సజావుగా పోలవరం
పోలవరం పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. నిధుల కొరత లేకుండా చూస్తే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం సవాలే. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలంటే ఇంకా రూ.30 వేల కోట్లు అవసరం. ఇదే అంశాన్ని కేంద్రానికి నివేదిస్తాం. ఇప్పటికే మంజూరు చేసిన రూ.1,850 కోట్లు తక్షణమే విడుదలవుతాయి. మిగతా బకాయిలు విడుదల చేసేలా కేంద్రానికి నివేదిక ఇస్తాం. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లపై ఇప్పటికే సీడబ్ల్యూసీ టీఏసీ(సాంకేతిక సలహా కమిటీ) ఆమోదముద్ర వేసింది. రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ కూడా ఆమోదముద్ర వేయగానే ఆ మేరకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది.
– కేంద్ర నిపుణుల కమిటీ చైర్మన్ హల్దార్
సాక్షి, అమరావతి: ‘‘పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక వాస్తవికంగా, ఆచరణాత్మకంగా ఉంది. ప్రస్తుతం పనులన్నీ ప్రణాళిక మేరకు సజావుగా సాగుతున్నాయి. నిధుల కొరత లేకుండా చూస్తే ఆ గడువులోగా పోలవరం ఫలాలను రైతులకు అందించవచ్చు’’ అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హల్దార్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ పేర్కొంది. ఈ సీజన్లో కాఫర్ డ్యామ్‌లు, స్పిల్ వే, పునరావాస పనులను సమన్వయంతో చేపట్టాలని కమిటీ జలవనరుల శాఖకు సూచించింది. పెండింగ్‌లో ఉన్న 9 డిజైన్లపై చర్చించేందుకు వారంలోగా ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి సమగ్ర వివరాలతో హాజరైతే ఆమోదించేలా చూస్తామని తెలిపింది.
పోలవరం ఎడమ కాలువ, హెడ్ వర్క్స్‌ను రెండు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర నిపుణుల కమిటీ సోమవారం ఉదయం కుడి కాలువను సందర్శించింది. అనంతరం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు విజయవాడలోని నీటిపారుదలశాఖ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది.
పనుల పూర్తికి ప్రణాళిక..
పోలవరాన్ని 2021లోగా పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారని ఆదిత్యనాథ్ దాస్ కేంద్ర నిపుణుల కమిటీకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిన వ్యయంలో రూ.5,103 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉందని, సవరించిన అంచనాల మేరకు నిధులిస్తే 2021 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. దీనిపై కేంద్ర నిపుణుల కమిటీ చైర్మన్ స్పందిస్తూ కార్యాచరణ ప్రణాళిక వాస్తవికంగా, ఆచరణాత్మకంగా ఉందని ప్రశంసించారు. కాఫర్ డ్యామ్‌లలో వరదను దిగువకు వదలడానికి ఉంచిన ఖాళీ ప్రదేశాలను అలాగే ఉంచి.. మిగిలిన పనులు (ఎగువ కాఫర్ డ్యామ్ 42 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్ 30 మీటర్లు) పూర్తి చేయాలని సూచించారు. స్పిల్‌వేలో 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాల్సి ఉందని, 48 గేట్లను బిగించాల్సి ఉందన్నారు.
ఈ పనులను మే నాటికి పూర్తి చేసి 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించగలిగితే అప్పుడు కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయాలని దిశా నిర్దేశం చేశారు. అప్పుడు వరదను స్పిల్‌వే మీదుగా మళ్లించి ఈసీఆర్ఎఫ్ పనులు నిర్విఘ్నంగా పూర్తి చేయవచ్చన్నారు. హెడ్‌వర్క్స్‌ను పూర్తి చేసి జలాశయంలో నీటిని నిల్వ చేసినా కాలువలకు నీటిని విడుదల చేసే అనుసంధానాలు(కనెక్టివిటీస్) పూర్తి చేయకపోతే ఫలితం ఉండదన్నారు. ఎడమ కాలువ అనుసంధానం పనుల్లో 18 మీటర్ల వ్యాసంతో సొరంగం తవ్వకం పనులు మూడు దశల్లో చేస్తుండటం వల్ల కొంత జాప్యం చోటుచేసుకుంటోందని సీఈ సుధాకర్ బాబు వివరించారు.
పునరావాసమే పెద్ద సవాల్..
పోలవరంలో 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలో 1.05 లక్షల కుటుంబాలు నిర్వాసితులుగా మారతాయని నిపుణుల కమిటీకి అధికారులు వివరించారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో 18,620 నిర్వాసిత కుటుంబాలకుగానూ 3,922 కుటుంబాలకు పునరావాసం కల్పించామని, మే నాటికి మిగతా 14,698 కుటుంబాలకు పునరావాసం కల్పించే విధంగా వేగంగా చర్యలు చేపట్టామని, నిధుల కొరత లేకుండా చూస్తే పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికతో కేంద్ర నిపుణుల కమిటీ ఛైర్మన్ హల్దార్ ఏకీభవిస్తూ నిర్వాసితులకు పునరావాసం కల్పించడమే పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. నిధుల కొరత లేకుండా చూస్తే 2021 నాటికి పోలవరం పనులు పూర్తి చేయవచ్చని, ఇదే అంశాన్ని కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు నివేదిస్తామని తెలిపారు. సమావేశంలో కేంద్ర నిపుణుల కమిటీ సభ్యులు ఆర్కే పచౌరి, ఎస్ఎల్ గుప్తా, రంగారెడ్డి, బీపీ పాండే, డీపీ భార్గవ, భూపేందర్‌సింగ్, నాగేంద్రకుమార్, దేవేంద్రకుమార్, వ్యాప్కోస్ ప్రతినిధులు పాల్గొన్నారు.