రేపటి నుంచి హనుమద్ ఉత్సవాలు
కసాపురం (గుంతకల్లు రూరల్ ) : ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగనున్న హనుమద్ వ్రతం ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు మాలదారుల పాదయాత్ర, అనంతరం ఇరుముడుల సమర్పణ, 12వ తేదీ రెండో రోజు ఆలయ సమీపంలోని గంగా నిలయం ప్రాంగణంలో హనుమద్ వ్రతాన్ని నిర్వహించనున్నారు.
11న మాలదారుల పాదయాత్ర
మండలం రోజుల పాటు దీక్షలో ఉండి, ఇరుముడుల సమర్పించే క్రమంలో భాగంగా కసాపురం వచ్చే మాల ధారులు ఈనెల 11న ఉదయం నేరుగా పట్టణంలోని హనుమాన్ సర్కిల్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. వేలాదిమంది దీక్షా స్వాముల ఆధ్వర్యంలో పల్లకీపై కొలువుదీరిన నెట్టికంటుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్షా స్వాములు పాదయాత్రను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పట్టణంలోని పొట్టిశ్రీరాములు సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, రామస్వామి దేవాలయం మీదుగా మాలధారుల పాదయాత్ర మధ్యాహ్నానికి నెట్టికంటి ఆంజనేయస్వామి సన్నిధికి చేరుకుంటారు. అనంతరం మాలధారులు ఇరుముడులను స్వామివారికి సమర్పిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఇరుముడలలో తెచ్చిన ద్రవ్యాలతో హోమగుండ ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
12న హనుమద్ వ్రతం
ఆలయ సమీపంలోని గంగా నిలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని కొలువు దీర్చి, వేలాది మంది భక్తులు, మాలధారుల ఆంజనేయస్వామి నామస్మరణల మధ్య ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ హనుమద్ వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం మాలధారులు దీక్షా విరమణ గావిస్తారు.
ఏర్పాట్లు పూర్తి : ఈఓ
హనుమద్ వ్రతం ఉత్సవాలకు దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు, మాలధారులు రానున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టామని ఆలయ ఈఓ ముత్యాలరావు తెలిపారు. పాదయాత్రగా ఆలయానికి చేరుకున్న మాలదారులు ఇరుముడులు సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, వారు విశ్రాంతి తీసుకునేందుకు ఉచిత కాటే జీలు ఏర్పాటుచేశామన్నారు. ఉత్సవాలు నిర్వహించనున్న రెండు రోజుల పాటు మాలధారులకు గంగా నిలయంలో అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గుంతకల్లు మున్సిపాలిటీ నుంచి నిరంతరంగా వాటర్ ట్యాంకర్ల సరఫరా, వైద్య శిబిరాలు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక విచారణ కేంద్ర ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు.