రాష్ట్రపతి పొరపాటు చేసుండొచ్చు
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రపతి నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కోర్టుకు లేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. రాష్ట్రపతి కూడా ఒక్కోసారి పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని, న్యాయసమీక్షకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని సూచించింది. రాష్ట్రపతి పాలనను కోర్టులు సమీక్షించజాలవని కేంద్రం వాదించింది.
రాచరికపాలనలో మాదిరిగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, రాజ్యాంగ పరిధికి లోబడి వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్రపతి విజ్ఞతపై తమకు ఎటువంటి అనుమానం లేదని, ఏది చేసినా న్యాయసమీక్షకు అనుగుణంగా చేయాలని తెలిపింది. హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతనెలలో కేంద్రం రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు శాసనసభను రాష్ట్రపతి సుప్తచేతనావస్థలో ఉంచారు. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఉన్నత న్యాయస్థానాల్లో వాదోపవాదనలు జరుగుతున్నాయి.