పొదుగు
‘‘పొద్దన్నంతా యాడేడో తిరిగొచ్చిందిచాలక ఇంకేడికి బోతన్నావురా’’ అని లోపల్నించే కసురుకుంది అమ్మ. పంచలో కుక్కిమంచంలో కునికిపాట్లుపడుతున్న నాయనమ్మ ఉలిక్కిపడి ‘‘పిలకాయలకు ఇస్కూలు సెలవులిస్తే ఇంటిపట్టున యాడుంటారు చెప్పు. అయినా ఇంటికాడుంటే ఇద్దరికీ క్షణం పడదు’’ అని గొణిగి మంచానికి ఆనించిన చేతికర్రతో అక్కడక్కడే తిరుగుతున్న కోడిపుంజుని హుష్పాడుకోళ్ళు’’ అని అదిలించింది.నాగి చొక్కా గుండీలు పెట్టుకుంటూ గడ్డివాము అవతలకి దాటాడు. గడ్డివాముకి పక్కనే చెట్టునీడకి కట్టేసిన గేద ఊరికూరికే తలమీద విసిగిస్తున్న ఈగని అదిలించడానికి కొమ్ములు విదిలించింది.సీత చేతులు వెనక్కి కట్టుకుని అడుగులో అడుగేసుకుంటూ గడ్డివాముదాకా వచ్చి నాగి ఎటుపోతున్నాడా అని చూసింది. ‘‘నువ్వేడికే.. ఆడితోపాటు నువ్వుకూడా పోతావా ఏంది?’’ అని మళ్ళీ సీతను కసురుకున్నది నానమ్మ. ఆసరికే నాగి గడ్డివాము దాటుకుని, ఇంటెనక కాలవ దూకి దాసరోళ్ళ పెరడు అవతలికి వెళ్ళి వెనక్కు చూసాడు. సీత ఇంకా అక్కడే నిలబడి చూస్తా ఉంది. ‘‘ఈయమ్మి రెండు మూడు దినాలనుంచి నాకు చూపించకుండా ఏదో దాస్తా ఉంది. అదేందో తేలడంలా.. అనుకున్నాడు నాగి. అమ్మయితే కొనుక్కోవడానికి ఏమీ ఇవ్వదు. ఇంట్లో వండింది తనకు తెలీకుండా పోదు. నిన్న రాత్రి నాయన సీతకి ఇచ్చిన రూపాయిలో అర్ధరూపాయి నాకీయకపోతే అమ్మూరుకోదు. ఇక నాయనమ్మ దగ్గర ఏదన్నా ఉంటే అది నాకే.. ఇంతకీ ఆయమ్మి ఏది దాచిపెడుతున్నట్టు అనుకున్నాడు. అలా అనుకుంటూనే ఊరవతలకి వచ్చేసాడు. నడిమధ్యాహ్నం దాటిన ఎండ. పైన నిట్టనిలువు సూర్యుడు మలుపు తిరిగాడు. కొమ్మలు ఎత్తిపట్టుకున్న పొడవాటి చెట్లకు నీడలు మొదలయ్యాయి.సీమచింతకాయ చెట్టుమీద పికిలిపిట్ట ఊరికూరికే ఉలిక్కిపడుతూ ఒకటే ఆ కొమ్మకూ ఈ కొమ్మకూ ఎగురుతూఉంది.
సెలవురోజు వస్తే నాగి ఇంటిదగ్గర ఉండడు. ఊరవతల కాలవ దాటుకొని పోరంబోకు బూముల్లో చెట్లు పుట్టల మధ్య జీరంగులకోసమో, రేక్కాయలకోసమో, కలేక్కాయల కోసం తిరుగుతుంటాడు. ఏదీ లేకపోతే కావలగట్టుమీద కూర్చుని చేపలుపట్టే ముసలితాతతో కలిసి చేపలు పడుతూంటాడు. చేపలతాత పేరేమిటో తెలీదు. ఆయనకి ఇల్లూ వాకిలి లేదంటారు. నాగికి ఊరిబయటే పరిచయం. ఎప్పుడు చూసినా కాలవలో నుంచుని మోకాలులోతు నీళ్ళలో వంగుని వల సవరించుకుంటూనో నీళ్ళలో చేపలకోసం తడుముకుంటూనో ఉంటాడు. అతడి కాళ్ళు చేతులు నీళ్ళలో నానినాని మెత్తగా చీకిపోయి ఉంటాయి.బక్కపల్చటి నల్లటి శరీరం. భుజానికి తగిలించిన తాటాకు చేపలబుట్ట వేలాడుతూ ఒంటిమీద చొక్కా ఉందో లేదో అన్నట్టు ఉంటుంది. నల్లటి మొహానికి వేలాడే పలుచటి పొడవాటి గడ్డం. కాలవలో వంగుని వలను సర్దుకుంటున్న తాతను చూసి ‘‘ఏం తాతో ఇయ్యాల సేపలు దొరికినయ్యా’’ అన్నాడు.నీళ్ళలో వంగున్న తాత నడుమెత్తి ‘‘నువ్వా నాగి.. ఇయ్యాల ఇస్కూలు లేదా.. చాన్నాళ్ళకొచ్చినావే’’ అన్నాడు.‘‘స్కూలు లేత్తాతా’’ అని తాతకి సమాధానం చెబుతూ ఒడ్డునుంచి నీళ్ళలోకి దిగాడు. చల్లగా తగిలాయి. ఇంకాస్త ముందుకెళ్ళాక నీరు మోకాళ్ళపైదాకా వచ్చి నిక్కరు అంచు తడిసింది. గులకరాళ్ళని ఆసరాగాచేసుకుని నిదానంగా అలలకు ఎదురడుగులేస్తూ కాలవ అవతలికి వెళ్ళాడు. కాలవగట్టు? పైనుంచి ఏటవాలు కరకట్ట కిందకి అడుగులు దబదబ పడ్డాయి. పరిగెడుతున్నట్లు అక్కడ్నుంచి చింతతోపులోకి వచ్చాడు. అక్కడికి చీకట పడితే మనుషులెవరూ ఉండరు. గుబురు చింతచెట్లకింద నీడ ఉన్నా పిల్లలెవరూ అటువైపు వెళ్ళరు. చింతతోపు దాటాక నడక నెమ్మదించింది.
డొంకదారిలో బాగిమాను మీద వాలిన ఒంటరి జెముడుకాకిని చూసుకుంటూ తాటితోపులోకి అడుగుపెట్టాడు. తాటి చెట్లు ఒకదాని వెనక మరొకటి వరసకట్టి గుండ్రంగా గుంపులు గుంపులుగా నుంచున్నాయి.తోపు మధ్యలో జపాన్ తుమ్మ, బూరుగు, కానుగ చెట్లు దట్టంగా ఉన్నాయి. కొత్త మనిషిని చూసి ఉడతొకటి ఉలిక్కిపడి చెట్టు తొర్రలోకి తుర్రుమంది. నేలమీద చీదరవాదరగా పెరిగిన మొక్కలు. కొన్ని ఉమ్మెత్త, జిల్లేడు, నాంజేడు, ఉత్తరేణి లాంటి మోకాలెత్తు మొక్కలు. మనిషి చేతికి అందేట్లు కొమ్మలున్న వేప, అవదం చెట్లు. చిగురు చేతికందనంత దూరంలో ఆకాశం చివరికి విస్తరించిన యూకలిప్టస్ చెట్లవరస. గుచ్చుకుంటే ఏమవుతుందో అని భయపెట్టే కరెంటుతుమ్మ ముళ్ళు. ఎక్కడపడితే అక్కడ ఆకుపచ్చ గచ్చపొదలూ, విసిరేసినట్లున్న రాళ్ళూ రప్పలు. పలికిచెట్టు పక్కనుంచి నడుస్తుంటే రెండడుగుల దూరంలో కొమ్మచివర తూనీగ కనిపించింది.నిదానంగా వెనకాలే వెళ్ళి వంగి పట్టుకునేంతలో మళ్ళీ అది ఎగిరిపోయి మనిషి నిలబడి అందుకునేంత ఆకు మీద వాలింది. ముందుకెళ్ళి నిదానంగా కొమ్మ వెనకాలే మునివేళ్ళమీద నుంచుని ఆకుమీద వాలిన తూనీగ తోక పట్టుకోబుతుండగా ఉన్నట్లుండి అక్కడ చెదురుమొదురుగా ఉన్న సన్నటి కొమ్మల మధ్య గోధుమరంగు గువ్వ కనిపించింది. దాని రెక్కల మీద మచ్చలు. నాగి బిత్తరపోయి దాన్నలా చూస్తుండగానే అది ఒక నిమిషం అలాగే కూర్చుని నాగిని చూసి టపటపా రెక్కలు విదిల్చి ఒక్కసారిగా దబ్బున ఎగిరిపోయింది. నాగి ఉలిక్కిపడి కొంచెంసేపు అలానే నిలబడి కొమ్మల్ని పక్కకి వంచి రెండడుగులు ముందుకెళ్ళి మునివేళ్ళమీద నుంచుని గూట్లోకి చూసాడు. సన్నటి పుల్లలతో కూర్చినట్లున్న గూడు. కొమ్మల మధ్య అల్లిన అమరిక.పదిలంగా రెండు తెల్లటి గువ్వ గుడ్లు. వెడల్పాటి గోళీకాయల్లా. చేతికందేంత దగ్గరగా.
నాగి వెనక్కి జరిగి అలానే నుంచుండిపోయాడు. తూనీగ ఎటెళ్ళిపోయిందో గాలిలో కలిసిపోయింది. ఎగిరిపోయిన గువ్వ ఎక్కడా కనిపించలేదు. నాగి అక్కడే నేలమీద కూర్చుండిపోయాడు. ‘గువ్వ గుడ్లు చూసాడంటే ఎవరూ నమ్మరు. అమ్మకి చెప్తే యాడాడ తిరిగొస్తన్నావురా అని చెవులు మెలిపెట్టుద్ది. సీతకి చెప్తే చాల్లే అబద్ధాలు అంటుంది. నానమ్మ అసలు వినిపించుకోదు. ఇక మిగిలింది ఇంటి పక్కనే ఉండే సికాకోళ్ళ శీనుగాడికి చెప్తే వాడస్సలు నమ్మడు. బో..చూసాంలేవో.. మేమూ చూసాం..అని అబద్ధమాడతాడు. లోకంలోని వింతలన్నీ వాడికే తెలుసునంటాడు.’ తను గువ్వ గూడు చూసినట్లు ఎవరికైనా చెప్పాలనిపించింది నాగికి. వెనక్కి కాలవ దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.నాగి చెప్పింది వినగానే ‘‘గువ్వగూడా.. నువ్వేమన్నా కదిపినావా? అన్నాడు తాత ఒడ్డున కూర్చుని ఎండకు ఒళ్ళు ఆరబెట్టుకుంటూ.‘‘లేతాత్తా.. నేనేం కదపలేదు’’ ‘‘సరే..పోయి చూద్దాం పద’’ అన్నాడు తాత. ఇద్దరూ చెట్టు దగ్గరకు వచ్చారు. తాత చెట్ల గుబురులోకి వెళ్ళి కొమ్మల్ని తప్పించి లోపలికి చూస్తూ ‘‘యాడబయా.. ఇక్కడ గూడేం లేదే’’ అన్నాడు. ‘ఉంది తాతా నేనకడ్నే చూసాను’’. తాత మళ్ళీ లోపలకి ముందుకెళ్ళి వెతికాడు. ఈసారి నాగికూడా కొమ్మల్లోకి దూరాడు. అక్కడ కొమ్మలు తప్ప గూడేం కనిపించలేదు. ‘‘గువ్వేనంటావా?’’ అన్నాడు తాత.‘‘గువ్వనే తాత. రెక్కలమీద మచ్చలుగూడా ఉండాయి. ఇక్కడ్నే చూసినాన్తాతా.. గూట్లో గుడ్లు కూడా ఉండాయి.’’తాత ఒకడుగు వెనక్కేసి ‘‘గుడ్లుండాయా.. అన్నాడు ఆశ్చర్యపోయి. నా కళ్ళతో చూసినాన్తాతా...‘‘గుడ్లున్న గూట్లో సెయ్యిపెట్టినావా?’’ అనడిగాడు తాత కళ్ళు పెద్దవిచేసి.‘‘లేతాత్తా. అడుగు దూరం నుంచి సూసినానంతే. నన్ను సూడగానే అది లటక్కమని ఎగిరిపోయింది.’’ ‘‘నిన్ను గూటిదగ్గర సూస్తే మళ్ళీ అది గూటికి రాదబయా’’ అన్నాడు తాత బాధగా మొహం పెట్టి. ‘‘ఎందుకు రాదు తాతా?’’‘‘అదంతే అబయా.. పిట్ట గూటిమీద నరుడి నీడ పడితే అది గూటికి చేరదు. ఇంక సెయ్యిపెడితే సరేసరి.. అంతే సంగతి.’’ తాత మళ్ళీ గుబురులోకి దూరాడు. ఎంత వెతికినా అక్కడ గూడు కనిపించలేదు. మనుషుల తొక్కిడికి కొమ్మలు పక్కకి తిరిగి గుబురు చెదిరింది. చివరికి తాత కొమ్మల్లోంచి బయటికి వచ్చాడు.‘‘ఇక్కడేం లేదబయా. మడిసి నీడ పడిన గూడు. గువ్వ మాయం చేస్తది. సరే ఇక ఇంటికి పోదారి.’’
‘‘నిజ్జెం తాతా. నేనిక్కడే నా కళ్ళతో సూసినాను. నన్ను సూడగానే ఎగిరిపోయింది. మచ్చల గువ్వు’’ తాత బయటికి వచ్చాక నాగి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. కొమ్మకొమ్మనూ చూసాడు. అదే చెట్టు. అదే కొమ్మ.అతడి చూపులు అంతకుముందు చూసినదానికోసం వెతుకుతూ ఉన్నాయి. తను వెతికేది అంతకుముందు చోటేనా అని మళ్ళీ చూసుకున్నాడు. వెతికేకొద్దీ పట్టుదల ఎక్కువైంది. చూసినచోటు అదికాదేమోనని పక్కన ఉన్న చెట్ల కొమ్మల్లోకి వెళ్ళి వెతికాడు. కొద్దిసేపటిక్రితం కనిపించింది మళ్ళీ కనిపించలేదు. గువ్వ ఎగిరిపోయింది సరే. గూడూ మాయమైంది. నాగిని నిండా నిరాశ కమ్ముకుంది. నాగి నుంచున్న చోటునే కూలబడి కూర్చున్నాడు. ఎదురుగా తొండ ఒకటి సర్రున ముందుకు పాకి తల పైకీ కిందికీ తిప్పుతూ ఎక్కిరిస్తా ఉంది. అప్పటికే తాత వెనక్కి మళ్ళి చెట్లమధ్య కనుమరుగయ్యాడు. ఉన్నట్టుండి నాగికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఏదో వింత వస్తువు చేతికి అందినట్లే అంది చేజారినట్లయింది. గువ్వ గూటికి రాదని తెలిసీ తెలియని దుఃఖం పొంగుకొచ్చింది. దుఃఖం ఏడుపుగా మారింది. ఏడుపు ఎక్కిళ్ళయింది. అప్పటికి పొద్దు గుంకుతూ ఉంది. బూడిదలో ఆరిపోతున్న నిప్పులా ఉన్నాడు చివరి సూర్యుడు. పడమటి ఆకాశం ఎర్రగా పగిలింది. చెట్ల నీడలు నిదానంగా తూరుపుకి పరుచుకుంటున్నాయి.పిట్టలు గూళ్ళకు చేరే సమయం. మధ్యాహ్నమంతా కాసిన ఎండకు నుదురు నల్లబడింది. చెంపల మీద ఆరిపోయిన కన్నీళ్ళు చెమటతో కలిసి చారికలు కట్టాయి. జుట్టు ముందుకు పడింది. మొహం వాడిపోయింది.
ఎప్పుడొచ్చినాడో చేపల్తాత మళ్ళీ ఎదురుగా వచ్చి నుంచున్నాడు. ఏడుస్తున్న నాగిని చూసి కలవరపడ్డాడు. ‘‘ఏందబయా.. ఇంకా ఇంటికి పోలేదా. ఎందుకేడస్తండా..’’తాతను చూసాక మళ్ళీ ఎక్కిళ్ళు మొదలైనాయి. మాసిన కాలరుతో కళ్ళు తుడుచుకున్నాడు. నాగెందుకు ఏడుస్తున్నాడో చేపలతాతకు ముందు అర్థం కాలేదు. అర్థమయ్యాక ‘ఓ అదా సంగతి’ అన్నాడు. ‘‘యిక ఇంటికిపా.... సీకటి పడతా ఉంది. నిన్ను ఊరికాడ దిగబెడతా.. పురుగూ పుట్రా వుంటది. సీకటి పడ్డాక గువ్వ ఇంటికొస్తదబయా. ఏడవబాకబయా.. నే మంత్రమేస్తాగా. నువ్వు కదిలేదాక అదిక్కడికి రాదు. తాత భుజంమీద చేయివేసి సముదాయించాడు. నాగి కాలరుతో కళ్ళు తుడుచుకున్నాడు. చేపలతాత బుట్ట చంకనేసుకున్నాడు. ఇద్దరూ ఊరుదారి పట్టారు. నాగికి అడుగులు ముందుకు పడుతున్నా ధ్యాసంతా వెనకే ఉంది. దారిలో ఏ పిట్ట కనిపించినా అది గువ్వేనేమో అని తేరిపార చూస్తున్నాడు. పడమటి దిక్కున పగిలిన ఆకాశం మెల్లగా మూసుకుపోతూ మసక చీకటి అలముకుంటూ ఉంది.దూరంనుంచి కనిపిస్తున్న ఊరిచివరి వీధిలైటు మిణుక్కుమంటూ ఉంది. అలవాటైన దారిలో గబగబఅంగలేస్తున్న తాత తాటితోపులో అడుగుపెట్టాడు. తాత నీడని అంటిపెట్టుకుని పరిగెడుతున్నట్లు నడుస్తున్న నాగి వెనక్కి చూసాడు. డొంకలో నిలబడ్డ నిలువెత్తు తాటిచెట్లు తిరిగి చూస్తున్న చింపిరి జుట్టు మనుషుల్లా ఉన్నాయి. ఇద్దరూ చింతతోపుదాకా వచ్చేసరికి పూర్తిగా చీకటిపడి చల్లటి గాలి మొదలైంది. అప్పటిదాకా వెనకెనక్కి చూసుకుంటూ తాతకు వెనకాలే నడుస్తున్న నాగి తాత పక్కకివచ్చి నడవసాగాడు. చెట్లమీద గూళ్ళకు చేరిన పిట్టలు చీకట్లో కికిక్..కికిక్..అంటూ చప్పుడు చేస్తూ ఉన్నాయి. దబదబ అడుగులేస్తున్న తాత ఒక్కసారి ఆగి తలపైకెత్తి ఆకాశంలోకి చూసి వానరాబోతుందబయా.. దబదబ నడవాలి అన్నాడు. కళకళమని చప్పుడు చేసుకుంటూ ప్రవహిస్తున్న కాలవలో గులకరాళ్ళమీద పాదాలు గుదిగుచ్చినడుస్తూ ఇద్దరూ కాలవదాటారు. కాలవలో నీళ్ళు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉన్నాయి.చివరికి పొలిమేరల దగ్గర కాలిబాట రెండుగా చీలిన చోట చేపల్తాత నుంచుండి పోయాడు. ‘‘ఇక దబ్బున ఇంటికిపా.. మీ అమ్మనాయినలు ఎదురుసూస్తా ఉంటారు. దబ్బున పో.. అంటూ వెళ్ళిపోయాడు. అవతలిపక్క కాలిబాటమీద నడుచుకుంటూ పోతున్న తాత చెట్లమధ్యనుంచి చీకట్లో కనుమరుగయ్యాడు. పూర్తిగా చీకటి పడింది. ఊళ్ళోకి అడుగుపెట్టి దాసరోళ్ళ పెరడు దగ్గరకు వచ్చేసరికి దబదబమని చినుకులు మొదలయ్యాయి.
నాగి పరుగందుకున్నాడు. గడ్డివాము దగ్గరకొచ్చేసరికి వానలో తడుస్తున్న గేద మోరతిప్పి చూసింది. ఇంటిదాకా వచ్చేసరికి చొక్కాలాగు పూర్తిగా తడిసిపోయాయి. నాగిని చూడగానే ‘‘ఇంత సీకటిదాక ఇంత వానలో యాడ తడిసొస్తండా.. ఇప్పుడేళయిందా నీకు’’ అన్నది నాయనమ్మ కేకేసింది. నెత్తిమీద చీరకొంగు వేసి తడిసిన తల తుడిచింది. ‘‘అన్నాలేళయిందిగా అయ్యగారికి పెత్తనాలు అయిపోయాయి’’ అన్నది అమ్మ లోపలనుంచి. బయటి వానకి పొయ్యి లోపల పెట్టింది అమ్మ. అడ్డం పెట్టిన తడిక సందుల్లోంచి తెల్లటి పొగ ఒకటే బయటికి వస్తాఉంది. వానకు తడిసిన పుంజు పంచలో చోటుకోసం అటూ ఇటూ తిరుగుతూ ఉంది. తడిసిన బట్టలిప్పి నిక్కరేసుకుని మళ్ళీ మంచమ్మీద నానమ్మ పక్కన కూర్చుంటూ ‘‘సీతక్కాడికి పోయిందే? అన్నాడు. ‘‘పొద్దుగూకాక మీ నాయిన దాన్ని బయటికి తీసుకెళ్ళాడు.వాళ్ళటెళ్ళారు.. ఇటు వాన మొదలైంది’’ అన్నది నాయనమ్మ మంచంలో ఒరుగుతూ. ‘‘కొనుక్కోడానికి దానికేదన్నా ఇచ్చినావేమే?’’ అన్నాడు. ‘‘ఇయ్యడానికి నాకాడ యాడుండాయి.మీనాయన బజారుకు తీసుకెళ్ళాడుగా.. వచ్చేటప్పుడు కారబ్బూంది తెస్తారేమో.. తీసుకుని తిను ’’ అన్నది నాయనమ్మ. నిర్విరామంగా కురుస్తున్న వానకి కరెంటు పోయింది. చీకట్లో అమ్మ కిరసనాయిలు దీపం ముట్టించింది. మంచంమీద నుంచి లేచి నట్టింట్లో దీపం ముందు కూర్చున్నాడు. వానకి తడిసి ఆరిన ఒళ్ళు దీపం వెలుతురులో మెరుస్తూ ఉంది. సీత దాచిపెట్టిందేదో వెతకాలనుకున్నాడు. నిలబెట్టిన నవారు మంచంకోడెక్కి బీరువా పైన చూసాడు. అక్కడ ఏదీ కనపడలేదు. గూట్లో ఉన్న స్కూలుబ్యాగులో చెయ్యిపెట్టి లోపటిదాకా వెతికాడు. నలిగిన స్కూలు పుస్తకాలూ, ఒకటి రెండు నలిగిన కాగితాలూ తప్ప ఏంలేవు.జామెంట్రీబాక్సు తెరిస్తే అందులో పెన్నూ పెన్సిలూ, రబ్బరూ తప్ప మరేంలేవు. ‘‘దాని ఇస్కూలు బ్యాగు నీకెందుకురా? అని అమ్మ కసిరి పొగలుకక్కుతున్న అన్నంపళ్ళెం ముందు పెట్టింది. బ్యాగు అక్కడే ఒదిలేసి కూర్చుని అన్నం తింటుంటే చెక్కబీరువా కిందనుంచి రెండు చుంచులు బయటికి వచ్చాయి. అమ్మ వాటిని చూసి హుష్షో అంది విసుగ్గా. చుంచులు చటుక్కున బీరువా కిందికి ఉరికాయి.నాగి పళ్ళానికి పక్కన రెండు అన్నం మెతుకులు వేసాడు. చుంచులు మళ్ళీ బయటికి వచ్చి మెతుకులు తిన్నాయి. పళ్ళెంలో చెయ్యి కడుక్కుని మళ్ళీ నానమ్మ పక్కలోకి చేరాడు. మంచంకింద సదురుకున్న పుంజు అప్పుడప్పుడూ కురకుర మంటూ ఉంది.
‘‘నానమా గువ్వ గూట్లో సెయ్యి పెడితే ఏమయిద్దే?’’ అన్నాడు. ‘‘ఏమయిద్ది. ఏం కాదు. గువ్వ గూట్లో సెయ్యి పెట్టావా’’ అన్నది నానమ్మ . ‘‘లేదు నానమా..’’ అన్నాడేకాని చీకట్లోకి చూస్తూ గువ్వ తనను చూసిందని చెప్దామనుకున్నాడు. చెప్పలేదు. ఈపాటికి గువ్వ గూటికి చేరి ఉంటదా అని కాసేపు విచారించాడు. తోటి గువ్వ ఎక్కడ కూర్చుంటదా అనుకున్నాడు. మరికాసేపు వానలో తడిసిన గుడ్లు ఏమవుతాయా అనుకున్నాడు. పగలంతా తిరిగిన అలసటకి కళ్ళు మూతలు పడ్డాయి. నానమ్మను చుట్టుకుని నిద్రలోకి జారిపోయాడు.తరవాత నిద్రలో దూరంగా రోడ్డుమీద సైకిలు బెల్లు కొట్టిన చప్పుడూ, నాయిన రావటం, నాయనమ్మ లేచి కూర్చోడం, సీత కారబ్బూందీ పొట్లం విప్పటం, అమ్మ తిట్లూ వినిపించాయి. మెలకువ వచ్చినట్లయి మళ్ళీ ముడుచుకుపడుకున్నాడు. నాన్న నాగిని రెండు చేతులతో ఎత్తుకుని లోపల మంచంమీద పడుకోపెట్టాడు. అప్పటిదాకా కురిసిన వానకి చలి మొదలయింది. నాగి వెచ్చటి దుప్పటిలోకి మరింత ముణగదీసుకున్నాడు. నిద్రలో చలి. చలిలో చీకటి. చీకట్లో వాన. చీకటి నీలంరంగు వెలుతురులోకి తెరుచుకుంది. నేలమీద ఉత్తరేణి పొదలు. చేతికి అందుతున్న కానుగ చెట్టు కొమ్మలు. హఠాత్తుగా కళ్ళముందర చేపల్తాత కనిపించాడు. ‘‘ఏడవబాకబయా.. గువ్వలొస్తాయిగా నేను మంత్రమేస్తానుండు’’ అన్నాడు. నాగికి కాలవగట్టుమీద నిలబడి చూస్తున్నాడు. చేపల్తాత నేలపైన ఒంటికాలిమీద నుంచుని తపస్సు చేస్తున్న మునివలె రెండు చేతులూ పైకి గాలిలోకి నిట్టనిలువుగా చాపాడు. తరువాత కుడిచేయి పైకే ఉంచి ఎడమచేయి ముందుకు చాపాడు. ఆ తరువాత కుడిచేయి ముందుకు సాచి ఎడమచేతితో కలిపాడు. ముందుకు చాచిన గుప్పిట. ‘‘తీసుకో నాగి’’ అన్నాడు తాత. నాగి చెయ్యిచాచాడు. చేతివేళ్ళకి మెత్తగా తగిలింది. నాగి జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని చూసాడు. అది గోధుమరంగు మచ్చలగువ్వ ! మొహం మీద వానచినుకులు పడుతున్నాయి. ఎవరో మొహం మీద చల్లటి నీళ్ళు చిలకరించారు. నాగి ఒక్కసారిగా నిద్రలో ఉలిక్కిపడ్డాడు. ఒళ్ళు జలదరించినట్లయింది. ముక్కుమీద ఏదో చిన్నగా గుచ్చుకున్నట్లయింది. ఒకసారి అటూ ఇటూ మెసిలిమళ్ళీ దుప్పట్లోకి మునుక్కున్నాడు.‘‘నిద్దట్లో ఎవర్ని పిలస్తండా’’ అన్న మాట వినిపించింది. దిండుమీద తల దగ్గర మళ్లీ ఏదో కదిలిన చప్పుడయింది. నాగి కళ్ళు తెరిచి చూసాడు. పసుపురంగు దూదిలా ఉంది. రెండు చిన్నటి కళ్ళు. నన్నటి ముక్కు. పసుపురంగు కోడిపిల్ల. నాగి దానికేసి చూస్తుండగానే పసుపురంగు కోడిపిల్ల తల అటు ఇటు తిప్పి నాగి మొహంమీద మరోసారి ముక్కుతో పొడిచింది. అతడి కళ్ళు నవ్వాయి.చేతివేళ్ళు సుతారంగా కోడిపిల్లని పట్టుకున్నాయి. సీత తనకు చెప్పకుండా దాచిపెట్టినదేదో అర్థమయ్యింది. వెనక ఎవరో గట్టిగా నవ్వుతున్నారు..
...సీత