Hand loom
-
చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తాం
– జగనన్న పాలనలో చేనేత కార్మికులకు మూడు సెంట్ల స్థలం – రాయితీతో రేషన్ సరఫరా, కొత్త మగ్గాలు మంజూరు – ఎంపీ బుట్టా రేణుక ఆదోని టౌన్ : వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అవుతారని, జగనన్న పాలనలో చేనేత రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ప్రతి చేనేత కార్మికుడికి మూడు సెంట్ల ఇంటి స్థలం, పక్కా గృహం, రాయితీతో రేషన్, కొత్త మగ్గాలు అందజేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ద్వారకా ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆధ్యర్యంలో ప్రధాన మంత్రి కౌశల్ వికాస యోజన కింద శిక్షణ పొందిన 200 మంది చేనేత కార్మికులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ శిక్షణ ద్వారా మరింత నైపుణ్యం పొందే అవకాశం ఉందన్నారు. పింఛన్లు రాని వారి జాబితాను ఇస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని తెలిపారు. చేనేతలకు వైద్య చికిత్స శిబిరం, ఐడీ కార్డులు మంజూరు చేయిస్తామన్నారు. ఆదోని ఒకటి, కోడుమూరులో 2, ఎమ్మిగనూరులో 3 క్లస్టర్ల ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. క్లస్టర్ ద్వారా చేనేతల అభివృద్ధికి కేంద్రం 1.7 కోట్లు మంజూరు చేస్తుందన్నారు. మగ్గాల నేసేందుకు వర్కుషెడ్లు మంజూరుకు కృషి చేస్తానన్నారు. టెక్స్టైల్, అపెరల్ పార్కు ఏర్పాటుతో చేనేతలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. పెనుగొండలో కేకే ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపింగ్ జిల్లాలోని ముస్లింలు, ఆదోని, మంత్రాలయం, ఆలూరు ఎమ్మెల్యేల సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, గుమ్మనూరు జయరాం వినతిమేరకు ముస్లింల పుణ్యక్షేత్రమైన పెనుగొండలో కేకే ఎక్స్‌ప్రెస్ రైలును స్టాపింగ్ చేయించామని ఎంపీ తెలిపారు. కోడుమూరులో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.56 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్ పోస్టుల భర్తీ, వసతులు కల్పించాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఆదోని రైల్వేస్టేషన్లో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. ఎన్టీసీ మిల్లు పున:ప్రారంభానికి కృషి చేస్తానన్నారు. పెనుకొండలో కేకే ఎక్స్‌ప్రెస్ ఆగేలా చేయడం ముస్లింలకు శుభవార్త అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
చేనేత రంగం వెనుకబాటుపై సత్యాగ్రహం
-
చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్‌కళ్యాణ్
* వారంలో ఒక్క రోజైనా చేనేత దుస్తులు ధరించాలని పిలుపు * చేనేత సత్యాగ్రహ దీక్షకు మద్దతు పలికిన జనసేన అధ్యక్షుడు పెదకాకాని, ఏఎన్‌యూ: ఇక నుంచి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని జనసేన పార్టీ అధ్యక్షుడు కె. పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నేతన్నల కష్టాలు ఇబ్బందులు చిన్నప్పటి నుంచి చూస్తుండటంతో వాటిపై అవగాహన ఉందని చెప్పారు. అందుకే నేతన్నలకు మద్దతు పలికి వారి ఉత్పత్తులకు ప్రచారం కోసం ఇకపై బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని వివరించారు. సోమవారం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న భారీ ప్రాంగణంలో పద్మశాలీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో చేనేత సత్యాగ్రహం నిర్వహించారు. మొత్తం 70 మంది చేనేత సంఘాల నేతలు ఉదయం నుంచి సత్యాగ్రహంలో భాగంగా దీక్షలో కూర్చున్నారు. ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా సాయంత్రం హాజరై నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చేనేత సంఘ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి తెలుగు వారు వారంలో ఒక్క రోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. అనంతరం చేనేతల సమస్యలు ప్రస్తావించి పరిష్కారం కోసం పని చేస్తానని చెప్పారు. పద్మశాలీ సాధికారత సంఘం అధ్యక్షుడు కేఏఎన్ మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేనేత సత్యాగ్రహ దీక్షను అడ్డుకోవటానికి శతవిధాలా ప్రయత్నించి జనాన్ని రాకుండా చేసిందని, లేదంటే ఈ సభకు 3 లక్షల మంది రావాల్సి ఉందని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకొచ్చి రెండున్నరేళ్లు దాటినా చేనేతలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర జనాభాలో 14 శాతం ఉన్న చేనేత కార్మికులు తమ కళతో అందరికన్నా ఎక్కువ నైపుణ్యం కలిగి ఉంటే పాలకుల నిర్లక్ష్యంతో అందిరికన్నా వెనుకబడి ఉన్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక సంపద కొన్ని వర్గాల వారి చేతుల్లోనే కేంద్రీకృతమైందని ఆరోపించారు. చేనేత కార్మికులు ఆకలి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వాలు ముసలి కన్నీరు కారుస్తున్నాయే తప్ప పరిష్కారాలు చూపడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో విషతుల్యమైన రాజకీయ పరిస్థితి ఏర్పడిందని బంద్‌లు, ధర్నాలు, అల్లర్లు చేస్తే తప్ప ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. సీఎం చంద్రబాబు మగ్గంపై కూర్చుని ఫోజులిస్తూ చేనేత కార్మికుల కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే చేనేత కార్మికులకు ఉన్న 100 కోట్ల బకాయిలు రద్దు చేయడం మూడు రోజుల పనేనన్నారు. రుణమాఫీ, చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరితే సీఎం అర్హత, అవసరం ఉన్న వర్గానికి కార్పొరేషన్ ఎందుకని సున్నితంగా మాటదాట వేశారని తెలిపారు. గోదావరి పుష్కరాలకు రూ.1800 కోట్లు, కృష్ణా పుష్కరాలకు రూ.700 కోట్లు, విశాఖ బీచ్ ఫెస్టివల్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు ఎవరి కోసం చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి జగ్గారపు రామమోహన్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కరు కూడా చేనేతకు చెందిన ఎమ్మెల్యే లేరన్నారు. కార్మికుల కష్టాలు, సమస్యలు, ఆకలి చావులు ఈ వేదిక ద్వారా సమాజానికి తెలియజేద్దామని, ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామని పిలుపునిచ్చారు. సభా ప్రాంగణం వద్ద మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ఒక వేదికపై ప్రముఖుల ప్రసంగాలు, జానపద నృత్యాలు, రెండో వేదికపై చేనేత సత్యాగ్రహం, మూడో వేదికపై చేనేతల వృత్తి నైపుణ్యాన్ని తెలియజేస్తున్న చేనేత కార్మికులు. ఈ సందర్భంగా చేనేత కార్మిక నేత ప్రగడ కోటయ్యకు జోహార్లు అర్పించారు. ప్రత్యేక ఆకర్షణగా చేనేత కళలు సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన చరకా తిప్పడం, మగ్గం నేయడం, నేత వస్త్రాల తయారు చేయడం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో పద్మశాలీ సాధికారత సంఘం నాయకులు జగ్గారపు శ్రీనివాసరావు, చిల్లపల్లి మోహనరావు, జగ్గారపు రాము, చిల్లపల్లి శ్రీనివాసరావు, బిట్రా శివన్నారాయణ, దామర్ల రాజు, కొల్లి ఉదయ్, పీ రామకృష్ణ, మోరం విజయలక్ష్మి, యడ్ల గీత, ఎస్ సమ్మారావు, 13 జిల్లాల చేనేత కార్మిక సంఘం నాయకులు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులు తులసీ ధర్మచరణ్, పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అర్బన్ ఎస్పీ భాస్కరరావు నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
దంపతులను మింగిన మగ్గం
ధర్మవరం అర్బన్: చేనేతల బతుకులు పోగుకు వేసే అతుకుల్లా మారుతున్నాయి. ఒక పక్క ఫవర్ లూమ్స్ దెబ్బ, మరో పక్క కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏ మాత్రం పనికిరాని చేతి మగ్గం... భవిష్యత్ ఉంటుందిలే అని చేసిన అప్పులు.. ఇవన్నీ కలసి దంపతుల బలవన్మరణానికి కారణమయ్యాయి. వారి పిల్లలను అనాధలను చేశాయి. వివరాలలోకి వెళితే.. ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నాలుగు మగ్గాలు వేసుకుని భార్యభర్తలు చట్టా రమేష్(35), చట్టా రమాదేవి(34) జీవిస్తుండేవారు. సంవత్సర కాలం నుండి హ్యాండ్లూమ్ ధర పడిపోవడంతో కూలి మగ్గం వేసేందుకు కూడా ఎవరూ రావడం లేదు. దీంతో దంపతులిద్దరూ కలసి మగ్గాలు వేసినా ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగి పోవడంతో సమస్యలు ఎదురయ్యాయి. దీంతో సుమారు నాలుగు లక్షల వరకు బయట అప్పులు చేశారు. కొద్దికాలంగా అప్పుల బాధ మరింత ఎక్కువ కావడంతో... చట్టా రమేష్ ఫిబ్రవరి 1వ తేదీన తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ముందు రోజు రాత్రంతా అప్పులు తీర్చలేనని భార్యతో ఆవేదన వ్యక్తం చేసిన రమేష్.. తెల్లవారుజామున రైలు కింద పడేందుకు వెళుతుండగా... గమనించిన భార్య అపే ప్రయత్నం చేస్తుండగానే.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క ళ్లెదుటే భర్తను పోగొట్టుకున్న రమాదేవి అప్పటి నుండి తీవ్ర మానసికవేదనకు గురైంది. ఈ క్రమంలో 12వ తేదీన భర్త పెద్ద కర్మ నిర్వహించిన ఆమె.. శుక్రవారం రాత్రి 7 గంటలకు పిల్లల్ని బయటకు పంపించి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యభర్తలు ఇద్దరూ చనిపోవడంతో... చిన్నారులు లతీష్, ఇందు అనాధలుగా మారారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.