hawala gang
-
ముంబయి టు బెజవాడ
సాక్షి, అమరావతి బ్యూరో : వాణిజ్య నగరంగా పేరొందిన విజయవాడలో కొందరి నిర్వాకం ఫలితంగా వ్యాపారులకు అక్రమ రవాణా మకిలీ అంటుకుంటోంది. ముంబై నుంచి నేరుగా ఎలాంటి బిల్లులు లేకుండా ఇక్కడికి పసిడిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగారం తరలింపునకు చాలా సులువుగా రైలు, పార్శిల్ సర్వీస్ మార్గాలను ఎంచుకుంటున్నారు. ముంబయిలో రైలెక్కితే.. విజయవాడలో దిగే వరకూ ఎక్కడా పెద్దగా తనిఖీలు ఉండకపోవటం అక్రమార్కులకు కలసి వస్తోంది. స్టేషన్ నుంచి ఒన్‌టౌన్‌కు ఒక కిలోమీటరు దూరం మాత్రమే ఉంది. పార్శిల్ సర్వీస్ కేంద్రాలు కూడా పాతబస్తీలోనే ఉండటంతో వారి పని సులువు అవుతోంది. నిఘా పెరగడంతో.. అక్రమ మార్గంలో బంగారం, నగదు తరలిస్తున్న ముఠాలపై నగరంలో సీసీఎస్ పోలీసులు నిఘా పెట్టారు. అక్రమార్కుల బండారం క్రమంగా బయట పడుతోంది. గతేడాది డిసెంబర్ 2వ తేదీన విజయవాడకు చెందిన రాజుసింగ్, అర్జున్‌సింగ్ అనే ఇద్దరు సోదరులు ఒన్‌టౌన్ ప్రాంతంలో తయారుచేసిన రూ. 79.56 లక్షల విలువైన 221.2 కేజీల వెండి వస్తులను సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి సరైన ఆధారాలు లేవు. ఆ వెండిని మాత్రం మహారాష్ట్రలోని కోలాపూర్ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చారని పోలీసుల విచారణలో తేలింది. ఆ తరువాత ఈ ఏడాది మార్చి 9న గవర్నర్‌పేటలో జైహింద్ కాంప్లెక్స్ బంగారు దుకాణాన్ని నిర్వహిస్తున్న రాజేష్‌కుమార్ జైన్ అనే వ్యాపారి వద్ద నుంచి రూ. 1.92 కోట్ల విలువైన 6.257 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమమార్గంలో బెజవాడకి తరలించిన బంగారాన్ని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. తాజాగా సోమవారం ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని మటంవీధిలోని మరుధర్ ఎక్స్ పార్శిల్ సర్వీస్ నుంచి కొరియర్ సర్వీస్ మాటున ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమ మార్గంలో రవాణా చేస్తున్న రూ. 57.17 లక్షల విలువైన 1.77 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 16 లక్షల విలువైన 40 కిలోల వెండి వస్తువులతోపాటు హవాలా మార్గంలో 15.12 లక్షల నగదును సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 88.29 లక్షల విలువైన వీటిని అదేప్రాంతానికి చెందిన నారాయణ్‌సింగ్, ప్రదీప్‌సింగ్, యోగినా«థ్స్వామిలను అదుపులోకి తీసుకున్నారు. హవాలా మార్గంలో అక్రమ రవాణా బెజవాడకు వాణిజ్య నగరమనే మారుపేరు. పసిడి వర్తకం బాగా నడుస్తోంది. ఇటీవల కాలంలో అనుమతి లేని బంగారం ఆభరణాలతోపాటు నగదు కూడా ముంబయి నగరం నుంచి హవాలా మార్గంలో దిగుమతి అవుతోంది. ఇదే విషయాన్ని సాక్షి ‘కోడ్.. డీల్’ పేరిట హవాలా మార్గంలో నగరంలోకి బంగారం, నగదు తరలుతున్న వైనంపై మార్చి 24న కథనం ప్రచురించాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక పోలీసుల తనిఖీల్లో ఈ నెల 1వ తేదీన రూ. 1.25 కోట్లను సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన కొందరు దాదాపు రూ. 1.70 కోట్లను ఇక్కడ పంపిణీ చేస్తుండగా.. పోలీసులమని చెప్పి కొందరు వారి వద్ద నుంచి దోచుకోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 1.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బంతా హవాలా మార్గంలోనే బెజవాడకు చేరినట్లు పోలీసుల విచారణలో తేలింది. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేసినపుడు మాత్రమే ఈ తరహా గుట్లు బయట పడుతున్నాయి. లేదంటే అంతే సంగతి. బిల్లులు లేని వ్యాపారం చేస్తున్న కొందరు ప్రభుత్వాదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఇప్పటికైనా వాణిజ్య, ఆదాయపన్ను, పోలీసు, రైల్వే శాఖ అధికారులు సమష్టిగా ఈ తరహా విధానానికి చెక్ పెట్టే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
హవాలా ముఠా గుట్టురట్టు
సీతమ్మధార(విశాఖ ఉత్తర): అక్రమంగా నగదు మార్పిడి చేస్తున్న (హవాలా వ్యాపారం) ముఠాని టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ద్వారకాజోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకానగర్ ఎస్.ఎస్.ఆర్.రెసిడెన్సీ ఎదురుగా వనిత రెసిడెన్సీ ప్లాట్ నెంబర్ – 403లో మంగళవారం ఉదయం హవాలా వ్యాపారం చేస్తున్నట్లు టాస్క్ఫోర్సు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏసీపీ మహేంద్ర మాతే సిబ్బందితో దాడులు చేశారు. ఈ దాడుల్లో టైకోన్ రోడ్డు బాలాజీనగర్‌కు చెందిన చలుమూరి రామకృష్ణ, కైలాసాపురం, గాంధీ విగ్రహం కృష్ణానగర్‌కు చెందిన చల్లా నారాయణను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.38 లక్షల76 వేల 350తో పాటు ఫ్యాక్స్ మిషన్, నగదు లెక్కింపు యంత్రం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ద్వారకా జోన్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా ఏసీపీ మహేంద్ర మాట్లాడుతూ ఇన్కంటేక్స్ డిపార్టుమెంట్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. -
అక్రమంలో సక్రమం!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసులు బుధవారం పట్టుకున్న హవాలా గ్యాంగ్.. వ్యవస్థీకృతంగా దందా చేస్తున్నట్టు తేలింది. అక్రమ నగదు రవాణాను వివిధ కంపెనీల పేర్లతో పెట్టుబడుల ముసుగులో తరలిస్తున్నట్టు గుర్తించారు. ‘ఎన్నికల ఖర్చుల’ కోసం అడిగిన వారికి అందించడానికి డబ్బు సమీకరించి సిద్ధం చేసి ఉంచుతున్న సునీల్ కుమార్ అహుజాఇంటిపై బుధవారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసిన విషయం తేలిసిందే. పోలీసులను చూడగానే విషయం అర్థం చేసుకున్న సునీల్ తన ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఆ నగదుకు సంబంధించిన లెక్కలు చెప్పేందుకు సిద్ధమయ్యాడు. పోలీసులు లోతుగా ఆరా తీయడంతో అసలు విషయం బయట పడింది. ‘ఇన్వెస్ట్మెంట్ బిజినెస్’ ముసుగులో.. అక్రమ ద్రవ్య మార్పిడి దందాను సైతం ఈ గ్యాంగ్ ‘సక్రమంగా చూపే ప్రయత్నం చేసింది. దాదాపు 15 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వీటిలో పెట్టుబడిగా, లావాదేవీలకు డబ్బు వస్తున్నట్లు సృష్టించింది. సునీల్, అతడి కుమారుడు ఆషిష్ కలిసి ఆయా కంపెనీలతో పాటు తమ పేర్లతో ఉన్న 13 బ్యాంకు ఖాతాల్లోకి ఈ నిధులను మళ్లిస్తూ డ్రా చేస్తున్నారు. వీటికి లెక్కలను పక్కాగా సృష్టిస్తున్న సునీల్.. తన ల్యాప్‌టాప్‌లో భద్రపరుస్తున్నాడు. సాధారణంగా అది కంపెనీల సంబంధించిన డబ్బుగానే భావిస్తారు. పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అసలు విషయం గుర్తించగలిగారు. సెల్ఫోన్ల ద్వారానూ లాకర్ ఓపెన్ ఈ తండ్రీ కొడుకులకు జూబ్లీహిల్స్‌లో సొంత ఇల్లు ఉన్నప్పటికీ బంజారాహిల్స్‌లోని నవీన్‌నగర్‌లో ఉన్న అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆ ఇంట్లో రెండు బెడ్రూమ్స్, ఓ లాకర్ రూమ్ మాత్రమే ఉన్నాయి. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసి తింటారు. గదిలో ఉన్న మూడు లాకర్లలో ఒకటి రూ.2000 వేల నోట్లకు, మరోటి రూ.500 నోట్లకు, మూడోది మిగిలిన డినామినేషన్స్ కరెన్సీ కోసం వినియోగిస్తున్నారు. ఈ మూడు లాకర్లను సునీల్ తన స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్ చేసి ఎక్కడ నుంచి అయినా లాక్, అన్‌లాక్ చేసే సదుపాయం ఉంది. ఓ పెద్ద బీరువాను డాక్యుమెంట్లు భద్రపరచడానికి వినయోగిస్తున్నారు. మరోపక్క ఈ గదిలోనే ఓ కరెన్సీ కౌంటింగ్ మిషన్, కట్టల్ని సీల్ చేయడానికి మరో మిషన్‌ను పోలీసులు గుర్తించారు. అన్నప్రకారం చెల్లించకుంటే రిజిస్ట్రేషన్లు ఈ తండ్రీకొడుకులు అక్రమ ద్రవ్యమార్పిడి దందాతో పాటు భారీ వడ్డీకి అప్పులు సైతం ఇస్తుంటారు. ఇలా తీసుకునే వారి నుంచి ష్యూరిటీగా విలువైన స్థలాలకు సంబంధించిన దస్తావేజులు తీసుకుంటారు. వీటితో పాటు కొన్ని ఖాళీ పేపర్లు, స్టాంప్ కాగితాలపై కూడా వారితో సంతకాలు తీసుకుంటారు. నిర్ణీత సమయంలో, చెప్పిన వడ్డీకి డబ్బు ఇవ్వకుంటే వీరి వ్యవహారం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆయా స్థలాలను తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, జీపీఏ చేసుకుని వాటిని స్వాధీనం చేసుకుంటారు. వీరి ఇంటిపై దాడి చేసిన పోలీసులు కొన్ని స్థలాలకు సంబంధించిన దస్తావేజులు, కొందరి సంతకాలతో ఉన్న ఖాళీ పేరర్లు స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఇచ్చిన మొత్తాలు ఎంత? అవి ఎక్కడివి? తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. తండ్రీకొడుకులు తమ వ్యవహారాల్లో అవసరమైన నకిలీ పత్రాలను తన డ్రైవర్ ఆజం ద్వారా తయారు చేయిస్తున్నారు. చెక్పోస్టులపైఅసాంఘిక శక్తుల కన్ను ఎన్నికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో శాశ్వత చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నాం. ఇవి ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని అసాంఘిక శక్తులు గుర్తించి ఆ మార్గాల్లో రాకుండా ప్రయత్యామ్నాయాలు ఎంచుకుంటున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. మరికొన్ని ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి చర్యలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో వాహనాల తనిఖీలు, లాడ్జిల్లో సోదాలు ముమ్మరం చేస్తాం. హవాలా, హుండీ దందాలపై నిఘా వేసి ఉంచుతున్నాం. – అంజనీకుమార్, నగర పోలీస్ కమిషనర్ -
హవాలా గ్యాంగులు.. తెర వెనుక ‘పెద్దలు’!
-
హవాలా గ్యాంగులు.. తెర వెనుక ‘పెద్దలు’!
► నిన్న వైజాగ్.. నేడు విజయవాడ ► ఆయా ఘటనల్లో టీడీపీ నేతల ప్రమేయంపై అనుమానాలు ► పెద్ద మొత్తాల్లో రుణాలు, డబ్బు మార్పిడిలో కీలక పాత్ర ► పోలీసుల చేతికి చిక్కకుండా చేతులు మారుతున్న రూ.కోట్లు ► పోలీసులకు సవాలుగా మారిన లావాదేవీలు రాష్ట్రంలో హవాలా బాగోతాలు హడలెత్తిస్తున్నాయి. ప్రతి కుంభకోణం వెనుక అధికార తెలుగుదేశం పార్టీ నేతల పాత్రలు వెలుగు చూస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత టీటీడీ బోర్డు సభ్యునిగా ఉన్న శేఖర్‌రెడ్డి హవాలా రూపంలో పెద్ద మొత్తంలో కొత్త నోట్లను తెప్పించుకుని దొరికిపోయాడు. చెన్నైకి చెందిన శేఖర్‌రెడ్డికి టీటీడీ బోర్డు సభ్యునిగా పదవి కట్టబెట్టినప్పుడే పలు అనుమానాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకుల సొమ్మును హవాలా రూపంలో విదేశాలకు తరలించడంలో సహకారం అందిస్తున్నందుకే ఆ పదవి ఇచ్చినట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. శేఖర్‌రెడ్డి అరెస్ట్ కావడంతో టీటీడీ బోర్డు సభ్యునిగా తొలగించి.. ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నట్లు అప్పట్లో ముఖ్యమంత్రి చేతులు దులిపేసుకున్నారు. ఇటీవల విశాఖపట్నంలో వెలుగు చూసిన హవాలా కుంభకోణం వెనుక రాష్ట్ర మంత్రుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన తండ్రీకొడుకులు వడ్డి శ్రీనివాసరావు, మహేశ్‌లు విశాఖ కేంద్రంగా రెండు డొల్ల కంపెనీల పేరుతో ఏకంగా రూ.1500 కోట్లకు పైగా మొత్తాన్ని హవాలా రూపంలో విదేశాలకు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర రాజధాని విజయవాడలో వెలుగు చూసిన హవాలా వివాదం ముదిరి క్రిమినల్ చర్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడా టీడీపీ ప్రజాప్రతినిధుల పాత్ర ఉందనే అనుమానాలు గుప్పుమంటున్నాయి. గత ఎన్నికల్లో విజయవాడ కేంద్రంగా ప్రస్తుత కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, మరికొందరు టీడీపీ ప్రముఖులు హవాలా ద్వారా పెద్ద ఎత్తున రాష్టంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు డబ్బు సంచులు అందించారన్న ఆరోపణలున్నాయి. బిల్లులు లేకుండా సరుకు తరలించడం, భారీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ నిర్మాణాలకు పెట్టుబడులకు హవాలా ద్వారా విజయవాడ, విశాఖల్లో పెద్ద మొత్తాలు చేతులు మారడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. ఈ వ్యవహారాల్లో టీడీపీ ముఖ్య నేతలే వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారని ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. బ్రహ్మాజీరావుపై దాడి.. రంగంలోకి దిగిన పెద్దలు విజయవాడలో ఫైనాన్సియర్ బ్రహ్మాజీరావు కిడ్నాప్, దాడి కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, హెల్డ్ ఆసుపత్రి ఎండీ చలపాటి రవి, సన్ని, వెంకటేశ్వరరావు, శ్రావణ్‌లతోపాటు మరో ఆరుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఈ ఘటన వెనుక కారణాల్లోకి వెళితే.. హెల్ప్ ఆస్పత్రి ఎండీ చలపాటి రవి, టైమ్ ఆస్పత్రి ఎండీ హేమంత్, న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణలతోపాటు మరికొందరికి బ్రహ్మాజీరావు రూ.50 కోట్లు ఫైనాన్స్ సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పారు. అందుకు రూ.కోటి కమీషన్ తీసుకున్నారని తెలుస్తోంది. చెప్పిన విధంగా రుణం ఇప్పంచలేదు. దీంతో వారు బ్రహ్మాజీరావును కిడ్నాప్ చేసి విజయవాడ శివారులోని ఓ తోటలోకి తీసుకువెళ్లారు. అక్కడ ఆయన్ను తీవ్రంగా కొట్టారు. కొన్ని పత్రాల మీద సంతకాలు తీసుకుని వదిలిపెట్టారు. తీవ్రంగా గాయపడిన బ్రహ్మాజీరావును కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. దాడి చేశారని ఫిర్యాదు చేసినప్పటికీ విజయవాడ పడమట సీఐ కెన్నెడీ సీరియస్‌గా తీసుకోలేదు. మరోవైపు ట్రాఫిక్ ఏసీపీ సూర్యచంద్రరావు ఈ వ్యవహారంలో వైద్యులకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. బ్రహ్మాజీరావు కుటుంబ సభ్యులు విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన ప్రాథమిక విచారణ నిర్వహించి ఏసీపీ సూర్యచంద్రరావును సరెండర్ చేశారు. సీఐ కెన్నెడీని వీఆర్‌కు పంపారు. ఇది హవాలా డబ్బు వ్యవహారమే! బ్రహ్మాజీరావు రూ.50 కోట్లు రుణం ఎలా ఇప్పిస్తానని చెప్పారన్నది కీలకంగా మారింది. విదేశాల నుంచి హవాలా రూపంలో భారీగా నగదు మార్పిడి జరుగుతోందని పోలీసులు భావిస్తున్నారు. విదేశాల నుంచి రుణాన్ని ఇప్పిస్తానని బ్రహ్మాజీరావు చెప్పినట్లు నిందితుల కుటుంబ సభ్యులు వెల్లడించారు. మూడేళ్లుగా ఈ వ్యవహారం సాగుతోందని చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో చెప్పినట్టు డబ్బు ఇప్పించక పోవడంతోనే ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తి కిడ్నాప్, దాడి వరకు దారితీసింది. ఈ వ్యవహారం కలకలం రేపడంతో కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత స్వయంగా రంగంలోకి దిగారు. మరోవైపు ప్రభుత్వ ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడైన ఓ పత్రికాధిపతి కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఓ ఆసుపత్రి ఎండీ ఆయనకు సన్నిహితుడు కావడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కీలక నేత ఈ సెటిల్మెంట్ బాధ్యతను తన సన్నిహితుడికి అప్పగించినట్లు తెలిసింది. ఆయన ఇరు వర్గాలతో విజయవాడ భారతీనగర్‌లో బుధవారం ఉదయం రాజీ చర్చలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో కీలక నిందితులు పరారీలో ఉన్నారు. వారిలో కొందరికి అనంతపురం జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ పెద్దలు అంతా రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. నన్ను కొట్టి నగలు తీసుకున్నారు.. ‘పువ్వాడ రవి, సన్ని, చల్లపాటి రవి, వాళ్ల అన్న వెంకటేశ్వరరావు, వారికి మద్దతుగా వచ్చిన కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారు. నా ఒంటి మీదున్న రూ.2 కోట్ల నగులు లాక్కున్నారు. డాక్యుమెంట్ల మీద సంతకాలు తీసుకున్నారు. ఇంటి వద్ద ఉన్న రాళ్ల సంచిని తెప్పించి తీసుకున్నారు. వాటి విలువ ఎంతో తెలియదు. నా ఆస్తి మొత్తం స్వాహా చేయాలన్నది వారి ఉద్దేశం. వారిలో రవి తప్ప మిగిలినవాళ్లెవరూ నాకు తెలియదు. నా కిడ్నాప్‌లో రవి పాత్రే ఎక్కువ. నన్ను కొడుతుంటే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అక్కడకు వచ్చారు. ఆయన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అని వాళ్లు చెబితేనే తెలిసింది. ఆయన పొడవుగా బక్క పలుచగా ఉన్నారు. నన్ను కొట్టడంతో వాళ్లు చెప్పమన్నట్లుగా నేను చెప్పాను. అదంతా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వీడియో రికార్డు చేశాడు. అనంతరం ఈ నెల 14న ఇంటిలో విడిచిపెట్టారు’ అని విజయవాడ సెంటినరీ ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న బ్రహ్మాజీరావు బుధవారం విలేకరులకు వెల్లడించారు. బ్రహ్మాజీ మోసం చేశారు ‘విదేశాల నుంచి రూ.5 కోట్లు రుణాన్ని ఇప్పిస్తానని చెప్పి బ్రహ్మాజీరావు మమ్మల్ని మోసం చేశారు. రుణం ఇప్పించేందుకు కమీషన్‌గా రూ.30 లక్షలు ఇచ్చాము. మూడేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు బ్రహ్మాజీరావును విజయవాడ శివారులోని నున్న వద్దకు పిలిపించాము. కానీ ఆయనపై దాడి చేయలేదు. విశాఖపట్నంకు చెందిన తాతాజీ.. బ్రహ్మాజీరావుకు దళారిగా వ్యవహరించారు’ అని నిందితుడు చలపాటి వెంకటేశ్వరరావు భార్య లలితాదేవీ బుధవారం మీడియాకు వెల్లడించారు. తాతాజీ విలేకరులతో మాట్లాడుతూ బ్రహ్మాజీరావు మోసగాడని విమర్శించారు. హవాలా పేరుతో మోసం చేద్దామని నన్ను కూడా ఒప్పించేందుకు ప్రయత్నించేవారని చెప్పారు. కోడ్‌తో కోట్లు అటూ ఇటూ.. దేశ, విదేశాల్లో ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఒక చోట నుంచి మరొక చోటుకు కాలు కదపకుండా, డబ్బు మోసుకెళ్లకుండా కేవలం ఒక్క కోడ్‌తో కోట్లు చేతులు మారిపోతాయి. దీనినే హవాలా అని పిలుస్తారు. ఒక ప్రాంతంలో ఉండే హవాలా ఏజెంట్‌కు కోట్లాది మొత్తాన్ని అప్పగించి ఆయన ఇచ్చే కోడ్ నెంబర్‌ను వేరొక ప్రాంతంలో డబ్బు అందుకోవాల్సిన వారికి చెబుతారు. అక్కడి ఏజెంటుకు అతను ఆ కోడ్ చెబితే ఆ మొత్తాన్ని చేతికి అందిస్తారు. కోడ్‌గా రూ.5 నుంచి రూ.20 నోటు వరకు ఏదో ఒక నోటు ఇచ్చి దానిపై ఉండే సీరియల్ నెంబర్ చూపడం, కారు నెంబర్, మొబైల్ నెంబర్ ఇలా రకరకాల కోడ్లతో కోట్లాది రూపాయాలు చేతులు మారుతుంటాయి. ఇందుకోసం హవాలా ఏజెంట్లు 2 నుంచి 3 శాతం కమిషన్ వసూలు చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ హవాలా కీలక కేంద్రంగా పేరొందింది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ, విశాఖల్లో ఆ వ్యవహారం విచ్చలవిడిగా సాగుతోంది.