కృష్ణా పుష్కరాలు
జ్యోతిష శాస్త్రం ప్రకారం పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవగురువు బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం చొప్పున సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఏ రాశిలో సంచరిస్తాడో, అప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి. అంటే బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరీ పుష్కరాలు, కన్యారాశిలోకి అడుగుపెట్టినప్పుడు కృష్ణానదికి, మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్రానదికీ పుష్కరాలు వస్తాయి. ఈ పవిత్ర పుష్కర సమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకూ, పితృపిండ ప్రదానానికీ అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. పుష్కర కాలంలో చేసే ఆయా కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి. బంగారం, వెండి, భూమి, ధనం, గోవులు, ధాన్యం, లవణం, రత్నాలు, అశ్వం, పండ్లు, బెల్లం, వస్త్రాలు, తైలం, కూరగాయలు, తేనె, పీట, అన్నం, పుస్తకం ... ఇలా ఎవరి శక్తిని బట్టి వారు రోజుకు కొన్ని చొప్పున దానం చెయ్యడం వల్ల ఇహలోకంలో సుఖసంపదలు పొందడంతోపాటు అంత్యమున ముక్తి కలుగుతుందని రుషి ప్రమాణం.
ఈ పన్నెండు రోజులు నదీస్నానాలు, దానధర్మాలు, పిండప్రదానాలు పుణ్యఫలాన్నిస్తాయి. కృష్ణానదికి 2016 ఆగస్టు 12 నుంచి పుష్కరాలు ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ కాలంలో కృష్ణలో స్నానాదులు, పూజలు, దానధ ర్మాలు, పితృదేవతలకు పిండప్రదానాలు చేస్తే పుణ్యఫలం కలుగుతుంది. పుష్కరాలలో నదీ స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాలపాటు ఆ నదులలో నిత్యం స్నానం చేసినంత పుణ్య ఫలం లభిస్తుంది. జన్మజన్మల పాపాలూ నశించి, మోక్షప్రాప్తి కలుగుతుంది. ఏ నదికి పుష్కరాలు వస్తాయో ఆ నదిపేరును మనం స్నానం చేసేటప్పుడు ముమ్మారు మనస్సులో తలచుకున్నా కొంతమేర పుష్కర స్నానఫలితం పొందచ్చునని శాస్త్రవచనం. కృష్ణానది శ్రీమహావిష్ణువు శరీరం. శివుని అష్టమూర్తులలో ఒకటైన జలస్వరూపం. శివకేశవ స్వరూపం. మహాపాపాలను పోగొడుతుంది.
కృష్ణానదీ విశేషం
కృష్ణానది దక్షిణ భారతదేశంలోని ముఖ్యనదులలో ఒకటి. మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతశ్రేణిలో మహాబలేశ్వరం వద్ద ఉద్భవించింది. మహాబలేశ్వర లింగం పైనుండి ప్రవహించి పెద్ద నదిగా మారింది. తుంగభద్ర, మూసీ, దిండి, పాలేరు, మున్నేరు ఉపనదులు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లోని హంసలదీవి మీదుగా ఏటిమొగ, ఎదురుమొండి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
కృష్ణానదీ తీర క్షేత్రాలు
శ్రీశైలం: ఇక్కడ కృష్ణానది ఉత్తర వాహిని. ఇక్కడి స్వామివారు మల్లికార్జునుడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అమ్మవారు భ్రమరాంబ. శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. శ్రీశైలం పురాణ ప్రసిద్ధమైన శైవ క్షేత్రం.అమరారామం: దేవ రాజయిన అమరేశ్వరుడు ప్రతిష్ఠించడంచేత ఇక్కడి స్వామిని అమరేశ్వరస్వామి అని అంటారు. ఇక్కడి దేవికి బాల చాముండిక అనీ, రాజ్యలక్ష్మీదేవి అనీ పేర్లు. ఇది శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడి స్వామిని క్రౌంచనాథుడంటారు. అలంపురం: అమ్మవారు జోగులాంబ. స్వామి బాలబ్రహ్మేశ్వర స్వామి. అలంపురం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. కృష్ణా, తుంగభద్రా నదుల సంగమ స్థానం. తుంగానది ‘బ్రహ్మ’ స్వరూపమని, భద్రానది ‘శివ’ స్వరూపమని, కృష్ణానదిని ‘విష్ణు’ స్వరూపమని చెబుతారు వేదాద్రి: కృష్ణా తీరంలోని ఆలయం. యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఇక్కడి దైవం. జ్వాలానరసింహ, సాలగ్రామ నరసింహ, యోగానంద నరసింహ, వీర నరసింహ, చెంచులక్ష్మీ నరసింహులను పూజిస్తే, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయని ప్రతీతి. వాడపల్లి: నృసింహస్వామి. మూసీ, కృష్ణానదుల సంగమస్థానం. ఇక్కడ స్వామి వారు ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉన్నట్లుగా వారికెదురుగా ఉండే దీపం కదులుతుంటుంది. ఇక్కడున్న అగస్త్యేశ్వరస్వామి లింగరూపం నుంచి నీరు ఊరుతూ ఉంటుంది.
చిలుమూరు - ఐలూరు: సీతారాములు అయోధ్యకు వెళ్తూ శివుని ప్రతిష్ఠింపదలచారు. శివలింగాన్ని తీసుకురావడం కోసం హనుమంతుని కాశీనగరానికి పంపారు. ముహూర్త సమయానికి హనుమంతుడు రాలేక పోవడంతో - సీతాదేవి ప్రతిష్ఠించిన శివలింగం. గంగాపార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి సైకత (ఇసుక) లింగం, చిలుమూరు. హనుమంతుడు ముహూర్తం దాటిన తరువాత కాశీ నుండి శివలింగాన్ని తెచ్చాడు. అప్పటికే లింగప్రతిష్ఠ జరగడంతో బాధపడిన హనుమంతుడు దానిని నది ఆవలి ఒడ్డుకు వేయగా ఆ లింగం స్వయంగా ప్రతిష్ఠితమైంది. ఆ లింగమే రామలింగేశ్వరస్వామి - ఐలూరు. ఈ రెండు శివలింగాలూ పశ్చిమాభిముఖాలే. హనుమంతుడు ప్రతిష్ఠించిన స్వామివారి ఆలయానికి పక్కగా రఘునాయక ఆలయం ఉంది. చిలుమూరు గుంటూరు జిల్లాలో, ఐలూరు కృష్ణాజిల్లాలో ఉన్నాయి.
శ్రీకాకుళం: ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళేశ్వరుడు. అమ్మవారు రాజ్యలక్ష్మీదేవి. స్వామికి వెనుకగా దశావతారాలు చెక్కిన శిల్పం ఉన్నది. ఆలయ గోపురం మిక్కిలి పెద్దది. ఇచటి స్వామివారికి 108 సాలగ్రామ శిలాహారముంది. ఏకరాత్ర మల్లికార్జునస్వామి: కృష్ణా తీరం. అమ్మవారు బాలాత్రిపుర సుందరి. ఆంధ్ర మహావిష్ణువు ఆలయం పక్కన ఉంది. కృష్ణకు ఉత్తర తీరాన ప్రతిష్ఠితం. కృతయుగం కన్నా ముందే నిర్మింపబడిందని విశ్వాసం. స్వర్ణమయ దేవాలయం. వరదలు వచ్చినా శిథిలం కాని ఆలయం. ఇక్కడున్న మర్రిచెట్టు ప్రాచీనమైనది.
విజయవాడ: కృష్ణాతీరంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ కొలువైన ఆలయం ఉంది. స్వామి పేరు మల్లేశ్వరస్వామి. అర్జునుడిక్కడ ప్రతిష్ఠించిన శివలింగం విజయేశ్వరస్వామి. హంసలదీవి: ఇక్కడి దేవుడు వేణుగోపాలస్వామి. కృష్ణాసాగర సంగమ స్థానం. అతి ప్రాచీనమైన ఆలయం మంగళగిరి: రాజ్యలక్ష్మీ నరసింహస్వామి. ధర్మరాజు ప్రతిష్ఠించాడు. గోపురం మిక్కిలి ఎత్తయినది. కొండపై పానకాల నరసింహస్వామివారి మూర్తి ఉంది. ఈ స్వామి మూర్తి నైఋతీ ముఖంగా ఉంటుంది. తోట్లవల్లూరు: మల్లికార్జునస్వామి, భ్రమరాంబ. నర్సోబావాడి: శ్రీదత్తాత్రేయస్వామి. కోరిన కోరికలు తీరతాయని నమ్మిక. కృష్ణా పంచగంగా సంగమం. మహారాష్ర్టలో ఉంది. మాహులీ: సంగమేశ్వరస్వామి. కృష్ణా-వేణీ నదీ సంగమం.
కోల్ నృసింహ: షోడశ భుజ నృసింహ. కృష్ణా, కోయినా నదీ సంగమం కృష్ణానదిలో కలిసే చోటు. దీనిని పంచనదీ సంగమ క్షేత్రమని అంటారు. మహాబలేశ్వర్: ఇది పంచనదీ జన్మస్థానం. అతిబల, మహాబల, రాక్షసుల సంహారం ఇక్కడే జరిగింది.పుష్కరాలు జరిగే స్థలాలు: కృష్ణానదీ పరివాహక ప్రాంతాలైన విజయవాడ, అలంపురం, వాడపల్లి, మట్టపల్లి తదితర ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి.