వంట మనిషి దెబ్బలకు విద్యార్థిని మృతి
కర్నూలు సీక్యాంప్: వంట మనిషి విచక్షణా రహితంగా కొట్టడంతో ఓ విద్యార్థిని మృత్యువాత పడింది. ఈ ఘటన కర్నూలు మండలం భూపాల్నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. భూపాల్నగర్కు చెందిన హర్షిణి (8) స్థానిక ఎంపీపీ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. గత శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలో భోజనం చేస్తూ.. టమోట, కరివేపాకు తొక్కలు తినకుండా హర్షిణి పారవేసింది. దీన్ని గమనించిన వంట మనిషి వరలక్ష్మి బాలికను విచక్షణా రహితంగా కొట్టి కిందకు పడేసింది. దీంతో అమ్మాయి మోకాలికి బలమైన గాయం అయింది.
బాలిక తల్లిదండ్రులు అదేరోజు ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న హర్షిణి మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులను నిర్బంధించి నిలదీశారు. హర్షిణి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు స్వీకరించామని తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని చెప్పారు.