చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా పవన్‌కళ్యాణ్‌ | Pawan Kalyan became brand ambassidar for handloom brand | Sakshi
Sakshi News home page

చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా పవన్‌కళ్యాణ్‌

Published Mon, Feb 20 2017 10:09 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా పవన్‌కళ్యాణ్‌ - Sakshi

చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా పవన్‌కళ్యాణ్‌

* వారంలో ఒక్క రోజైనా చేనేత దుస్తులు ధరించాలని పిలుపు
* చేనేత సత్యాగ్రహ దీక్షకు మద్దతు పలికిన జనసేన అధ్యక్షుడు 
 
పెదకాకాని, ఏఎన్‌యూ: ఇక నుంచి చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటానని జనసేన పార్టీ అధ్యక్షుడు కె. పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. నేతన్నల కష్టాలు ఇబ్బందులు చిన్నప్పటి నుంచి చూస్తుండటంతో వాటిపై అవగాహన ఉందని చెప్పారు. అందుకే నేతన్నలకు మద్దతు పలికి వారి ఉత్పత్తులకు ప్రచారం కోసం ఇకపై బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటానని వివరించారు. సోమవారం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న భారీ ప్రాంగణంలో పద్మశాలీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో చేనేత సత్యాగ్రహం నిర్వహించారు. మొత్తం 70 మంది చేనేత సంఘాల నేతలు ఉదయం నుంచి సత్యాగ్రహంలో భాగంగా దీక్షలో కూర్చున్నారు. ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యఅతిథిగా సాయంత్రం హాజరై నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చేనేత సంఘ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి తెలుగు వారు వారంలో ఒక్క రోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. అనంతరం చేనేతల సమస్యలు ప్రస్తావించి పరిష్కారం కోసం పని చేస్తానని చెప్పారు. పద్మశాలీ సాధికారత సంఘం అధ్యక్షుడు కేఏఎన్‌ మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేనేత సత్యాగ్రహ దీక్షను అడ్డుకోవటానికి శతవిధాలా ప్రయత్నించి జనాన్ని రాకుండా చేసిందని, లేదంటే ఈ సభకు 3 లక్షల మంది రావాల్సి ఉందని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకొచ్చి రెండున్నరేళ్లు దాటినా చేనేతలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర జనాభాలో 14 శాతం ఉన్న చేనేత కార్మికులు తమ కళతో అందరికన్నా ఎక్కువ నైపుణ్యం కలిగి ఉంటే పాలకుల నిర్లక్ష్యంతో అందిరికన్నా వెనుకబడి ఉన్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక సంపద కొన్ని వర్గాల వారి చేతుల్లోనే కేంద్రీకృతమైందని ఆరోపించారు. చేనేత కార్మికులు ఆకలి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వాలు ముసలి కన్నీరు కారుస్తున్నాయే తప్ప పరిష్కారాలు చూపడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో విషతుల్యమైన రాజకీయ పరిస్థితి ఏర్పడిందని బంద్‌లు, ధర్నాలు, అల్లర్లు చేస్తే తప్ప ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. సీఎం చంద్రబాబు మగ్గంపై కూర్చుని ఫోజులిస్తూ చేనేత కార్మికుల కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే చేనేత కార్మికులకు ఉన్న 100 కోట్ల బకాయిలు రద్దు చేయడం మూడు రోజుల పనేనన్నారు. రుణమాఫీ, చేనేత కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరితే సీఎం అర్హత, అవసరం ఉన్న వర్గానికి కార్పొరేషన్‌ ఎందుకని సున్నితంగా మాటదాట వేశారని తెలిపారు. గోదావరి పుష్కరాలకు రూ.1800 కోట్లు, కృష్ణా పుష్కరాలకు రూ.700 కోట్లు, విశాఖ బీచ్‌ ఫెస్టివల్‌ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు ఎవరి కోసం చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
 
సంఘ రాష్ట్ర కార్యదర్శి జగ్గారపు రామమోహన్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కరు కూడా చేనేతకు చెందిన ఎమ్మెల్యే లేరన్నారు. కార్మికుల కష్టాలు, సమస్యలు, ఆకలి చావులు ఈ వేదిక ద్వారా సమాజానికి తెలియజేద్దామని, ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామని పిలుపునిచ్చారు. సభా ప్రాంగణం వద్ద మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ఒక వేదికపై ప్రముఖుల ప్రసంగాలు, జానపద నృత్యాలు, రెండో వేదికపై చేనేత సత్యాగ్రహం, మూడో వేదికపై చేనేతల వృత్తి నైపుణ్యాన్ని తెలియజేస్తున్న చేనేత కార్మికులు. ఈ సందర్భంగా చేనేత కార్మిక నేత ప్రగడ కోటయ్యకు జోహార్లు అర్పించారు.
 
ప్రత్యేక ఆకర్షణగా చేనేత కళలు 
సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన చరకా తిప్పడం, మగ్గం నేయడం, నేత వస్త్రాల తయారు చేయడం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో పద్మశాలీ సాధికారత సంఘం నాయకులు జగ్గారపు శ్రీనివాసరావు, చిల్లపల్లి మోహనరావు, జగ్గారపు రాము, చిల్లపల్లి శ్రీనివాసరావు, బిట్రా శివన్నారాయణ, దామర్ల రాజు, కొల్లి ఉదయ్, పీ రామకృష్ణ, మోరం విజయలక్ష్మి, యడ్ల గీత, ఎస్‌ సమ్మారావు, 13 జిల్లాల చేనేత కార్మిక సంఘం నాయకులు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులు తులసీ ధర్మచరణ్, పవన్‌ కళ్యాణ్‌ పర్యటన నేపథ్యంలో అర్బన్‌ ఎస్పీ భాస్కరరావు నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement