'హవేలీ హిజ్రాల నుంచి రక్షణ కల్పించండి'
సుల్తాన్‌బజార్(హైదరాబాద్ సిటీ): నగరంలో హిజ్రాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. పాతబస్తీలో నివసించే ఒక వర్గం హిజ్రాలు తమపై దౌర్జన్యానికి పాల్పడుతోందంటూ తెలంగాణ హిజ్రా వెల్ఫేర్ బోర్డు ఆరోపించింది. గురువారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో హిజ్రా బోర్డు సభ్యులు లైలా, చంద్రముఖి, గౌతం, రంజితలు తమ గోడు వెళ్లగక్కారు.
అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ బతకడమే కష్టమవుతోన్న పరిస్థితుల్లో పాతబస్తీకి చెందిన హవేలీ హిజ్రాలు తమపై దాడులు చేస్తూ తీవ్రంగా వేధిస్తున్నారని బోర్డు సభ్యులు చెప్పారు. తమకు తామే హిజ్రాలకు నాయకులమని ప్రకటించుకున్న హవేలీ హిజ్రాలు.. ఇతర దేవుళ్లకు మొక్కొద్దని, ఎలాంటి పూజలు చేయొద్దని, కేవలం తమ మతాన్ని పాటించాలని వేధిస్తున్నట్లు తెలంగాణ హిజ్రాలు ఆరోపించారు.
'ఇష్టమైన దేవుణ్ని పూజిస్తే హవేలీ హిజ్రాలు సహించట్లేదు. దాడులుచేసిమరీ జరిమానాలు విధిస్తున్నారు. హైదరాబాద్ లో ఉండాలంటే నెలకు రూ. 11వేలు చెల్లించాలని బెదిరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంమే కల్పించుకుని హవేలీ హిజ్రాల నుంచి మాకు రక్షణ కల్పించాలి' అని తెలంగాణ హిజ్రా వెల్ఫేర్ బోర్డు సభ్యులు కోరారు.