రైతు మెడపై వాల్టా కత్తి | walta knife on farmers neck | Sakshi
Sakshi News home page

రైతు మెడపై వాల్టా కత్తి

Published Wed, Apr 12 2017 11:40 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

రైతు మెడపై వాల్టా కత్తి - Sakshi

రైతు మెడపై వాల్టా కత్తి

- హంద్రీనదిలో వేసిన బోర్లపై సర్వే
- ప్రభుత్వ కక్షపూరిత చర్య?
- ఇసుక అక్రమాలపై కోర్టు ఆశ్రయించడమే 
  రైతులు చేసిన తప్పు
- ఏడు మండలాల్లో బోర్లకు పొంచి ఉన్న ముప్పు 
 
కోడుమూరు: టీడీపీ నాయకుల ఇసుక అక్రమాలపై కొందరు రైతులు కోర్టును ఆశ్రయించడం తప్పయింది. తమ పార్టీ వారిని ఇరుకున పెట్టారనో..ప్రభుత్వానికి అపవాదు మూటగట్టారనో..హంద్రీ నదిలో బోర్లను సర్వే చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యే అని కొందరు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇవీ.. తెలుగుదేశం నాయకులు, వారి అనుచరులు.. హంద్రీనదిలో 20 నుంచి 30 అడుగుల లోతు గోతులు తీసి ఇసుకను తరలించుకుపోయారు. ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో కృష్ణగిరి మండలంలోని మన్నెకుంట, ఎర్రగుడి, కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామాల రైతులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీని బాధ్యులుగా చేసి హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తుందన్న అపవాదు మూటగట్టుకుంది. దీంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసి రైతులపై కక్ష కట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
గోనెగండ్ల, కృష్ణగిరి, దేవనకొండ, కోడుమూరు, వెల్దుర్తి, కల్లూరు, కర్నూలు మండలాల పరిధిలోని 29 గ్రామాల సరిహద్దుల్లో గాజులదిన్నె ప్రాజెక్టు హంద్రీనది ప్రవహిస్తోంది. ఏడు మండలాల పరిధిలో ప్రవహిస్తున్న హంద్రీనదిలో రైతులు దాదాపు 2500 మంది రైతులు బోర్లు వేసుకుని దాదాపు 13 వేల ఎకరాల్లో రైతులు పంటను సాగుచేస్తున్నారు. 90 శాతం మంది రైతులు హంద్రీనదిలో బోర్లు వేసుకున్నారు. దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు పైప్‌లైన్లు వేసి హంద్రీనది బోర్ల ద్వారాపంటలు పండించుకుంటున్నారు. అయితే హంద్రీనది మొత్తం ప్రభుత్వ భూమిగా చూపించి వేసిన బోర్లన్నింటిని తొలగించాలని కుట్ర జరుగుతున్నట్లు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
ప్రభుత్వ భూమిగా ఉన్న హంద్రీనదిలో ఎంతమంది రైతులు అనుమతి తీసుకుని బోర్లు వేశారు..అనధికారికంగా ఎంతమంది విద్యుత్‌ కనెక‌్షన్లు వేసుకున్నారు అనే సమాచారాన్ని వీఆర్వోలు హంద్రీనదిలో తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. వాల్టా చట్టాన్ని అమలు చేసి హంద్రీనది అయిన ప్రభుత్వ భూముల్లో వేసిన బోర్లను తొలగించేందుకు సర్వే చేస్తున్నారని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై కోర్టుకు వెళ్లినందుకే రైతులపై కక్ష తీర్చుకునేందుకు అడ్డదారుల్లో అణచివేసేందుకు కుట్ర పన్నుతున్నారని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కృష్ణ ఆరోపించారు. 
 
 హంద్రీ నీళ్లే ఆధారం : శ్రీరాములు, రైతు
నాకున్న 5 ఎకరాల పొలాన్ని సాగుచేసుకునేందుకు హంద్రీనదిలో బోరు వేసుకున్నా. 8 ఏళ్ల నుంచి ఈ హంద్రీ నీళ్లతోనే పంటలు పండించుకుంటున్నా. వర్షాకాలం వరిపంట, ఎండాకాలం కూరగాయలు సాగుచేసుకుంటున్నాం. హంద్రీనది నీళ్లు లేకుంటే మా పొలాలు వర్షాధారంపైనే ఆధారపడాల్సి వస్తోంది. 
 
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సర్వే చేశాం : నిత్యానందరాజు, తహసీల్దార్‌ 
హంద్రీనదిలోని ప్రభుత్వ భూమిలో ఎంతమంది రైతులు బోర్లు వేసుకున్నారన్న విషయాలపై వీఆర్వోలు సర్వే చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ సర్వే జరుగుతోంది.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement