గోళ్ల గురించి గోరంత....
ట్రివియా
⇒ మన చేతి గోళ్లు నెల్లాళ్లలో సగటున 3.5 మిల్లీమీటర్ల మేరకు పెరుగుతాయి. చేతి గోళ్లతో పోలిస్తే కాలి గోళ్లు నెమ్మదిగా పెరుగుతాయి. కాలి గోళ్లు నెల్లాళ్లలో 1.6 మిల్లీమీటర్ల మేరకు మాత్రమే పెరుగుతాయి. శీతాకాలంలో కంటే వేసవిలో గోళ్లు కాస్త వేగంగా పెరుగుతాయి.
⇒ మహిళల కంటే పురుషుల గోళ్లు కాస్త వేగంగా పెరుగుతాయి. అయితే, గర్భం దాల్చినప్పుడు మహిళల్లో గోళ్ల పెరుగుదల వేగం పుంజుకుంటుంది.
⇒ గోళ్లు పెరిగే క్రమంలో వాటిపై అప్పుడప్పుడు తెల్లని మచ్చలు కనిపిస్తుంటాయి.
⇒ గోళ్లపై తెల్లమచ్చలు క్యాల్షియం లోపానికి సంకేతంగా చాలా మంది చెబుతారు. అయితే అది అపోహ మాత్రమే. గోళ్లపై తెల్లమచ్చల వల్ల ఎలాంటి హాని ఉండదు.
⇒ వెంట్రుకలు, గోళ్లు కెరాటిన్ అనే ఒకే రకమైన పదార్థం వల్ల పెరుగుతాయి. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల జుట్టు, గోళ్లు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.
⇒ చాలామందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. ఆందోళన కారణంగా చాలామంది అసంకల్పితంగానే గోళ్లు కొరుకుతారు. పది నుంచి పద్దెనిదేళ్ల వయసు గల వారిలో దాదాపు సగం మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది.
⇒ గోళ్లను నిశితంగా పరిశీలిస్తే ఆరోగ్య లోపాలను ఇట్టే తెలుసుకోవచ్చు. గోళ్లు కాస్త నీలిరంగులోకి మారితే శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నట్లు లెక్క. తెల్లగా పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత ఉన్నట్లు. గోళ్లు సహజమైన రంగు కోల్పోయినా, గోళ్లపై గోధుమ రంగు మచ్చలు కనిపించినా, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చర్మవ్యాధుల నిపుణుడిని సంప్రదించడం మంచిది.
⇒ చర్మవ్యాధుల్లో దాదాపు పదిశాతం గోళ్లకు సంబంధించినవే ఉంటాయి. పిల్లలు, యువకుల కంటే వయసు మళ్లిన వారిలోనే గోళ్లకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి.