్కా నిజాం రుబాత్‌లో 678 మంది యాత్రికులకు ఉచిత వసతి కల్పిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడించారు. మొత్తం 678 యాత్రికుల్లో తొలివిడతగా 224 మందిని ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. మరో వారంలో మిగిలిన 454 మంది యాత్రికులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ పాతబస్తీలోని చౌ మహల్లా ప్యాలెస్‌లో రుబాత్ ఉచిత బస కోసం నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నిజాం హయాంలో హజ్ యాత్రికుల కోసం మక్కాలో భవనాలు నిర్మించారని గుర్తు చేశారు.
అప్పటి నిజాం రాజ్యంలో ఉన్న 21 జిల్లాల యాత్రికులకు రుబాత్‌లో ఉచిత సౌకర్యం వర్తింపచేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని ఏడు, కర్ణాటకలోని నాలుగు జిల్లాల యాత్రికులు రుబాత్‌లో ఉచిత వసతికి అర్హులని పేర్కొన్నారు. నిజాం సర్కార్ మక్కాలో ఏడు భవనాలు నిర్మించగా రోడ్డు విస్తరణలో నాలుగు భవనాలను కూల్చివేశారని, ఒకటి శిథిలావస్థకు చేరిందని చెప్పారు. మిగిలిన రెండింటిలో యాత్రికులకు బస ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉచిత వసతి, భోజనం తదితర సౌకర్యాల కారణంగా ప్రతి యాత్రికుడికి సుమారు రూ.47,700 మిగులుబాటు అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కూడా యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మహమూద్ అలీ చెప్పారు. భవిష్యత్తులో హజ్యాత్రికులందరికీ మక్కా, మదీనాలో ఉచిత బస ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఎం షుకూర్, రుబాత్ కార్యనిర్వాహకుడు హుస్సేన్ మహ్మద్ అల్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.