చేనేత వృత్తిని కాపాడాలి
నల్లగొండ రూరల్ : దేశంలో వ్యవసాయరంగం తర్వాత రెండవ స్థానంలో ఉన్న అతిపెద్ద చేనేత రంగాన్ని కాపాడి ఆత్మహత్యలను నివారించాలని పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల యాదగిరి, పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నల్లగొండలోని రాంనగర్లో గాంధీ విగ్రహానికి చేనేత నూలు మాలను వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆత్మహత్యలు, వలసల నివారణ కోసం చేనేత కార్మికులకు వడ్డీలేని రుణం, రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. నగదు రహిత వైద్యాన్ని కార్పొరేట్ ఆస్పత్రిలో చేయించాలని, కేజీ టూ పీజీ విద్యను వర్తింపజేయాలని, కళ్యాణలక్ష్మీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పదవుల్లో జనాభా ప్రాతిపదికన చేనేతకు స్థానం కల్పించాలన్నారు. నేతన్న సలాం పేరుతో గంజీ శ్రీనివాస్ రూపొందించిన సీడీని ఆవిష్కరించారు. అంతకుముందు హ్యాండ్లూమ్ వాక్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నేత, శ్రీశైలం, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుడు సుధీర్ నారాయణ, వెంకన్న, సురేష్, వెంకటయ్య, గిరీష్, నీలయ్య, యాదగిరి, అంజయ్య, శ్రీనివాస్, పున్న వీరేశం తదితరులు పాల్గొన్నారు.