'నరసింహుడు' పుస్తకావిష్కరణ
హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై సమగ్రమైన పుస్తకం రావడానికి 12 ఏళ్లు పట్టిందని 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి అన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత పీవీ నరసింహారావుదేనని పేర్కొన్నారు. బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణా హోటల్ లో గురువారం సాయంత్రం జరిగిన 'నరసింహుడు' పుస్తకావిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామచంద్రమూర్తి మాట్లాడుతూ... పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, విదేశాంగ విధానం, పంజాబ్ లో అశాంతిని అంతం చేసేందుకు ఆయన చేసిన కృషి గురించి ఈ పుస్తకంలో సమగ్రంగా ఉందన్నారు. అణ్వస్త్రాన్ని తయారు చేయడంలో పీవీ పాత్ర గురించి కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారని వెల్లడించారు. పీవీ నరసింహారావుపై వినయ్ సీతాపతి ఇంగ్లీషులో రాసిన 'హాఫ్ ఏ లయన్' పుస్తకాన్ని 'నరసింహుడు' పేరుతో తెలుగులోకి అనువదించారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, పీవీ తనయుడు రాజేశ్వరరావు, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు, హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య తదితరులు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.