handri
-
రైతు మెడపై వాల్టా కత్తి
- హంద్రీనదిలో వేసిన బోర్లపై సర్వే - ప్రభుత్వ కక్షపూరిత చర్య? - ఇసుక అక్రమాలపై కోర్టు ఆశ్రయించడమే రైతులు చేసిన తప్పు - ఏడు మండలాల్లో బోర్లకు పొంచి ఉన్న ముప్పు కోడుమూరు: టీడీపీ నాయకుల ఇసుక అక్రమాలపై కొందరు రైతులు కోర్టును ఆశ్రయించడం తప్పయింది. తమ పార్టీ వారిని ఇరుకున పెట్టారనో..ప్రభుత్వానికి అపవాదు మూటగట్టారనో..హంద్రీ నదిలో బోర్లను సర్వే చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యే అని కొందరు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇవీ.. తెలుగుదేశం నాయకులు, వారి అనుచరులు.. హంద్రీనదిలో 20 నుంచి 30 అడుగుల లోతు గోతులు తీసి ఇసుకను తరలించుకుపోయారు. ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో కృష్ణగిరి మండలంలోని మన్నెకుంట, ఎర్రగుడి, కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామాల రైతులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీని బాధ్యులుగా చేసి హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తుందన్న అపవాదు మూటగట్టుకుంది. దీంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసి రైతులపై కక్ష కట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోనెగండ్ల, కృష్ణగిరి, దేవనకొండ, కోడుమూరు, వెల్దుర్తి, కల్లూరు, కర్నూలు మండలాల పరిధిలోని 29 గ్రామాల సరిహద్దుల్లో గాజులదిన్నె ప్రాజెక్టు హంద్రీనది ప్రవహిస్తోంది. ఏడు మండలాల పరిధిలో ప్రవహిస్తున్న హంద్రీనదిలో రైతులు దాదాపు 2500 మంది రైతులు బోర్లు వేసుకుని దాదాపు 13 వేల ఎకరాల్లో రైతులు పంటను సాగుచేస్తున్నారు. 90 శాతం మంది రైతులు హంద్రీనదిలో బోర్లు వేసుకున్నారు. దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు పైప్లైన్లు వేసి హంద్రీనది బోర్ల ద్వారాపంటలు పండించుకుంటున్నారు. అయితే హంద్రీనది మొత్తం ప్రభుత్వ భూమిగా చూపించి వేసిన బోర్లన్నింటిని తొలగించాలని కుట్ర జరుగుతున్నట్లు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిగా ఉన్న హంద్రీనదిలో ఎంతమంది రైతులు అనుమతి తీసుకుని బోర్లు వేశారు..అనధికారికంగా ఎంతమంది విద్యుత్ కనెక్షన్లు వేసుకున్నారు అనే సమాచారాన్ని వీఆర్వోలు హంద్రీనదిలో తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. వాల్టా చట్టాన్ని అమలు చేసి హంద్రీనది అయిన ప్రభుత్వ భూముల్లో వేసిన బోర్లను తొలగించేందుకు సర్వే చేస్తున్నారని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై కోర్టుకు వెళ్లినందుకే రైతులపై కక్ష తీర్చుకునేందుకు అడ్డదారుల్లో అణచివేసేందుకు కుట్ర పన్నుతున్నారని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కృష్ణ ఆరోపించారు. హంద్రీ నీళ్లే ఆధారం : శ్రీరాములు, రైతు నాకున్న 5 ఎకరాల పొలాన్ని సాగుచేసుకునేందుకు హంద్రీనదిలో బోరు వేసుకున్నా. 8 ఏళ్ల నుంచి ఈ హంద్రీ నీళ్లతోనే పంటలు పండించుకుంటున్నా. వర్షాకాలం వరిపంట, ఎండాకాలం కూరగాయలు సాగుచేసుకుంటున్నాం. హంద్రీనది నీళ్లు లేకుంటే మా పొలాలు వర్షాధారంపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సర్వే చేశాం : నిత్యానందరాజు, తహసీల్దార్ హంద్రీనదిలోని ప్రభుత్వ భూమిలో ఎంతమంది రైతులు బోర్లు వేసుకున్నారన్న విషయాలపై వీఆర్వోలు సర్వే చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ సర్వే జరుగుతోంది. -
ఇసుక డంప్ స్వాధీనం
- ఆరుగురిపై కేసు నమోదు కృష్ణగిరి: ఎస్‌హెచ్‌ఎర్రగుడి గ్రామ సమీపంలో అక్రమ ఇసుక డంప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సోమ్లానాయక్ తెలిపారు. గ్రామానికి చెందిన హరిజన సుదర్శన్, శేఖర్, వెంకటేశ్వర్లు, లక్ష్మన్న, సుధాకర్, మద్దిలేటి .. గ్రామ సమీపంలోని హంద్రీ నది నుంచి ఇసుకను ట్రాక్టర్లతో అక్రమంగా తరలించి డంప్ చేసినట్లు జిల్లా మైనింగ్ ఏడీ వెంకటరెడ్డి గుర్తించారని, ఆయన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
నలుగురి రైతులపై కేసు నమోదు
కృష్ణగిరి: హంద్రీ ఇసుకాసురులకు అక్రమంగా సహకరించారనే కారణంతో నలుగురు రైతులపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సోమ్లానాయక్ తెలిపారు. కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి చెందిన బిడుగాళ్ల శివుడు, మండల పరిధిలోని ఎస్‌హెచ్ ఎర్రగుడి సర్పంచ్ సురేంద్రనాథరెడ్డి, మాజీ వీఆర్వో కుమారుడు సుధీర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు అనే రైతులు తమ పొలాల నుంచి హంద్రీలోకి ట్రాక్టర్లు వెళ్లడానికి దారులు ఇచ్చి సహకరించారని రెవెన్యూ అధికారుల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇసుక అక్రమ రవాణాపై విచారణ
కోడుమూరు రూరల్ : కోడుమూరు మండలం గోరంట్ల హంద్రీనది నుంచి ఇసుక తరలింపుపై బుధవారం మైనింగ్ అధికారుల బృందం గ్రామంలో విచారణ చేపట్టారు. గోరంట్ల హంద్రీనది పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను తరలించరాదని గ్రామ పంచాయతీ తీర్మానం చేసినా అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారని, పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ గోరంట్ల, ఎర్రగుడి గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం మైనింగ్ ఏడీ వెంకటరెడ్డి ఆధ్వర్యాన అధికారుల బృందం గోరంట్లలో పర్యటించి హంద్రీనదిలోని ఇసుకను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో చర్చించి వివరాలను సేకరించారు. అంతకుముందు అధికారుల బృందం కోడుమూరు తహసీల్దార్ కార్యాలయం చేరుకుని ఏఎస్ఓతో గ్రామ వివరాలను సేకరించారు. బృందం వెంట కోడుమూరు ఆర్ఐ మధుమతి, వీఆర్వో రామకృష్ణ ఉన్నారు. -
ఆరుతడి పంటలకే నీరు!
– జీడీపీ కింద రబీలో 24,372 ఎకరాల ఆయకట్టు – ప్రాజెక్టులో 1.8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ - 6, 500 ఎకరాలకే సాగు నీరు! – విడుదలకు అనుమతులు ఇచ్చిన కలెక్టర్ కర్నూలు సిటీ: హంద్రీ నదిపై నిర్మించిన గాజులదిన్నె మధ్య తరహా ప్రాజెక్టు కింద ఆరు తడి పంటలకు మాత్రమే సాగు నీరు ఇవ్వనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ శనివారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అనుమతులు ఇచ్చారు. అయితే, 6500 ఎకరాలకు మాత్రమే ఆనీరు అందనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు కింద కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ, కృష్ణగిరి మండలాలకు చెందిన 24,372 ఎకరాల ఆయకట్టు, 21 గ్రామాలకు తాగు నీరు అందించాలని లక్ష్యం. ఈ ప్రాజెక్టు కింద ఖరీఫ్‌లో ఆయకట్టు లేదు. జీడీపీకి ఈ ఏడాది గతంలో ఎప్పుడు కూడా లేనంతా నీరు వచ్చి చేరింది. అయితే, తుంగభద్ర దిగువ కాలువ నీరు చివరి ఆయకట్టుకు రాకపోవడం, వర్షాలు సకాలంలో కురవక పోవడంతో ఎండుతున్న ఖరీఫ్ పంటలకు నీరు ఇచ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన ఇంజినీర్లు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని డిస్ట్రిబ్యూటరీలకు నీరు ఇచ్చారు. అయితే, జీడీపీ కింద రబీ ఆయకట్టు 24,372 ఎకరాలకు నీరు వస్తుందనే అశతో రైతులు పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పుడు 6500 ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చేందుకు కలెక్టర్ అనుమతులు ఇవ్వడంతో వారికి దిక్కుతోచడం లేదు. పట్టనట్టు వ్యవహరిస్తున్న నేతలు, అధికారులు ఖరీఫ్ పంటలు కాపాడామని చెప్పుకుంటున్న నేతలు, అధికారులు హంద్రీనీవా ద్వారా ఎక్కువ నీటిని తీసుకువచ్చి రబీలో సైతం ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే, ఆ దిశగా వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం పందికొన నుంచి హంద్రీనీవా నీరు జీడీపీకి రోజుకు 200 క్యుసెక్కుల చొప్పున వదులుతున్నారు. కానీ ప్రాజెక్టులోకి గత నెల 3 నుంచి 379 ఎంసీఎఫ్‌టీ నీరు మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నీటి విడుదలను 500 క్యుసెక్కులకు పెంచడానికి అవకాశం ఉన్నా అధికారులు ఆ వైపు దృష్టి పెట్టడం లేదు. 24,372 ఎకరాల ఆయకట్టుకు 2.5 టీఎంసీల నీరు అయితే సరిపోతుంది. ప్రస్తుతం ఉన్న 1.8 టీఎంసీల నీటికి హంద్రీనీవా నీటి విడుదలను పెంచితే పంటలకు పూర్తిసాయిలో నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంది. మనకేందుకులే అనే ధోరణిలో అధికారులు ఉండడంతో స్థిరీకరించిన ఆయకట్టులో 25 శాతానికి మాత్రమే నీరు అందనుంది. ఇచ్చే నీటిలో అధిక శాతం డిప్యూటీ సీఎం సొంత మండలమైన కృçష్ణగిరి మండలానికి వెళ్లే కుడి కాలువ కింద ఆయకట్టే అధికంగా ఉంది. ఎడమ కాలువ కింద పత్తికి ఒక తడి నీరు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిసింది. కుడి కాలువకు ఇప్పటికే నీటిని విడుదల చేయగా ఎడమ కాలువకు నేడు విడుదల చేయనున్నారు. 6,500 ఎకరాలకే సాగునీరు – లక్ష్మన్‌కుమార్, జీడీపీ డీఈఈ జీడీపీ నుంచి రబీకి నీరు విడుదల చేసేందుకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. 6500 ఎకరాలకు మాత్రమే నీరు ఇస్తాం. మిగతా ఆయకట్టుకు ఇప్పటికే ఖరీఫ్‌లో నీరు ఇచ్చాం. ఇవ్వని ఆయకట్టుకు మాత్రమే నీరు ఇవ్వనున్నాం. కుడి కాలువకు నీరు విడుదల చేశాం. -
హంద్రీ నుంచి శ్రీశైలానికి వరద
శ్రీశైలం ప్రాజెక్టు: గత రెండు రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో హంద్రీ నుంచి శ్రీశైలానికి 700 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. అలాగే జూరాల ప్రాజెక్టు నుంచి 16వేల క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి విడుదలవుతోంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో డిమాండ్‌కు అనుగుణంగా పీక్‌లోడ్ అవర్స్‌లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రెండు జనరేటర్లతో ఉత్పత్తి చేసి నిలిపేశారు. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 3,500 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,680 క్యూసెక్కుల నీటిని జలాశయం నుంచి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 151.1449 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 872.20 అడుగులకు చేరుకుంది. -
హంద్రీకి నీరు విడుదల చేయాలి
– ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జల మండలి ఎదుట ధర్నా కర్నూలు సిటీ: హంద్రీనీవా కాలువ నుంచి హంద్రీనదికి నీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆసంఘం ఆధ్వర్యంలో శనివారం జల మండలి ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ మాట్లాడుతూ వర్షాకాలం మొదలై మూడు నెలలు అయినా ఇంత వరకు హంద్రీనదిలో నీటి ప్రవాహం అగుపించలేదన్నారు. దీంతో నది పరివాహాక ప్రాంతాల్లోని బావులు, బోర్ల అడుగంటిపోవడంతో నీరందక సాగు చేసిన పంటలు ఎండుతున్నాయన్నారు. కూలీలకు పనులు కూడా కరువయ్యాయన్నారు. గతంలో హంద్రీనది జీవనదిలో ఉండేదని, దీంతో నది తీర ప్రాంతాల్లో రెండు సీజన్లలో పంటలు పండేవన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదని చెప్పారు. జిల్లా అధికారులు స్పందించి హంద్రీనీవా కాలువ నుంచి కొంత నీరు హంద్రీనదికి ఇవ్వాలని కోరారు.S మాల్యాపల్లె, తోగర్చేడు గ్రామాల దగ్గర ప్రధాన కాలువలకు ప్రత్యేకంగా తూములు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం పాణ్యం డివిజన్ కార్యదర్శి బి.సోమన్న, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రైతు కూలీ సంఘం నాయకులు వెంకటస్వామి, సి.వీరన్న, నరసింహూలు, పోతన్న, హంద్రీ పరిరక్షణ కమిటీ నాయకులు శేషగిరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీనీవాకు నీరు విడుదల
మిడుతూరు(నందికొట్కూరు): హంద్రీనీవా కాల్వకు శుక్రవారం నంద్యాల ఎంపీఎస్పీవైరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య..నీరు విడుదల చేశారు. నందికొట్కూరు మండలం మల్యాల మొదటి ఎత్తిపోతల పథకం వద్ద 9వ పంపునకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి.. స్విచ్ ఆన్ చేసి 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈ జలంధర్ మాట్లాడుతూ.. కష్ణానది ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో భారీ వర్షం కురువడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరి, శ్రీశైల జలాశయ నీటి మట్టం మధ్యాహ్నానికి 834.20 అడుగులు చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం హంద్రీనీవాకు ఒక పంపు ద్వారా 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, హంద్రీనీవా సామర్థాన్ని బట్టి విడతల వారిగా ఏడు పంపుల వరకూ నీటిని విడుదలచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నందికొట్కూరు, డోన్ టీడీపీ నియోజకవర్ట ఇన్‌చార్జ్‌లు కేఈ ప్రతాప్, మాండ్రశివానందరెడ్డి, ఈఈ పురుషోత్తంరెడ్డి, డీఈలు ప్రసాద్, పాండురంగయ్య, ఏఈలు మల్లికార్జున, విజయ్‌కిశోర్, నందికొట్కూరు మార్కేట్‌యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, ఎంపీపీ వీరం ప్రసాదరెడ్డి, నాయకులు వెంకట్రామిరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.