Hasanparti zone
-
మృత్యుంజయుడు
హసన్‌పర్తి: రోడ్డు ప్రమాదానికి గురై పక్కనే ఉన్న వ్యవసాయబావిలో పడిన ఓ వ్యక్తి 30 గంటల పాటు మృత్యువుతో పోరాడిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా నాగారం సమీపంలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన మొగిలి అడ్తి వ్యాపారి. గురువారం బ«ంధువుల ఇంటికి వెళ్లిన అతను శుక్రవారం తెల్లవారుజామున జమ్మికుంటకు బైక్‌పై బయల్దేరాడు. నాగారం సమీపంలో ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయబావిలోకి బైక్ దూసుకెళ్లింది. మొగిలికి ఈత రావడంతో ఈదుకుంటూ మోటారుకు అమర్చిన పైపులను పట్టుకుని ఉన్నాడు. హన్మకొండ నుంచి శుక్రవారం తెల్లవారుజామున బయల్దేరిన మొగిలి ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేస్తే నంబర్ కలిపినా పని చేయలేదు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 30 గంటలు మృత్యువుతో పోరాటం శుక్రవారం తెల్లవారుజామున బావిలో పడిన మొగిలి శనివారం మధ్యాహ్నం వరకు అందులోనే పైపులను పట్టుకొని ఉన్నాడు. బావి వద్దకు మోటారు ఆన్ చేయడానికి వచ్చిన రైతు సమ్మిరెడ్డి మొగిలిని గమనించి చుట్టుపక్కవారి సహకారంతో అతడిని బయటకు తీశారు. గాయాలైన మొగిలిని ఆస్పత్రికి తరలించారు. -
మా మండలాన్నిహన్మకొండలోనే ఉంచాలి
హన్మకొండ అర్బన్ : ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్న హసన్‌పర్తి మండలాన్ని కొత్తగా ఏర్పడనున్న హన్మకొండ జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ మండలంలోని పలు గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో శుక్రవారం కలెక్టరేట్లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఆయా గ్రామాల నుంచి హసన్‌పర్తి మండల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సుల్లో కలెక్టరేట్‌కు వచ్చిన సుమారు 300 మంది విడివిడిగా బారులు తీరి కలెక్టరేట్లో వినతిపత్రాలు అందజేశారు. హసన్‌పర్తి మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న వరంగల్ జిల్లాలో కలపనున్నట్లు ఇటీవల ప్రకటన వచ్చిన నేపథ్యంలో వారు ఇలా వినతిపత్రాలు ఇచ్చారు. ఆ తర్వాత కలెక్టరేట్ ఎదుట కొద్దిసేపు రాస్తారోకో చేశారు. ఆందోళనలో పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు పుట్ట రవి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తో పాటు శీలం సారయ్య, గురుమూర్తి, శివకుమార్, ఆరెపల్లి పవన్, జన్ను రవీందర్, బోడ యుగేందర్, పెట్ట బిక్షపతి, యాదగిరి, వల్లాల గణేష్, బొక్క కుమార్, రమణ, రమేష్ పాల్గొన్నారు.