Half-hearted funds
-
కృష్ణుడు కరుణించలేదు
► సిక్కోలుపై శీతకన్ను! ► నదుల అనుసంధానం, ఆఫ్‌షోర్ ప్రాజెక్టుల ఊసే లేదు ► చంద్రబాబు హామీలకూ బడ్జెట్లో దక్కని నిధులు ► పారిశ్రామిక అభివృద్ధికి కేటాయింపుల కొరత ► వంశధార ప్రాజెక్టుకు అరకొర నిధులే ► రిమ్స్‌కు మొండిచేయి... ► ఈసారైనాగూడు దక్కేనా? ► ఎన్నికల హామీలు నెరవేరేనా? ►4వ బడ్జెట్లోనూ జిల్లాకు చోటు కరువు వెనుకబడిన జిల్లాగా గుర్తించామని ప్రభుత్వం చెబుతుంటే నిధుల కేటాయింపులో పెద్దపీట వేస్తారని జిల్లాప్రజలు ఆశించారు. కానీ అది ప్రకటనలకే పరిమితమని రాష్ట్ర బడ్జెట్ మరోసారి రుజువు చేసింది. గత మూడు బడ్జెట్ల్లోనూ జిల్లాకు మొండిచేయి ఎదురైనా కనీసం నాలుగో బడ్జెట్లోనైనా జిల్లాకు మేలు జరుగుతుందనుకుంటే... ప్రజల ఆశలు అడియాశలే అయ్యాయి. బుధవారం శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశలే మిగిల్చింది. సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: జిల్లాలో అత్యంత ప్రధానమైన వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని, వంశధార–నాగావళి నదులను అనుసంధానం చేస్తామని, ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తామని జనచైతన్య సదస్సు (10.12.2015)లో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వంశధార నిర్వాసితులకు రూ.5 లక్షల చొప్పున యూత్ ప్యాకేజీ ఇవ్వడానికి ఇటీవల ప్రభుత్వం రూ.421.80 కోట్లు కేటాయించింది. హిరమండలం రిజర్వాయర్ పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని సీఎం, మంత్రి అచ్చెన్న ఇస్తున్న వాగ్దానాలు కార్యారూపం దాల్చాలంటే నిర్వాసితుల సమస్య పరిష్కారానికి అవసరమైన నిధులు పూర్తిస్థాయిలో కేటాయింపులు జరగాలి. కానీ వంశధార స్టేజీ–1కు 2014–15 బడ్జెట్లో రూ.3 కోట్లు, 2015–16లో రూ.18 కోట్లు, 2016–17లో రూ.9.57 కోట్లు కేటాయించారు. కనీసం ఈ బడ్జెట్లోనైనా పెంచుతారనుకుంటే మళ్లీ రూ.9.57 కోట్లతోనే సరిపెట్టారు. ప్రాజెక్టు స్టేజీ–2కి 2014–15 బడ్జెట్లో రూ.32.93 కోట్లు, 2014–15లో రూ.32.81 కోట్లు, 2016–17లో రూ.56.77 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో మాత్రం రూ.54.82 కోట్లు మాత్రమే విదిల్చారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం రైతుల డిమాండ్లను పరిష్కరించాలంటే ఈ నిధులు ఏమూలకూ సరిపోవు. అలాగే టెక్కలి డివిజన్లోని ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు కానీ, నాగావళి–వంశధాన నదుల అనుసంధానం గురించి కానీ ఈ బడ్జెట్లో ప్రస్తావన లేదు. ట్రిఫుల్ ఐటీ అంతేసంగతులా...: శ్రీకాకుళం ట్రిఫుల్ఐటీ వచ్చే విద్యాసంవత్సరానికి కూడా జిల్లాకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎం పురంలో తొలుత 340 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం తర్వాత ఆ జీవోను ఉపసంహరించుకుంది. ఈ బడ్జెట్లోనైనా స్పష్టత వస్తుందేమో ఆశించినా నిధుల కేటాయింపే జరగలేదు. కవిటి మండలంలో ఉద్యాన కళాశాల, ఎచ్చెర్లలో వరి పరిశోధన కేంద్రం, మెరైన్ యూనివర్సిటీ, పొందూరు డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం గతంలో సీఎం హామీలిచ్చినా ఈ బడ్జెట్లోనూ వాటి ప్రస్తావన లేదు. మరోవైపు సంక్షేమ శాఖ హాస్టళ్లను ఎత్తివేసి గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అందుకు తగిన నిధులు కేటాయించలేదు. ‘స్మార్ట్’ ఎప్పటికో...: శ్రీకాకుళం సహా రాష్ట్రంలో మరో పది నగరాలకు కలిపి స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద కేవలం రూ.450 కోట్లు మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయించారు. వాటిని పంచితే శ్రీకాకుళానికి దక్కేది నాలుగైదు కోట్లకు మించవు. ఇక శ్రీకాకుళం నగరంలో వరద ముంపు సమస్య ఏర్పడకుండా రూ.119 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ, నగరం చుట్టూ 19.20 కి.మీ. పొడవున రూ.150 కోట్ల వ్యయంతో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తామని రెండేళ్ల క్రితమే సీఎం హామీ ఇచ్చినా ఈ బడ్జెట్లోనూ వాటి ఊసు లేదు. పారిశ్రామిక ప్రగతి అథోగతే...: జిల్లాలోని కళింగపట్నం, భావనపాడు రేవుల్లో ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తామని రైతు సదస్సు (14.02.2015)లో సీఎం ప్రకటించారు. భావనపాడు పోర్టును ఆదానీ గ్రూపుకు అప్పగించామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదు. పారిశ్రామిక రంగానికి రూ.2086 కోట్లు కేటాయించినప్పటికీ ఈ నిధుల్లో జిల్లా వాటా ఎంతో స్పష్టం చేయలేదు. ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణ అని పేర్కొన్నప్పటికీ అందుకు తగిన నిధులు కేటాయించలేదు. జిల్లాలో ఫుడ్‌పార్కు ఏర్పాటుచేస్తామని ప్రకటించినా అది ఎప్పటి నుంచో నలుగుతోంది. చెన్నై–విశాఖ పారిశ్రామిక కారిడార్‌ను శ్రీకాకుళం వరకూ పొడిగింపు ప్రస్తావనే లేదు. ఈసారైనా గూడు దక్కేనా?: నియోజకవర్గానికి 1200 చొప్పున పక్కాఇళ్లు నిర్మిస్తామన్న సీఎం హామీ నెరవేర్చేందుకు 2016–17 బడ్జెట్లో కేటాయింపులు జరిగినా జిల్లాకు మాత్రం నిధులు రాలేదు. ఈ బడ్జెట్లో రూ.1456 కోట్లు కేటాయించినా అందులో రెవెన్యూ వ్యయం పోతే మిగిలేది రూ.200 కోట్లు మాత్రమే. దీన్ని అన్ని జిల్లాలకు పంచితే వచ్చే నిధులు కేవలం పునాదుల నిర్మాణానికే సరిపోతాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలు నెరవేరేనా?: రైతురుణ మాఫీకి ఈ బడ్జెట్లో రూ.11వేల కోట్లు కేటాయించినా ఇప్పటికే రైతులకు అందజేసిన రుణవిముక్తి పత్రాల మేరకు మాఫీ చేయడానికే ఆ నిధులు సరిపోవు. తదుపరి వాయిదాల రుణమాఫీకి రూ.3,600 కోట్లు కేటాయించారు. కానీ ఇది కూడా రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సగం మంది రైతులకు కూడా సరిపోని పరిస్థితి. డ్వాక్రా రుణాల మాఫీ విషయానికొస్తే ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. జిల్లాలో మూడు లక్షలకు పైగా నిరుద్యోగ యువత ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఆ సంఖ్య కోటి వరకూ ఉండవచ్చు. మూడేళ్ల తర్వాత కొత్తగా ఈ బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ అవి ఏ మూలకు సరిపోతాయని నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు. రిమ్స్‌కు మొండిచేయి...: జిల్లాకు ఆరోగ్య ప్రదాయిని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)లో అసంపూర్తిగానున్న బ్లాక్‌ల నిర్మాణానికి రూ.20 కోట్లు, పీజీ కోర్సుల నిర్వహణకు రూ.10 కోట్లు కేటాయిస్తామని సీఎం రైతుసదస్సు (14.02.2015)లో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ వాటికి నిధుల కేటాయింపు జరగలేదు. ఇక ఎన్టీఆర్ వైద్యసేవకు ఈ బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బకాయిల చెల్లింపునకే సరిపోవనే వాదనలు వినిపిస్తున్నాయి. నరసన్నపేటలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా గాలిలో కలిసిపోయినట్లే. వరుసగా మరణాలు చోటుచేసుకుంటున్న ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ బడ్జెట్లో ఎలాంటి భరోసా దక్కలేదు. ప్రజలపై బాదుడు బడ్జెట్: బడ్జెట్ ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా బాదుడు వేసేలా ఉంది. లోటు బడ్జెట్ విడుదల చేసినప్పటికీ లోటును పూడ్చే మార్గాలు ఎక్కడా ప్రస్తావించలేదు. స్వాతంత్య్ర భారత దేశం వచ్చిన తరువాత ఇంత లోటు బడ్జెట్ ఎన్నడూ చూడలేదు. నిరుద్యోగలుకు మరోసారి వెన్ను పోటు పొడిచారు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకుండా నిరుద్యోగులకు ఆర్ధిక సహాయం అనిప్రస్తావించారు. ఎన్నికల హామీలో ఏడాదికి లక్ష ఇళ్లు చొప్పున దు లక్షల గృహాలు నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం గృహ నిర్మాణశాఖకు విడుదల చేసిన బడ్జెట్ పాత ఇళ్ల బిల్లులు చెల్లించేందుకు చాలవు. ఆరోగ్యశ్రీని మంట కలిపేందుకు మరో మారు శ్రీకారం చుట్టారు. వైద్య రంగాన్ని విస్మరించారు. పాత హామీలు విడిచారు. కొత్త పథకాలు ఊసేలేదు. – తమ్మినేని సీతారాం, వైఎస్ఆర్సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు -
అవసరం కొండంత..ఇచ్చింది గోరంత
► జిల్లాపై బాబు శీతకన్ను ► బడ్జెట్లో వెలిగొండకు కేటాయించింది రూ.200 కోట్లే ► ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2,800 కోట్లు అవసరం ► కొరిశపాడు లిఫ్ట్‌కు ఇచ్చింది రూ.7.45 కోట్లు ► పాలేరు రిజర్వాయర్‌కు రూ.3.98 కోట్లు ► రాళ్లపాడుకు రూ.1.28 కోట్లు ► ఊసే లేని రామాయపట్నం పోర్టు, విమానాశ్రయం ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు ఒక్కో హామీని గాలికొదిలేసింది. ఆది నుంచి జిల్లా అభివృద్ధిపై చిన్నచూపు చూస్తోంది. తాజా బడ్జెట్లోనూ మొండిచేయి చూపింది. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలకు అరకొర కేటాయింపులతో సరిపెట్టగా..జిల్లా అభివృద్ధికి కీలకమైన పోర్టు, విమానాశ్రయం, పారిశ్రామికవాడల ఊసే ఎత్తలేదు. సంక్షేమ పథకాల అమలుకూ మొక్కుబడిగా నిధులిచ్చి చేతులు దులుపుకున్నారు. బడ్జెట్లో జిల్లాను చిన్నచూపు చూడటంపై జనం మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాకు 2017–18 బడ్జెట్లో బాబు సర్కారు మొండిచేయి చూపింది. జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామంటూనే సర్కారు వంచనకు పాల్పడింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రూ.2,800 కోట్లు అవసరం కాగా, బుధవారం శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.200 కోట్ల నిధులను మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి దశాబ్దాలు పట్టే పరిస్థితి నెలకొంది. రూ.1,56,980 కోట్ల బడ్జెట్ అంటూ ఘనంగా చెప్పుకున్న బాబు సర్కారు ప్రకాశం జిల్లాను చిన్నచూపు చూసింది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అరకొర నిధులు విదల్చగా ఇక జిల్లాకు ఇచ్చిన ప్రధాన హామీలు రామాయపట్నం పోర్టు, విమానాశ్రయం, మైనింగ్ యూనివర్సిటీ, కనిగిరి నిమ్జ్, దొనకొండ పారిశ్రామికవాడ మొదలుకొని ఏ ఒక్క హామీని బడ్జెట్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. వెలిగొండకు చిల్లర విదిలింపు: తాజా అంచనాల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2,800 కోట్లు అవసరం. కనీసం ఫేజ్–1 పరిధిలోని టన్నెల్–1, హెడ్‌రెగ్యులేటర్ కాలువ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకే వెయ్యి కోట్లు అవసరం. కానీ ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించింది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి ప్రాధాన్యతా క్రమంలో పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించినా... బడ్జెట్ కేటాయింపులకు వచ్చేసరికి మొక్కుబడి నిధులతో సరిపెట్టారు. ఇప్పటికే పాత బకాయిలు రూ.50 కోట్లు ఉన్నాయి. వాటికి పోను కేటాయింపులు చూస్తే కేవలం రూ.150 కోట్లు ఇచ్చినట్లు. జిల్లాలోని కరువును పారదోలటంతో పాటు ఫ్లోరైడ్ నుంచి గట్టెక్కాలంటే వెలిగొండ నీరే శరణ్యం. జిల్లా వాసులకు తాగు, సాగునీరుకు ఈ ప్రాజెక్టే ఏకైక ఆధారం. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాల పరిధిలో 4.40 లక్షల ఎకరాలకు, వందలాది గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించాల్సి ఉంది. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని బాబు సర్కారు హామీ ఇచ్చింది. దాని నిధుల కేటాయింపులు చూస్తే మరో దశాబ్ద కాలానికి కూడా వెలిగొండ పూర్తయ్యే పరిస్థితి కానరావడం లేదు. సాగు నీరు సంగతి దేవుడెరుగు, తాగునీరు కూడా అందదు. మిగిలిన ప్రాజెక్టులకూ అరకొర కేటాయింపులే..: కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.125 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో రూ.7.45 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక పాలేరు రిజర్వాయర్ పరిధిలో రూ.50 కోట్లు అవసరం కాగా రూ.3.98 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. రాళ్లపాడు స్టేజ్–2 పనులకు రూ.1.28 కోట్లు, వీరరాఘవునికోట ప్రాజెక్టుకు రూ.1.8 కోట్లు, కంభం చెరువుకు రూ.28 లక్షలు, పాలేటి బిట్రగుంట పనులకు రూ.45 లక్షలు, ఒంగోలు నగర పరిధిలోని పోతురాజు కాలువ డ్రైనేజీ పనులకు రూ.45 లక్షల చొప్పున కేటాయించారు. ఇక గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి తాజా బడ్జెట్లో రూ.266.73 కోట్లు కేటాయించినట్లు లెక్కల్లో చూపారు. వాస్తవానికి గుండ్లకమ్మ ప్రాజెక్టు వైఎస్ హయాంలోనే 95 శాతం పనులు పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం నిధుల కేటాయింపులు లేవు. పట్టుమని రూ.20 నుంచి రూ.30 కోట్ల నిధులు కేటాయిస్తే పనులు పూర్తయ్యేవి. అయితే చంద్రబాబు సర్కారు వచ్చాక బడ్జెట్ అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లలోపు నిధులు అయితే సరిపోతాయని అధికారులు తాజా అంచనాలు ప్రభుత్వానికి పంపారు. విచిత్రమేమిటంటే బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.266.73 కోట్లు కేటాయించటం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున దోచుకునేందుకే అంచనాలను భారీగా పెంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నాగార్జున సాగర్ కాలువ ఆధునికీకరణ పనులకు రూ.103.56 కోట్లు కేటాయించారు. మొత్తంగా జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు చంద్రబాబు సర్కారు నిధుల కేటాయింపుల్లో మొండిచేయి చూపిందని చెప్పాలి. పోర్టు..పారిశ్రామిక కారిడార్ల ఊసేదీ..: బడ్జెట్లో రామాయపట్నం ఊసే లేదు. దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్, కనిగిరి నిమ్జ్‌లను ఏ మాత్రం పట్టించుకున్నట్లు లేదు. విమానాశ్రయం సంగతి మరిచారు. నిరుద్యోగ భృతికి కేవలం రూ.500 కోట్లను కేటాయించటం చూస్తే బాబు సర్కారు చిత్తశుద్ధి ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చినా మొత్తం బడ్జెట్లో వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించిన పాత బకాయిలే జిల్లా స్థాయిలో రూ.30 కోట్ల వరకు ఉన్నాయి. వాటిని చెల్లించే పరిస్థితి లేదు. ఇక డ్వాక్రా మహిళల పెట్టుబడి నిధి, రైతు రుణమాఫీలకు నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. రైతుల కోసం రూ.5 వేల కోట్లకుపైగా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటామని బాబు సర్కారు గతంలో పలుమార్లు చెప్పినా బడ్జెట్లో మొక్కుబడి కేటాయింపులతో సరిపెట్టారు. ఇక పేదలకు అడిగినన్ని గృహాలు కట్టిస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చినా అవేమీ నెరవేరలేదు. తాజాగా లక్షల గృహాలు నిర్మిస్తామంటూ బాబు సర్కారు ప్రకటించిన ఆ స్థాయిలో నిధుల కేటాయింపుల్లేకపోవడం గమనార్హం. మొత్తంగా 2017–18 బాబు బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి మిగిలింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.