handloom park
-
నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా...
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చేనేత రంగంలోని 40 వేల కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఒడిశాకు చెందిన అధికారుల బృందం రాష్ట్రం లోని చేనేత సంక్షేమ పథకాలను ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత, జౌళి శాఖల అధికారులు, కలెక్టర్లు, చేనేత కార్మికులతో శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ‘నేతన్నకు చేయూత’ పథకం కింద కరోనా సమయంలో రూ.93 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రూ.10.24 కోట్లతో పోచంపల్లి, ఆలేరు, కనుకుల, శాయంపేట, కమలాపూర్, ఆర్మూర్, వెల్టూర్, వేములవాడలో బ్లాక్ లెవల్ క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోచంపల్లి హ్యాం డ్లూమ్ పార్కు అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించామని, గద్వాల చేనేత పార్కుకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. నేతన్నకు చేయూత కొనసాగింపు.. నేతన్నకు చేయూత పథకాన్ని కొనసాగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నారాయణపేటలో చేనేత కళాకారుల కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ) నిర్మించేందుకు ఇప్పటికే స్థలం కేటాయించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఈ స్థలంలో సీఎఫ్‌సీతో పాటు సర్వీస్ సెంటర్ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర చేనేత అవార్డు గ్రహీతలకు ఇస్తున్న నగదు పురస్కారాన్ని రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన 18 మంది కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారాలు అందజేశారు. వీరిలో ఇద్దరికి కేటీఆర్ చేతుల మీదుగా ఇవ్వగా, మరో 16 మందికి ఆయా జిల్లాల కలెక్టర్లు అందజేశారు. వర్చువల్ విధానంలో కేటీఆర్‌తో అవార్డు గ్రహీతలతో సంభాషించి ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత పథకాలపై అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ‘ఆలంబన’ ఆవిష్కరణ చేనేత జౌళి శాఖ రూపొందించిన ‘ఆలంబన యాప్’ను కేటీఆర్ ఆవిష్కరించారు. వర్చువల్ సమావేశంలో యూఎన్డీపీ డిప్యూటీ రెసిడెంట్ నదియా రషీద్, ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, చేనేత జౌళి శాఖ సంచాలకులు శైలజా రామయ్యర్ పాల్గొన్నారు. -
గణపయ్యలకు చేనేత కండువాలు
► ఖైరతాబాద్ గణేశ్‌కు 25 మీటర్ల పొడవు ► బాలాపూర్ వినాయకుడికి 12.25 మీటర్లు భూదాన్ పోచంపల్లి: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, బాలాపూర్‌లో ప్రతిష్ఠించే మహాగణపతి మెడలో వేసే కండువాలను భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని హ్యాండ్లూమ్ పార్కులో తయారు చేసి చేనేత కార్మికులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. రెండేళ్లుగా హ్యాండ్లూమ్ పార్కు పాలకవర్గం ఖైరతాబాద్ మహా గణ పతికి కండువాను తయారు చేసి బహూ కరిస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే పరంపరను కొనసాగిస్తూ 25 మీటర్ల భారీ కండువాను తయారు చేస్తున్నారు. ఎరుపు రంగు గల కండువాలో ఓం గణేశాయ నమః, ఓంకారం, శివలింగం, త్రిశూలం, తామరపువ్వు, లడ్డూలు, స్వస్తిక్ గుర్తు, పూర్ణకుంభంతోపాటు పోచంపల్లి హ్యాం డ్లూమ్ పార్కును ఆంగ్లంలో షార్ట్‌కట్ రూపంలో పీహెచ్‌పీ వచ్చే విధంగా ఇరువైపులా జరీతో గులాబీ రంగులో తయారు చేస్తున్నారు. బాలాపూర్ గణేశుడికి కూడా మొదటిసారిగా 12.50 మీటర్ల పొడవున్న పసుపు వర్ణంలో కండువాను తయారు చేశారు. 15 రోజులు శ్రమించి.. కండువాను తయారు చేసే ముందు పార్కు పాలకవర్గం ప్రత్యేక పూజలు నిర్వహి స్తుంది. కార్మికుడు, డిజైనర్ కండువా పని పూర్తయ్యే వరకు ఎంతో నియమ, నిష్టలతో ఉంటారు. మొత్తం 10 మంది చేనేత కళాకారులు 15 రోజులు శ్రమించి కండు వాను తయారు చేశారు. వినాయక చవితి రోజున స్థానిక మార్కండేశ్వరస్వామి దేవాలయంలో కండువాను ఉంచి ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఖైరతాబాద్‌లోని గణపతికి బహూకరిస్తారు. కాగా, వినా యకుడికి కండువా బహూకరి స్తున్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని హ్యాండ్లూమ్ పార్కు చైర్మన్ కడవేరు దేవేందర్ చెప్పారు. -
హ్యాండ్లూమ్ పార్క్ పరిశీలన
భూదాన్‌పోచంపల్లి: చేనేత రంగానికి పూర్వౖవైభవం తీసుకరావడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తుందని కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రష్మివర్మ తెలిపారు. మంగళవారం మండలంలోని కనుముకుల పరిధిలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్‌లో తయారవుతున్న చేనేత వస్త్రాలు, కార్మికులకు లభిస్తున్న కూలీ, మార్కెటింగ్, నిర్వహణను పరిశీలించారు. హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణ కోసం నిధులు కావాలని కేంద్రానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో పార్క్ పాలకవర్గంతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పార్క్‌లో తయారవుతున్న వస్త్రాల టర్నోవర్, పనిచేస్తున్న కార్మికులు, దేశ, విదేశాలకు అవుతున్న ఎగుమతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ చేనేత పథకాల అమలు తీరును పరిశీలించడానికి వచ్చామని తెలిపారు. ఇందులో భాగంగానే హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శించినట్లు తెలిపారు. ఆమె వెంట హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషనర్ అలోక్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డైరెక్టర్ ప్రీతిమీనా, జాయింట్ డైరెక్టర్ రాంగోపాల్‌రావు, ఎన్‌హెచ్‌డీసీ డైరెక్టర్ బంధోపాధ్యాయ, హైదరాబాద్ వీవర్స్ సర్వీస్‌సెంటర్ ఏడీ హిమజకుమార్, టి. సత్యనారాయణరెడ్డి, పార్క్ చైర్మన్ కడవేరు దేవేందర్, డైరెక్టర్లు చిక్క కృష్ణ, భారత లవకుమార్, సీత దామోదర్, చిట్టిపోలు గోవర్దన్, భారత పురుషోత్తం పాల్గొన్నారు.