హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగం సోషల్ మీడియాపై డేగకంటి నిఘా ఏర్పాటు చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా సైబర్ స్పేస్ పోలీసింగ్ చేపడుతోంది. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌తో పాటు ప్రతి ఠాణాలోనూ వీటిపై కేసులు నమోదు చేయనున్నారు.
అనేక మందికి ఇబ్బందులు..
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఎవరికి వారు తమ ఆలోచనలను అందులో పొందుపరుస్తున్నారు. కొందరైతే కొన్ని వర్గాలను, రాజకీయ పార్టీలను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. మరికొందరు మహిళలు, యువతులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. కుప్పలుకుప్పలుగా పుట్టుకువస్తున్న యూట్యూబ్ చానళ్లలో కూడా కొన్ని ఇదే పంథాలో వెళ్తున్నాయి. ఈ పరిణామాలతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి లో అతితక్కువ మంది మాత్రమే పోలీసులకు ఫిర్యా దు చేస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న అనేక మంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
అవసరమైతే సుమోటో కేసులు..
వీటన్నింటినీ గమనించిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్రంగా పరిగణించారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బంది సోషల్‌మీడియాపై కన్నేసి ఉంచేలా సైబర్ స్పేస్ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు సోషల్‌మీడియా వ్యవహారాలపై కేవలం సైబర్ క్రైమ్ ఠాణాలోనే కేసులు నమోదయ్యేవి. ఇకపై నగరంలోని అన్ని పోలీసుస్టేషన్లలో ఈ కేసులు నమోదు చేస్తారు. బాధితులు ఎవరూ ముందుకు రాకుంటే సుమోటోగా కేసులు నమోదు చేసే అధికారులు దర్యాప్తు చేపడతారు. ఈ వ్యవహారంలో పారీ్టలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల తీరుతెన్నులను ఆయనే స్వయంగా పర్యవేక్షించనున్నారు.
పాస్‌పోర్టులు సైతం రద్దుకు సిఫార్సు..
సోషల్‌మీడియాలో ప్రత్యక్షమవుతున్న అభ్యంతరకరమైన, అశ్లీల, కించపరిచే పోస్టుల్లో కొన్ని ఇతర దేశాల నుంచి పోస్టు అవుతున్నాయి. వీటిని సృష్టిస్తున్న వ్యక్తుల్లో విదేశాల్లో ఉండే ఎన్‌ఆర్‌ఐలు ఉండటంతో ఇప్పటి వరకు పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. కొన్ని కేసుల్లో మాత్రం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) మాత్రమే జారీ చేస్తున్నారు. దీంతో ఆ వ్యక్తులు దేశానికి వస్తేనే పట్టుకునే ఆస్కారం ఉంటోంది. ఇలాంటి వారికీ చెక్ చెప్పడానికి సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహా కేసుల్లో నిందితులు ఎన్నారైలు ఉంటే వారి పాస్‌పోర్టులు రద్దు చేయాల్సిందిగా ఆర్పీఓకు సిఫార్సు చేస్తారు. దీంతో ఆయా వ్యక్తులను వారు ఉంటున్న దేశాలు బలవంతంగా తిప్పి పంపడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
శిక్షలు పడే వరకు పర్యవేక్షణ..
యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్‌మీడియాల్లో అవాంఛనీయ పోస్టులపై కేసుల నమోదుతో సరిపెట్టవద్దని ఆనంద్ స్పష్టం చేశారు. ప్రతి కేసునూ చట్ట ప్రకారం దర్యాప్తు చేసి, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ కంటే వాట్సాప్, ట్విట్టర్ల ద్వారానే ఇలాంటివి ఎక్కువ సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వాట్సాప్‌లో ఉండే గ్రూపులే వదంతులు విస్తరించడానికి కారణమవుతున్నా యని వివరిస్తున్నారు. ఏ సమాచారం అయినా పూర్తిగా నిర్ధారించుకోకుండా ప్రచారం, షేరింగ్ చేయవద్దని అలా చేస్తే చట్ట ప్రకారం నేరమే అవుతుందని, అభ్యంతరకర కామెంట్లు చేసినా బాధ్యులేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment