సాయిబాబాను అడ్డుకోవడం తగదు
- ప్రొఫెసర్ హరగోపాల్
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు బేషరతు బెయిల్ పొందిన హక్కుల కార్యకర్త, సహాయ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను తిరిగి విధుల్లో చేర్చుకోకుండా రామ్‌లాల్ కళాశాల యాజమాన్యం అడ్డుకోవడాన్ని ‘కమిటీ ఫర్ డిఫెన్స్.. రిలీజ్ ఆఫ్ డాక్టర్ సాయిబాబా’ చైర్మన్ ప్రొఫెసర్ జి.హరగోపాల్, హనీబాబు ఎం.టీ మంగళవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. విధుల్లో చేరేందుకు అనుమతి కోరుతూ సాయిబాబా కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారని... మహారాష్ట్రలో నమోదైన క్రిమినల్ కేసు పరిష్కారమయ్యే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని ప్రిన్సిపాల్ బదులిచ్చారని వారు తెలిపారు. తదుపరి ఆదేశాల వరకు సాయిబాబా ప్రవేశంపై నిషేధం కొనసాగుతుందని పేర్కొనడం దారుణమన్నారు. అణచివేతకు గురైనవారి హక్కుల కోసం పోరాడుతున్న సాయిబాబాను నేరారోపణతో భయపెట్టేందుకు కళాశాల యాజమాన్యం ప్రయత్నించినట్లు లేఖలో వాడిన పరుష పదజాలం ద్వారా తెలుస్తోందన్నారు.