hate content
-
ఎన్ఆర్ఐలకు హైదరాబాద్ పోలీసుల షాక్
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగం సోషల్ మీడియాపై డేగకంటి నిఘా ఏర్పాటు చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా సైబర్ స్పేస్ పోలీసింగ్ చేపడుతోంది. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌తో పాటు ప్రతి ఠాణాలోనూ వీటిపై కేసులు నమోదు చేయనున్నారు. అనేక మందికి ఇబ్బందులు.. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఎవరికి వారు తమ ఆలోచనలను అందులో పొందుపరుస్తున్నారు. కొందరైతే కొన్ని వర్గాలను, రాజకీయ పార్టీలను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. మరికొందరు మహిళలు, యువతులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. కుప్పలుకుప్పలుగా పుట్టుకువస్తున్న యూట్యూబ్ చానళ్లలో కూడా కొన్ని ఇదే పంథాలో వెళ్తున్నాయి. ఈ పరిణామాలతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి లో అతితక్కువ మంది మాత్రమే పోలీసులకు ఫిర్యా దు చేస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న అనేక మంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అవసరమైతే సుమోటో కేసులు.. వీటన్నింటినీ గమనించిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్రంగా పరిగణించారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బంది సోషల్‌మీడియాపై కన్నేసి ఉంచేలా సైబర్ స్పేస్ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు సోషల్‌మీడియా వ్యవహారాలపై కేవలం సైబర్ క్రైమ్ ఠాణాలోనే కేసులు నమోదయ్యేవి. ఇకపై నగరంలోని అన్ని పోలీసుస్టేషన్లలో ఈ కేసులు నమోదు చేస్తారు. బాధితులు ఎవరూ ముందుకు రాకుంటే సుమోటోగా కేసులు నమోదు చేసే అధికారులు దర్యాప్తు చేపడతారు. ఈ వ్యవహారంలో పారీ్టలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల తీరుతెన్నులను ఆయనే స్వయంగా పర్యవేక్షించనున్నారు. పాస్‌పోర్టులు సైతం రద్దుకు సిఫార్సు.. సోషల్‌మీడియాలో ప్రత్యక్షమవుతున్న అభ్యంతరకరమైన, అశ్లీల, కించపరిచే పోస్టుల్లో కొన్ని ఇతర దేశాల నుంచి పోస్టు అవుతున్నాయి. వీటిని సృష్టిస్తున్న వ్యక్తుల్లో విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఉండటంతో ఇప్పటి వరకు పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. కొన్ని కేసుల్లో మాత్రం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) మాత్రమే జారీ చేస్తున్నారు. దీంతో ఆ వ్యక్తులు దేశానికి వస్తేనే పట్టుకునే ఆస్కారం ఉంటోంది. ఇలాంటి వారికీ చెక్ చెప్పడానికి సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహా కేసుల్లో నిందితులు ఎన్నారైలు ఉంటే వారి పాస్‌పోర్టులు రద్దు చేయాల్సిందిగా ఆర్పీఓకు సిఫార్సు చేస్తారు. దీంతో ఆయా వ్యక్తులను వారు ఉంటున్న దేశాలు బలవంతంగా తిప్పి పంపడానికి ఆస్కారం ఏర్పడుతుంది. శిక్షలు పడే వరకు పర్యవేక్షణ.. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్‌మీడియాల్లో అవాంఛనీయ పోస్టులపై కేసుల నమోదుతో సరిపెట్టవద్దని ఆనంద్ స్పష్టం చేశారు. ప్రతి కేసునూ చట్ట ప్రకారం దర్యాప్తు చేసి, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ కంటే వాట్సాప్, ట్విట్టర్ల ద్వారానే ఇలాంటివి ఎక్కువ సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వాట్సాప్‌లో ఉండే గ్రూపులే వదంతులు విస్తరించడానికి కారణమవుతున్నా యని వివరిస్తున్నారు. ఏ సమాచారం అయినా పూర్తిగా నిర్ధారించుకోకుండా ప్రచారం, షేరింగ్ చేయవద్దని అలా చేస్తే చట్ట ప్రకారం నేరమే అవుతుందని, అభ్యంతరకర కామెంట్లు చేసినా బాధ్యులేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
ఫేస్‌బుక్‌కు దూరంగా ప్రముఖులు?
న్యూయర్క్: ప్రపంచంలో అతిపెద్ద సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై ద్వేష పూరిత ప్రచారాలు, తప్పుడు సమాచారాలపై చర్యలు తీసుకోవాలంటూ రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోంది. ఈ నిరసనలో భాగంగా కిమ్ కర్దషియన్తో సహా ప్రముఖులు 24 గంటల నుంచి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఎలాంటి పోస్ట్ చేయలేదు. లియోనార్డో డికాప్రియో, సాచా బారన్ కోహెన్, కాటి పెర్రీ, మైఖేల్ బి. జోర్డాన్ వంటి స్టార్స్ అందరూ ‘స్టాప్ హేట్ ఫర్ ప్రాఫిట్’ నిర్వహిస్తున్న నిరసనకు మద్దతు ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మార్పు కోసం పిలుపునిచ్చారు. ‘ఈ వేదికలు ద్వేషం, తప్పుడు సమాచారం వ్యాప్తిని అనుమతించేటప్పుడు నేను కూర్చుని మౌనంగా ఉండలేను - అమెరికాను విభజించడానికి గ్రూపులను సృష్టించాయి’ అని కర్దషియాన్ తెలిపారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 188 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్లో తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 2016 అమెరికా ఎన్నికల సమయంలోనూ రష్యా ప్రచారం చేసిన వార్తలను ఫేస్బుక్ అరికట్టలేకపోయిందని అనేక ఆరోపణలు ఎదుర్కోంది. సెలబ్రెటీలతో పాటు అనేక సంస్థలు కూడా యాడ్స్‌ను ఆపేసి ఫేస్బుక్ మీద నిరసనలు వ్యక్తం చేశాయి. అయిన ఫేస్బుక్ ఆదాయం 5.2 బిలియన్ డాలర్ల విలువైన యాడ్ రెవెన్యూ వచ్చింది. తప్పుడు వార్తలు, ప్రచారాలపై చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా చెబుతూ, అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్న ఇంకా అలాంటి వార్తలను కట్టడిచేయలేకపోతుంది. చదవండి: చిన్న సంస్థలకు ఫేస్బుక్ రూ. 32 కోట్ల గ్రాంటు -
ఫేస్బుక్ ఇండియా ఎండీకి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.ఈ ఏడాది ఆరంభంలో చోటు చేసుకున్న ఢిల్లీ అల్లర్లలో ఫేస్‌బుక్‌కు పాత్ర ఉందంటూ, ఫేస్బుక్ ఇండియా అధికారులకు తాజా నోటీసులు జారీ అయ్యాయి. ద్వేషపూరిత కంటెంట్ పై చర్య తీసుకోవడంలో విఫలమైందంటూ ఆరోపించిన ఢిల్లీ అసెంబ్లీ కమిటీ సెప్టెంబర్ 15 న ఢిల్లీ విధానసభ ముందు హాజరుకావాలని కోరుతూ నోటీసు జారీ చేసింది. తమ వాదనను వినిపించేందుకు సెప్టెంబర్ 15 మంగళవారం హాజరు కావాలని ఢిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య పూర్వక కమిటీ,, ఫేస్బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ కు సమన్లు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజేంద్రనగర్ చెందిన ఎమ్మెల్యే రాఘవ చాదా నేతృత్వంలోని కమిటీ ఈ సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై కొంతమంది సాక్షులను, సాక్ష్యాలను పరిశీలించిన మీద ఈ సమన్లు జారీ చేశామని కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లు తీవ్రతరం కావడానికి ఫేస్బుక్ కారణమైందని ఆగస్టు 31వ తేదీన జరిగిన రెండో విచారణలో కమిటీ నిర్ధారించింది. రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న ఫేస్ బుక్ మరోసారి వివాదంలో పడింది. ప్రధానంగా అధికార బీజేపీకి అనుకూలంగా ఫేస్ బుక్ సంస్థ వ్యవహరిస్తోందని, హింసను ప్రేరేపించే విద్వేషపూరిత కంటెంట్ విషయంలో పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఇటీవల వచ్చిన ఆరోపణల మధ్య తాజా నోటీసులు జారీ అయ్యాయి. -
ఫేస్బుక్ నియంత్రణలో భారత్ టాప్
న్యూఢిల్లీ: సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్‌బుక్‌లోని కంటెంట్‌ను అత్యధికంగా నియంత్రిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. భారత ప్రభుత్వ సూచన మేరకు ఈ ఏడాది ప్రథమార్ధంలో దాదాపు 5,000 అంశాలకు సంబంధించిన సమాచారంపై ఫేస్బుక్ ఆంక్షలు విధించింది. సోషల్ మీడియాలో విద్వేషపూరిత కంటెంట్‌ను నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, భద్రతా ఏజెన్సీల ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఒక నివేదికలో ఫేస్బుక్ పేర్కొంది. మతాలు, ప్రభుత్వాలను విమర్శించే విధమైన కంటెంట్‌పై భారత చట్టాల ప్రకారం నిషేధం ఉన్నట్లు వివరించింది. ఇక అత్యధికంగా ఆంక్షల విజ్ఞప్తులు చేసిన దేశాల్లో టర్కీ (1,893), పాకిస్థాన్ (1,773) ఉన్నాయి. మరోవైపు, అత్యధిక సంఖ్యలో యూజర్లు, వారి అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ కోరిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలోనూ, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి జనవరి-జూన్ 2014 మధ్య కాలంలో 5,958 మంది యూజర్లు, వారి అకౌంట్ల వివరాలు ఇవ్వాలంటూ 4,559 విజ్ఞప్తులు వచ్చినట్లు ఫేస్బుక్ తన నివేదికలో వెల్లడించింది.