అకాల వర్షం బాధితులకు నెలలోగా పరిహారం
పాపన్నపేట(మెదక్): అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలు నష్ట పోయిన రైతులకు నెలలోగా పరిహారం అందజేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. నష్టపోయిన రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యేలా ఎకరా వరికి రూ.5400 చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులంతా ఇప్పటికే పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు. గురువారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానవల్ల నష్టపోయిన పంటలను హరీష్‌రావు పరిశీలించారు.
డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, చింత ప్రభాకర్ తదితరులతో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. గతంలో 50శాతం పంట నష్టం జరిగితేనే ఇన్‌ఫుట్ సబ్సిడీ చెల్లించే వారన్నారు. కాని, సీఎం కేసీఆర్ 33 శాతం పంటనష్టం జరిగినా ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. రైతులకు ఖరీఫ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. న్యాయమైన నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు.