హవాలా గ్యాంగులు.. తెర వెనుక ‘పెద్దలు’!
► నిన్న వైజాగ్.. నేడు విజయవాడ
► ఆయా ఘటనల్లో టీడీపీ నేతల ప్రమేయంపై అనుమానాలు
► పెద్ద మొత్తాల్లో రుణాలు, డబ్బు మార్పిడిలో కీలక పాత్ర
► పోలీసుల చేతికి చిక్కకుండా చేతులు మారుతున్న రూ.కోట్లు
► పోలీసులకు సవాలుగా మారిన లావాదేవీలు
రాష్ట్రంలో హవాలా బాగోతాలు హడలెత్తిస్తున్నాయి. ప్రతి కుంభకోణం వెనుక అధికార తెలుగుదేశం పార్టీ నేతల పాత్రలు వెలుగు చూస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత టీటీడీ బోర్డు సభ్యునిగా ఉన్న శేఖర్‌రెడ్డి హవాలా రూపంలో పెద్ద మొత్తంలో కొత్త నోట్లను తెప్పించుకుని దొరికిపోయాడు. చెన్నైకి చెందిన శేఖర్‌రెడ్డికి టీటీడీ బోర్డు సభ్యునిగా పదవి కట్టబెట్టినప్పుడే పలు అనుమానాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకుల సొమ్మును హవాలా రూపంలో విదేశాలకు తరలించడంలో సహకారం అందిస్తున్నందుకే ఆ పదవి ఇచ్చినట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి.
శేఖర్‌రెడ్డి అరెస్ట్ కావడంతో టీటీడీ బోర్డు సభ్యునిగా తొలగించి.. ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నట్లు అప్పట్లో ముఖ్యమంత్రి చేతులు దులిపేసుకున్నారు. ఇటీవల విశాఖపట్నంలో వెలుగు చూసిన హవాలా కుంభకోణం వెనుక రాష్ట్ర మంత్రుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన తండ్రీకొడుకులు వడ్డి శ్రీనివాసరావు, మహేశ్‌లు విశాఖ కేంద్రంగా రెండు డొల్ల కంపెనీల పేరుతో ఏకంగా రూ.1500 కోట్లకు పైగా మొత్తాన్ని హవాలా రూపంలో విదేశాలకు తరలించిన సంగతి తెలిసిందే.
తాజాగా రాష్ట్ర రాజధాని విజయవాడలో వెలుగు చూసిన హవాలా వివాదం ముదిరి క్రిమినల్ చర్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడా టీడీపీ ప్రజాప్రతినిధుల పాత్ర ఉందనే అనుమానాలు గుప్పుమంటున్నాయి. గత ఎన్నికల్లో విజయవాడ కేంద్రంగా ప్రస్తుత కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, మరికొందరు టీడీపీ ప్రముఖులు హవాలా ద్వారా పెద్ద ఎత్తున రాష్టంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు డబ్బు సంచులు అందించారన్న ఆరోపణలున్నాయి. బిల్లులు లేకుండా సరుకు తరలించడం, భారీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ నిర్మాణాలకు పెట్టుబడులకు హవాలా ద్వారా విజయవాడ, విశాఖల్లో పెద్ద మొత్తాలు చేతులు మారడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. ఈ వ్యవహారాల్లో టీడీపీ ముఖ్య నేతలే వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారని ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
బ్రహ్మాజీరావుపై దాడి.. రంగంలోకి దిగిన పెద్దలు
విజయవాడలో ఫైనాన్సియర్ బ్రహ్మాజీరావు కిడ్నాప్, దాడి కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, హెల్డ్ ఆసుపత్రి ఎండీ చలపాటి రవి, సన్ని, వెంకటేశ్వరరావు, శ్రావణ్‌లతోపాటు మరో ఆరుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఈ ఘటన వెనుక కారణాల్లోకి వెళితే.. హెల్ప్ ఆస్పత్రి ఎండీ చలపాటి రవి, టైమ్ ఆస్పత్రి ఎండీ హేమంత్, న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణలతోపాటు మరికొందరికి బ్రహ్మాజీరావు రూ.50 కోట్లు ఫైనాన్స్ సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పారు.
అందుకు రూ.కోటి కమీషన్ తీసుకున్నారని తెలుస్తోంది. చెప్పిన విధంగా రుణం ఇప్పంచలేదు. దీంతో వారు బ్రహ్మాజీరావును కిడ్నాప్ చేసి విజయవాడ శివారులోని ఓ తోటలోకి తీసుకువెళ్లారు. అక్కడ ఆయన్ను తీవ్రంగా కొట్టారు. కొన్ని పత్రాల మీద సంతకాలు తీసుకుని వదిలిపెట్టారు. తీవ్రంగా గాయపడిన బ్రహ్మాజీరావును కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. దాడి చేశారని ఫిర్యాదు చేసినప్పటికీ విజయవాడ పడమట సీఐ కెన్నెడీ సీరియస్‌గా తీసుకోలేదు. మరోవైపు ట్రాఫిక్ ఏసీపీ సూర్యచంద్రరావు ఈ వ్యవహారంలో వైద్యులకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. బ్రహ్మాజీరావు కుటుంబ సభ్యులు విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన ప్రాథమిక విచారణ నిర్వహించి ఏసీపీ సూర్యచంద్రరావును సరెండర్ చేశారు. సీఐ కెన్నెడీని వీఆర్‌కు పంపారు.
ఇది హవాలా డబ్బు వ్యవహారమే!
బ్రహ్మాజీరావు రూ.50 కోట్లు రుణం ఎలా ఇప్పిస్తానని చెప్పారన్నది కీలకంగా మారింది. విదేశాల నుంచి హవాలా రూపంలో భారీగా నగదు మార్పిడి జరుగుతోందని పోలీసులు భావిస్తున్నారు. విదేశాల నుంచి రుణాన్ని ఇప్పిస్తానని బ్రహ్మాజీరావు చెప్పినట్లు నిందితుల కుటుంబ సభ్యులు వెల్లడించారు. మూడేళ్లుగా ఈ వ్యవహారం సాగుతోందని చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో చెప్పినట్టు డబ్బు ఇప్పించక పోవడంతోనే ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తి కిడ్నాప్, దాడి వరకు దారితీసింది. ఈ వ్యవహారం కలకలం రేపడంతో కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత స్వయంగా రంగంలోకి దిగారు.
మరోవైపు ప్రభుత్వ ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడైన ఓ పత్రికాధిపతి కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఓ ఆసుపత్రి ఎండీ ఆయనకు సన్నిహితుడు కావడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కీలక నేత ఈ సెటిల్‌మెంట్ బాధ్యతను తన సన్నిహితుడికి అప్పగించినట్లు తెలిసింది. ఆయన ఇరు వర్గాలతో విజయవాడ భారతీనగర్‌లో బుధవారం ఉదయం రాజీ చర్చలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో కీలక నిందితులు పరారీలో ఉన్నారు. వారిలో కొందరికి అనంతపురం జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ పెద్దలు అంతా రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.
నన్ను కొట్టి నగలు తీసుకున్నారు..
‘పువ్వాడ రవి, సన్ని, చల్లపాటి రవి, వాళ్ల అన్న వెంకటేశ్వరరావు, వారికి మద్దతుగా వచ్చిన కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారు. నా ఒంటి మీదున్న రూ.2 కోట్ల నగులు లాక్కున్నారు. డాక్యుమెంట్ల మీద సంతకాలు తీసుకున్నారు. ఇంటి వద్ద ఉన్న రాళ్ల సంచిని తెప్పించి తీసుకున్నారు. వాటి విలువ ఎంతో తెలియదు. నా ఆస్తి మొత్తం స్వాహా చేయాలన్నది వారి ఉద్దేశం. వారిలో రవి తప్ప మిగిలినవాళ్లెవరూ నాకు తెలియదు.
నా కిడ్నాప్‌లో రవి పాత్రే ఎక్కువ. నన్ను కొడుతుంటే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అక్కడకు వచ్చారు. ఆయన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అని వాళ్లు చెబితేనే తెలిసింది. ఆయన పొడవుగా బక్క పలుచగా ఉన్నారు. నన్ను కొట్టడంతో వాళ్లు చెప్పమన్నట్లుగా నేను చెప్పాను. అదంతా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వీడియో రికార్డు చేశాడు. అనంతరం ఈ నెల 14న ఇంటిలో విడిచిపెట్టారు’ అని విజయవాడ సెంటినరీ ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న బ్రహ్మాజీరావు బుధవారం విలేకరులకు వెల్లడించారు.
బ్రహ్మాజీ మోసం చేశారు
‘విదేశాల నుంచి రూ.5 కోట్లు రుణాన్ని ఇప్పిస్తానని చెప్పి బ్రహ్మాజీరావు మమ్మల్ని మోసం చేశారు. రుణం ఇప్పించేందుకు కమీషన్‌గా రూ.30 లక్షలు ఇచ్చాము. మూడేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు బ్రహ్మాజీరావును విజయవాడ శివారులోని నున్న వద్దకు పిలిపించాము. కానీ ఆయనపై దాడి చేయలేదు. విశాఖపట్నంకు చెందిన తాతాజీ.. బ్రహ్మాజీరావుకు దళారిగా వ్యవహరించారు’ అని నిందితుడు చలపాటి వెంకటేశ్వరరావు భార్య లలితాదేవీ బుధవారం మీడియాకు వెల్లడించారు. తాతాజీ విలేకరులతో మాట్లాడుతూ బ్రహ్మాజీరావు మోసగాడని విమర్శించారు. హవాలా పేరుతో మోసం చేద్దామని నన్ను కూడా ఒప్పించేందుకు ప్రయత్నించేవారని చెప్పారు.
కోడ్‌తో కోట్లు అటూ ఇటూ..
దేశ, విదేశాల్లో ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఒక చోట నుంచి మరొక చోటుకు కాలు కదపకుండా, డబ్బు మోసుకెళ్లకుండా కేవలం ఒక్క కోడ్‌తో కోట్లు చేతులు మారిపోతాయి. దీనినే హవాలా అని పిలుస్తారు. ఒక ప్రాంతంలో ఉండే హవాలా ఏజెంట్‌కు కోట్లాది మొత్తాన్ని అప్పగించి ఆయన ఇచ్చే కోడ్ నెంబర్‌ను వేరొక ప్రాంతంలో డబ్బు అందుకోవాల్సిన వారికి చెబుతారు. అక్కడి ఏజెంటుకు అతను ఆ కోడ్ చెబితే ఆ మొత్తాన్ని చేతికి అందిస్తారు.
కోడ్‌గా రూ.5 నుంచి రూ.20 నోటు వరకు ఏదో ఒక నోటు ఇచ్చి దానిపై ఉండే సీరియల్ నెంబర్ చూపడం, కారు నెంబర్, మొబైల్ నెంబర్ ఇలా రకరకాల కోడ్‌లతో కోట్లాది రూపాయాలు చేతులు మారుతుంటాయి. ఇందుకోసం హవాలా ఏజెంట్లు 2 నుంచి 3 శాతం కమిషన్ వసూలు చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ హవాలా కీలక కేంద్రంగా పేరొందింది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ, విశాఖల్లో ఆ వ్యవహారం విచ్చలవిడిగా సాగుతోంది.