కఠినంగా వ్యవహరించండి
- నేరాల నియంత్రణపై డీఐజీ రమణకుమార్
- కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ తనిఖీ
కొలిమిగుండ్ల: నేరాల నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కర్నూలు,కడప రేంజ్ డీఐజీ రమణకుమార్ పోలీసులకు సూచించారు. విధులను సమర్థంగా నిర్వహించాలన్నారు. శనివారం ఆయన కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. రికార్డు, కంప్యూటర్ గదులు, నేరస్తులను ఉంచే సెల్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. కేసుల నమోదుపై ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్యతో చర్చించారు. మూడు జిల్లాలకు సరిహద్దున ఉన్న కొలిమిగుండ్ల స్టేషన్కు రెండేళ్లుగా వాహన సౌకర్యం లేదనే విషయాన్ని విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే కొత్త వాహనాలు వస్తాయని చెప్పారు. పోలీస్ క్వార్టర్స్, 1907లో నిర్మించిన పాత పోలీస్ స్టేషన్ భవనం గురించి అడిగి తెలుసుకున్నారు.
పార్కు పరిశీలన..
పోలీస్ క్వార్టర్స్ ఆవరణలో దాతల సహకారంతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్కును డీఐజీ పరిశీలించారు. పార్కు అందంగా, ఆహ్లాదకరంగా ఉందని కితాబిచ్చారు. స్టేషన్లలో ఎక్కడా లేని విధంగా రూపొందించిన పార్కు విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళుతానని తెలిపారు.
డీఐజీని కలసిన ఎమ్మెల్యే..
డీఐజీ రమణకుమార్ కొలిమిగుండ్లకు వచ్చినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి స్టేషన్కు వచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. బనగానపల్లె నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు సమస్యలపై ఇతర నియోజక వర్గాల్లో ఉన్న ముగ్గురు డీఎస్పీలను ఆశ్రయించాల్సి వస్తోందని ఎమ్మెల్యే డీఐజీ దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనిపై డీఐజీ మాట్లాడుతూ నియోజవర్గానికి ప్రత్యేకంగా డీఎస్పీని నియామకానికి కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. మూడు జిల్లాల సరిహద్దున ఉన్న కొలిమిగుండ్ల స్టేషన్ను సర్కిల్ కార్యాలయంగా మార్చే ప్రతిపాదన గతంలోనే ఉందని ఎమ్మెల్యే ఆయన దృష్టికి తీసుకెళ్లారు.