మరో రెండు రోజుల్లో చౌక ఫోన్!
ముంబై: ప్రపంచంలోనే అత్యంత చౌకయిన ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లు రెండు రోజులు ఆలస్యంగా రానున్నాయి. జూన్ 30 నుంచి డెలివరీ చేస్తామని కొనుగోలుదారులకు రింగింగ్ బెల్స్ సంస్థ తెలిపింది. అయితే జూన్ 28 నుంచి డెలివరీ చేస్తామని అంతకుముందు ప్రకటించింది. ఆలస్యానికి కారణాలు వెల్లడి కాలేదు.
251 రూపాయలకే స్మార్ట్ ఫోన్లు అందిస్తామని రింగింగ్ బెల్స్ నాలుగు నెలల క్రితం చేసిన ప్రకటించడంతో అనూహ్య స్పందన వచ్చింది. లక్షలాది మంది ఈ ఫోన్ల కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిందరికీ ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తామని రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో మోహిత్ గోయెల్ హామీయిచ్చారు. ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ దక్కించుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని హన్స వర్మ అనే యువతి చెప్పింది. రింగింగ్ బెల్స్ వెబ్ సైట్ లో పలుమార్లు ప్రయత్నించి ఫ్రీడమ్ ఫోన్ కోసం ఆర్డర్ నమోదు చేశానని వెల్లడించింది. క్యాష్ ఆన్ డెలివరీ కింద తన పేరు నమోదు చేసుకున్నట్టు తెలిపింది.
'ముందుగా జూన్ 28న డెలివరీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మరో రెండు ఆలస్యమవుతుందంటున్నారు. దీంతో రింగింగ్ బెల్స్ కంపెనీపై అనుమానం కలుగుతోంది. రూ.251 ఫోన్ కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్నాను. మరోసారి మోహిత్ గోయెల్ మాట మార్చరని భావిస్తున్నా'నని హన్స వర్మ పేర్కొంది. మొదటి విడత (2 లక్షల ఫోన్లు డెలివరీ చేస్తామని చెప్పిన రింగింగ్ బెల్స్ మాట నిలుపుకుంటుందో, లేదో మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.